సాకిన్ బుత్ ఖాన్ బాష్ నమర్దుమ్ అజారీముకున్
సారాయి త్రాగు, ఖురానును కాల్చేయి, మక్కాను కూల్చేయి, విగ్రహాలను ఆరాధించు. (ఇవన్నీ ఇస్లాం నిషేధించినవి)
కాని మనిషిని మాత్రం హింసించకు!
మనిషికి ఎంత సమున్నత స్థానం కల్పించాడు! మతాలను ధిక్కరించు. బేపర్వా. మనిషి మనసును మాత్రం నొప్పించకు అంటున్నాడండీ!
వేదానికి తొలి నుంచీ ఒక అపకారం జరిగిందని నా అభిప్రాయం. వేదం తొలుత సాహిత్యం. కర్మకాండ తరువాత చేరింది. కర్మకాండ చేరడం తప్పుకాదు. బహుశః కర్మకాండవల్లనే వేదం ఇంతకాలం నిలిచిందేమో! అయితే కర్మకాండ సాహిత్యానికి గ్రహణం పట్టించింది. కర్మకాండ స్వప్రయోజనపరులకు ఉపయోగపడింది. వేదం వారి చేతి కీలుబొమ్మ అయింది. వేదానికి సాహిత్యం ఉందని జనానికి తెలియకుండా పోయింది.
గౌతమ బుద్ధుని నుంచి రామానుజునిదాకా అందరూ వేదపు శ్రేయోభిలాషులే. వారు నిరసించింది కర్మకాండనే! జగద్గురువు ఆదిశంకరుడు విసిగిపోయాడు. 'అవిద్యద్విషయం కర్మ' అని ఉపనిషత్తులను ఆశ్రయించాడు.
వాల్మీకి రామాయణానికీ ఈ దుర్దశే పట్టింది! అవాల్మీకాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.
మొదలు వచ్చిన చెవుల కన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి.
కేవలం కర్మకాండను మాత్రం దృష్టిలో ఉంచుకుని పాశ్చాత్య విద్వాంసులు వేద సమాజాన్ని 'Primitive and largely barbaric society, crude in its moral and religious conceptions. rude in its out look upon the world that environed it' అన్నట్లు వక్రీకరించారు.
ఈ దుస్థితి కేవలం వేదానికి మాత్రమే పర్యాప్తం కాదు. ప్రస్తుతపు అన్ని మత గ్రంథాలూ, కర్మకాండ వరకే సీమితం అయినాయి. ఏ ఒక్క క్రైస్తవ దేశం బైబిలు నీతులనూ, ఏ ఒక్క ఇస్లాం దేశం ఖురాన్ నీతులనూ అనుసరించడం లేదు. ఆచరించడం లేదు!
వేదాన్ని గురించి పాశ్చాత్య విద్వాంసుల వక్రభాష్యాలకు ఆధునిక వేద వ్యాఖ్యాతలు స్పందించారు. వారు వేదంలోని పదాలకు ఆధ్యాత్మిక అర్థాలు వెదకడానికి కృషి చేస్తున్నారు. వేదంలో ఏకేశ్వరోపాసనను నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు!
వేదం - మానవుని మహిమ
మానవుని మహిమను, అతని శక్తిని, అతని అప్రతిహిత ప్రభావాన్ని యజుర్వేదం గుర్తించింది. అంతగా మరొక గ్రంథం గుర్తించి ఉండదు. యజుర్వేదంలో నరుని వ్యక్తిత్వాన్నీ, అతని సామర్థ్యాన్ని అనేక చోట్ల ప్రస్తావించింది. స్తుతించింది. మానవుడు పరిపూర్ణుడు కావాలి. అతనికి ఆత్మజ్ఞానం కలగాలి. అతడు సమర్థుడు, వాటిని సాధించగలడు. యజుర్వేదానికి ఆ విశ్వాసం ఉంది. అందుకే మానవుని మహత్తును వివరిస్తున్నది.
1. అమృతం అసి - అమరుడవు 2. శర్మ అసి - సుఖవంతుడవు. 3. శుక్రం అసి - శక్తిమంతుడవు - పవిత్రుడవు. 4. తేజః అసి - తేజమవు. 5. ధామనామ అసి - యశస్సువు, కీర్తివి. 6. తేజః వేష్ప అసి - తేజస్సునకు ఆలయమవు.
