Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 15

 

    "హల్లో...... కిరీటి హియర్."

    "యునాటీ..... నువ్వింత మోసగాడివనుకోలేదు" అలా ఫోన్ లో తనతో భేటీకి దిగేది జయశ్రీ మాత్రమే అని అతనికి తెలుసు. అరణి ఎక్స్ పోర్ట్ ఏజన్సీస్ యజమాని అయిన గజేంద్రకుమార్ భార్య ఆమె.

    "ఏం..... పెళ్ళికాగానే మూగవాడివై పోయావా?"

    "ఉహుఁ, మూగవాడి నయ్యాననే పెళ్ళి చేసుకున్నాను."

    "అబద్ధం."

    "ఏమిటి..... మూగవాడ్ని అవటమా, పెళ్ళి చేసుకోవటమా?"

    "నువ్వు మూగవాడివి కావటం.... అయినా మాట మాత్రం మాతో చెప్పకుండా ఇంత పనిచేశావే..... మేమేమన్నా నీ వెంట పడతామని భయం వేసిందా?"

    "అదికాదు..... అనుకోకుండా జరిగిపోయింది."

    "ఏమిటి పెళ్ళా! మాకు చెప్పకపోవటమా?"

    "రెండూను...."

    "నిన్ను షూట్ చేయాలి."

    "వెల్ కం"

    "మీ ఆవిడ్ని చూపిస్తావా?"

    "విత్ ప్లజర్...."

    "నీలా స్మార్ట్ గా ఐమీన్ ప్రెట్టీగా వుంటుందా బాగా చదువుకుందా.... పేరేమిటి....?"

    "ఇంత పెద్ద క్వశ్చనీర్ కు జవాబు చెప్పడం ఫోన్ లో సాధ్యం కాదు."

    "మరేం చేయాలట...." గోముగా అడిగింది.

    "బందుమిత్ర సపరివారసమేతంగా వేంచేస్తామంటే ఓ బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తాను."

    "బంధుమిత్ర సపరివారం అంటూ మావార్ని మర్చిపోయావు."

    "మీ శ్రీవారు సపరివారంలోకే వస్తారులే...."

    "యూ నాటీ....."

    "ఇక శెలవా....."

    "ఏం..... మీ ఆవిడతో మాట్లాడుకోవాలనుందా."

    "ఉహుఁ! మీ వారితో మాట్లాడుకుంటావేమోనని."

    "బోర్...."

    "సీయూ లేటర్....."

    ఫోన్ పెట్టేశాడు.

    తుఫాన్ వెలిసినట్టుగా వుంది.

    భూషణ్ ని పిలిచి అఫీషియల్ ట్రంకాల్స్ తప్ప కనెక్ట్ చేయొద్దని ఇన్ స్ట్రక్షనిచ్చాడు.

    అయిష్టంగానే ఇంటికి ఫోన్ చేశాడు.

    శిల్పే ఫోన్ అందుకుంది.

    "నేను కిరీటిని మాట్లాడుతున్నా..... బోర్ గా ఉందా?"

    "మీ స్నేహితులంతా అభినందనలతో ఊదరగొట్టేస్తున్నారు."


    6)

    "పర్సనల్ గానా...."

    "కాదు.... ఫోన్ లోనే....."

    "పెద్ద సర్కిల్ కి చెందినవాళ్ళు..... ప్లీజ్.... కాస్త పేషన్సు చూపించు."

    "............"

    "సాయంత్రం షాపింగ్ కి వెళ్దామా?"

    "అఖ్కర్లేదు......"

    "పిక్చర్...."

    "ఉహుఁ....."

    ఫోన్ డిస్ కనెక్ట్ అవటంతో కొన్ని క్షణాలపాటు రిసీవర్ని పట్టుకుని అలాగే ఉండిపోయాడు.

    ఏం చేయాలి...... ఏం చేస్తే శిల్ప మారుతుంది?

    ఆలోచనలతో అతని తల వేడెక్కి పోయింది.

    సాయంకాలం పెందరాళే ఇంటికి చేరుకోవాలన్న పిచ్చికోరిక కలగటంతో అన్ని అపాయింటుమెంట్స్ కేన్సిల్ చేసుకున్నాడు కిరీటి.

    కారు దిగాక శిల్ప ఎదురొస్తే బాగుండునని, డ్రెస్ మార్చుకున్నాక శిల్ప తన చేతితో కాఫీ అందిస్తే మధురంగా వుండేదని ఆశపడ్డ కిరీటికి అది కేవలం దురాశ మాత్రమే అనిపించటానికి ఎంతోసేపు పట్టలేదు.

    అంత తొందరగా కిరీటి ఏనాడూ ఇంటికి రావటం చూడని నౌకర్లంతా ముందు విస్తుపోయారు. పిదప కొత్త దాంపత్యం కదా అని సరిపెట్టుకున్నారు.

 Previous Page Next Page