మానవుడు తాను అమరుడను అనుకోవాలి. నిత్య మృత్యు భయం ఉన్నవాడు కార్యసాధకుడు కాజాలడు. అమరత్వం అంటే మృత్యువు లేకుండటం కాదు. శతశరత్తులు జీవించడం. నరుడు మృతి చెందుతాడు. తనపుత్రుని రూపంలో జీవిస్తాడు. "పితావై పుత్రనామాస్వీత్' అవిచ్ఛిన్నంగా కొనసాగే సంతానమే అమరత్వం. సగరుడు ప్రారంభించిన గంగావతరణ కార్యాన్ని భగీరథుడు సాధించాడు. నిరంతరత్వమే అమరత్వం.
నరుడు తన శక్తిని గ్రహించాలి. అతనికి ఆత్మవిశ్వాసం కలగాలి. శక్తి ఆత్మవిశ్వాసం కలవాడు సాధించలేనిది లేదు.
మనిషి దేన్ని సాధించాలి? తాను బాగుపడడం మాత్రం కాదు. లోకానికి సాయపడాలి. సమాజ జీవితానికి తోడ్పడాలి. క్రమంగా జ్ఞానం పెంచుకోవాలి. ఈ ఊరు నాది, ఈ దేశం నాది నుంచి వసుధైవ కుటుంబం, లోకమే నా కుటుంబం అనే స్థితికి చేరాలి.
నరుడు తనను ప్రేమించాలి. తనను ప్రేమించనివాడు ఇతరులను ప్రేమించలేడు. ప్రేమదైవ స్వరూపం అది హాని కలిగించదు. నష్ట పరచదు. మనసును విశాల పరుస్తుంది. వర్ధిల్ల చేస్తుంది. ప్రేమ కుటుంబం, గ్రామం, ఎల్లలు దాటి సమస్తానికీ వ్యాపిస్తుంది. అప్పుడు అతనికి 'ఆత్మవత్సర్వ భూతాని' సర్వ ప్రాణి జాలమూ తానే అవుతాడు. తనకు తాను హాని కలిగించుకోలేడుకదా!
ఒక లిప్త ఆలోచించండి. ప్రతివాడూ ఆత్మవత్ సర్వభూతాని అయినాడనుకొండి, ఎవనికీ ఎవడు హాని చేయడు. నష్టపరచడు. నరుని నుంచి నరునికి హాని జరుగకుండడానికే ఇంత విరాట్ ప్రభుత్వం, పోలీసు, న్యాయ వ్యవస్థ!
'ఆత్మవత్సర్వభూతాని' నాడు ప్రభుత్వాలు ఉండవు. హింస ఉండదు. The state withers away. వేదం సాధించ దలచింది ఈ మానవతా సమాజాన్ని! ఇది ఆదర్శం. ఆదర్శం ఇంత సమున్నతం అయిన సమాజాన్ని పాశ్చాత్య పిండారీలు ఆటవికం అన్నారండీ!
వ్యక్తి నీతి మీద ఆధార పడింది వేద సమాజం. రాజనీతి మీద ఆధారపడింది. పాశ్చాత్య సమాజం. అది వ్యక్తి అవినీతిపరుడు అయ్యే సామగ్రి సాంతం సమకూరుస్తూంది. నలుగురు చూడడానికి 'న్యాయం' నటిస్తుంది. మనం ఇప్పుడు వారి అడుగులకేకదా మడుగులద్దుతున్నాం! ఆలోచించండి.
యజ్ఞానికి అగ్ని, ఆజ్యం, సమిధ అత్యవసరం. అగ్ని అంటే వేడి, వెలుగు. సమస్త ప్రపంచం, సమస్త ప్రాణులు అగ్ని మూలంగానే జీవిస్తునాయి. అగ్ని ఆరిపోయిన్నాడు అంతరిస్తున్నాయి. ఈ సూత్రం గ్రహ నక్షత్రాదులకు సహితం వర్తిస్తుంది. సృష్టి సాంతం అశాశ్వతం. పరమాత్మకు తప్ప ఏ పదార్థానికి శాశ్వతం లేదు.
యజ్ఞానికి వాడే అగ్ని మానవ దేహంలో ఉంది. అది ఉన్నంతసేపే జీవిత దీపం వెలుగుతుంటుంది. ఒకరు నమ్మినా నమ్మకున్నా - విశ్వాసంఉన్నా లేకున్నా అర్థం అయినా, కాకున్నా మానవ శరీరంలో నిత్య యజ్ఞాగ్ని కాపురం ఉంటున్నది. జ్ఞానం కలవాడు ఈ విషయం గుర్తిస్తాడు. యజ్ఞం స్వంతం కోసం మాత్రం కాదు. మానవ కళ్యాణం- లోక కళ్యాణం జీవకారుణ్యం కోసం. కావున జ్ఞాని తన జీవితాన్ని మానవ కళ్యాణానికి అర్పిస్తాడు. అంకితం చేస్తాడు.
అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతుండాలి. ఇది ఆరడానికి వీల్లేదు. మానవుని తొలి కర్తవ్యం జీవించడం. అతని తొలి హక్కు జీవించడం. "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం" ధర్మం సాధించాలంటే తొలుత కావలసింది దేహం.
అగ్ని నిత్యం జ్వలించడానికి సమిధ కావాలి. అన్నం నరుని దేహానికి సమిధ అవుతుంది. అందుకే వేదం అన్నానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
'అన్నంవై దేవా అర్క ఇతి వదన్తి' 'అన్నంవై సర్వేషాం భూతానామాత్మ' అన్నం ప్రాణాః' 'అన్నం ప్రాణమన్న మపానమాహుః' 'రేతోవా అన్నం'
మానవుడు అన్నం జీవించడానికి మాత్రమే తినాలి. తినడానికి జీవించరాదు. ఈ అన్నం భగవత్ ప్రసాదం. దీనిని భగవంతుడు ప్రసాదించిన జీవితం నిలుపడానికి భుజించారు. అన్నార్తులకు అన్నం పెట్టడం యజ్ఞమే అవుతుంది. మనం పెట్టిన అన్నం అన్నార్తుడు తినడాన్ని చూడడంలో ఆనందం ఉంది. ఆనందమే యజ్ఞఫలం.
అన్నం జీవించడానికి జీవితం మానవ కాళ్యాణానికి అనిజ్ఞాని అయినవాడు గుర్తిస్తాడు. ఆచరిస్తాడు.
అన్నం అగ్నిని నిలుపడానికి మాత్రమే. అగ్నిని ప్రజ్వరిల్లచేయాలి. అందుకు ఆజ్యం అవసరం. జ్ఞానం ఆజ్యం అవుతుంది. జ్ఞానంతో అగ్ని జ్వలిస్తుంది. ప్రకాశిస్తుంది. కాంతివంతం అవుతుంది. జ్ఞానాగ్నితో ఆత్మదర్శనం కలుగుతుంది. తానెవరు?
మానవ దేహంలోనే సకల దేవతలూ నివాసిస్తున్నారు. ఈ దేహం దేవతల సదనం. అవయవాల అధిష్ఠాన దేవతలను ఉపనిషత్తులు వివరించాయి. తానెవరు? దేవతలకు నివాస గృహం. ఇంద్రాది సకల దేవతలు తనలోనే ఉన్నారు. అన్ని శక్తులు తనవే! తాను సర్వశక్తిమంతుడు. సకలం సాధించగలడు. ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు. తన ఆత్మ పరమాత్మ స్వరూపం. ఇది ఆతందర్శనం అవుతుంది.
తానుఇంతటి శక్తిమంతుడు. అణు విస్ఫోటనం అంతటిశక్తి తనలో ఉంది. ఈ శక్తిని దేనికి ఉపయోగించాలి. శక్తి వినాశానికీ, కళ్యాణానికీ రెంటిజకీ ఉపకరిస్తుంది. ఈ శక్తి మానవ కళ్యాణానికి, సమాజిక కళ్యాణానికీ, జగత్ కళ్యాణానికీ అని గుర్తించడం ఆత్మజ్ఞానం అవుతుంది. ఆత్మ దర్శనం లేని ఆత్మజ్ఞానం అసాధ్యం.
వృత్రాసుర వధ విషయంలో దేవతలు దధీచి దగ్గరికి వస్తారు. దధీచిన దేహదానం అర్థిస్తారు. అతని వెన్నెముకతో వజ్రాయుధం చేయాల్సివుంది. దేహాన్ని గురించి దధీచి అన్న మాటలు శ్రీ మహా భాగవతం నుండి :-
"ఈ శరీరము నశించునది. ప్రాణికోటి యెడల దయ చూపుట ధర్మమగును. ప్రాణులు దుఃఖమును చూచి దుఃఖించుట సుఖమును చూచి సుఖించుట అక్షయ ధర్మము. ప్రపంచమున ధనము, పుత్రులు, జ్ఞాతులు, తుదకు శరీరము పనికి వచ్చునవి కావు. ఈ శరీరము తుదకు కుక్కుల పాలో, నక్కల పాలో అగుచున్నది. అట్టి శరీరము పరోపకారమునకు ఉపయోగపడిన అంతకు మించి కావలినది యేమి?"
అట్లని యోగ బలమున దధీచి తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. దేహాన్ని దేవతలకు ఇచ్చాడు.
అట్లని అంతా దధీచులు, శిబి చక్రవర్తులు, అలర్కులు కాలేరు. శక్తి ఉన్నంతలో భూతదయ, మానవ కళ్యాణానికి సహాయ పడడమే యజ్ఞం అవుతుంది. ఈ యజ్ఞం ఎవరికి సాధ్యమైనంత వారు చేయాలి. ఇదే మహాయజ్ఞం!
"శతవల్మః విరోహ" అంటుంది. యజుర్వేదం. నూరేళ్ళు వర్థిల్లు అని దాని అర్థం. మానవుడు నూరేవాళ్లు వర్ధిలాలి. నిండు పున్నమి చంద్రునిలా జీవించాలి. చంద్రుని వలె సమస్త ప్రాణి జాలానికీ ఉఅపయోగపడాలి.
"దివి తేజన్మ పరమన్తరిక్షేతవనాభిః
పృథివ్యామధియోనిరత్|" యజుర్వేదం 11- 12
నీ జన్మ దివిలో - విశిష్టమగు అంతరిక్షంలో నీ నాభి - నీ జన్మస్థానం పృథివి అగుచున్నది.
గీతాయజ్ఞం
శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో ఆరు యజ్ఞాలను గురించి ప్రవచించారు.
ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞాస్థథాపరే|
స్వాధ్యాయ యజ్ఞ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంశిత వ్రతాః|
1. ద్రవ్య యజ్ఞం. ద్రవ్యం న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. అన్యాయార్జన మనస్తాపానికి కారణం అవుతుంది. ఆర్జించిన ధనాన్ని ధర్మ కార్యాలకు వెచ్చించాలి.
2. తాపయజ్ఞం. తాపం అంటే దేహాన్ని తపింప చేయడం కాదు. జ్ఞానాగ్నిలో ఆత్మను తపింపచేయడం - తేజోవంతం చేయడం, దీపం వలె తనను తాను కాల్చుకోవడం లోకానికి కాంతి ప్రసాదించడం.
3. స్వాధ్యాయ యజ్ఞం. ఇది కేవలం అధ్యయనంచేయడం కాదు. స్వయంగా శ్రమించి అర్థం చేసుకొన్న దానిని మానవ కళ్యాణానికి ఆహుతి చేయడం, ఆహుతిలో కాంతి ఉంది. వెలుగుంది. ప్రకాశం ఉంది.
4. యోగ యజ్ఞం, యమ నియమాదుల ద్వారా మనసు మీద అధికారం సాధించడం. మనసును కట్టిపెట్టనివాడు అవయవాలకు బానిస! ఇది తనకు తాను బానిస కావడం. తనను తానే నాశనం చేసుకోవడం. మనసు మీద అధికారం సాధించినవానికి అవయాలు ఊడిగం చేస్తాయి. మానసిక శక్తి గలవాడు సకలం సాధించవచ్చు.
5. జ్ఞానయజ్ఞం. ఇది తిమిరంతో సమరం. ఈ లోకం అజ్ఞానాంధకారంలో ఉంది. మానవుడు తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? ఇవి తెలియకున్నాడు. వీటిని తెలిసికోవడం, తెలియపరచడం జ్ఞానం యజ్ఞం అవుతుంది. జ్ఞానయజ్ఞం పరమాత్మను దర్శింపచేస్తుంది.
6. సంశిత యజ్ఞం. ఇది అంతర్గత కామక్రోధాది శత్రువులను అదుపులో ఉంచడం. వాటికి లోంగాకుండడం. నియతవ్రతుడై కర్మలు ఆచరించడం.
అహంక్రతురహం యజ్ఞం స్వధాహ మహమౌషధం
మంత్రోహమహమే వాజ్యమహమగ్నిరహం హుతం - గీత 9 - 16
నేనే క్రతువును, నేనే యజ్ఞమును , నేనే స్వదను నేనే ఔషధిని, నేనే మంత్రమును, నేనే అజ్యమును, నేనే అగ్నిని, నేనే ఆహుతుని
పరమాత్మలో యజ్ఞాన్నీ - యజ్ఞంలో పరమాత్మను దర్శించడం పరమ యజ్ఞం అవుతుంది.
వేదం - చదవడం
వేదం మానవ జాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం. వేదం విషయంలో శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలవానికి జ్ఞానం లభిస్తుంది.
వేదాధ్యయనానికి విధి నిషేధాలు లేవు. తిట్టడానికీ చదవచ్చు. అభ్యంతరం లేదు. అతడు బరువు మోసిన వాడవుతాడు. అందులోని పదార్ధం అతనికి తెలియదు. అతడూ నేర్చుకుంటాడు తిట్లు!
వేదం రామాయణ, బారతాదుల వంటి కథా కావ్యం కాదు. వేదం కర్మ సాహిత్యం, చదవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. చదివినవే మళ్లీ చదవాల్సి రావచ్చు. ఒక్కొక్కచో విసుగూ కలుగవచ్చు. ఇది జీవితం లాంటిది. జీవితంలో చేసిన పనులే చేసేది, అప్పుడప్పుడు విసుగూ కలుగుతుంది.
జీవితమే వేదం. వేదమే జీవితం
వ్యర్థజీవి నరకం చూస్తాడు, సార్థక జీవికి అమృతం లభిస్తుంది. వేదం - జీవితం రెంటిలోనూ కష్టం తప్పక ఫలిస్తుంది.
వేదం వైరాగ్యం బోధిస్తుంది అనేది కేవలం అపప్రధ. వేదం జీవిత విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయిస్తుంది. జీవితం విశ్వరూపి. జీవితానిది విరాట్ స్వరూపం. దాన్ని దర్శించకలగాలి. కష్టమే మరి! వేదం దర్శనం చేయిస్తుంది.
నాకు అర్థం అయినంత వరకు వేద, వేదాంతాలు సార్థక జీవితాన్ని ప్రబోధిస్తున్నాయి. జీవిత సుధను అందిస్తున్నాయి. వైరాగ్యం బోధించినా జీవన గమనానికే ఉపదేశిస్తున్నాయి.
వేదవేదాంగాలను వయస్సు మళ్ళినవారూ, చావు దగ్గర పడ్డవారూ చదవాలనడం పచ్చి పిచ్చిమాట. వాటి నిండా జీవితం పరచుకొని ఉంది. బతకాల్సినవాళ్లు చదవాలి. యువతీ యువకులు చదవాలి. వాటిలో వారు నేర్చుకునేవి చాలా ఉన్నాయి. వయసు మళ్లినవారు నేర్చుకోవలసినది ఏముంటుంది? అయినా జ్ఞానతృష్ణ తీరని వారికి భారత తాత్వికత కల్పతరువు.
పూవును పట్టుకొని వాసన చూడపనిలేదు. ఇంట్లో ఉన్నా పరిమళం వ్యాపిస్తుంది. వేదం ఒక పూదోట. ఇంట పెట్టుకోండి పరిమళిస్తుంది!
అంకితం - పితరులు
మనకు పితరులు దేవతలు. మనుష్యావై జాగరితం పితరిః సుప్తమ్ - మెళుకువతో ఉన్నవారు మనుష్యులు, నిద్రిస్తున్నవారు పితరులు.
మనకు పితరుల వలననే రూప గుణాదులు, విద్యాబుద్ధులు లభిస్తున్నాయి. ఏడు తరాల వారి గుణగణాలు ముఖ్యంగా పై మూడు తరాల ప్రభావం మన మీద ఉంటుంది. వైద్య శాస్త్రం దీన్ని గ్రహించాల్సి ఉంది!
పితరులు మనకు చాలా ఇచ్చారు. కృతజ్ఞతా పూర్వకంగా వారికి శ్రాద్ధాలు పెడ్తున్నాం. తీరని వాటిలో పితృ ఋణం ఒకటి. అది తీర్చరానిది.
ఋగ్వేద సంహితను మా పితామహులకు అంకితం సమర్పించాను. ఈ శుక్ల యజుర్వేద సంహితను మా మాతామహులు కీర్తిశేషులు శ్రీమాన్ గోవర్ధనం భట్టరాచార్యుల వారికి శ్రీమతి సీతమ్మకు శ్రద్ధాభక్తి సమన్వితంగా అంకితం సమర్పిస్తున్నాను.
అంకితం - ప్రచురణ
"వాగర్థావివసంప్రుక్తౌ" అన్నాడు కవికుల గురువు కాళిదాసు. జగత్పితరులను గురించి. ఇది సరిగ్గా రచయితలకూ ప్రచురణకర్తలకూ వర్తిస్తుంది. రచయితది వాక్కు. ప్రచురణకర్తది అర్థం.
కేవలం భవదనుగ్రహం వలన నాలుగు వేదాల అనువాదం చేయగలిగాను. తొలుతనే విన్నవించాను. అచ్చుకు ఆర్ధిక సాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. నాకు కావలిసింది అచ్చుమాత్రం కాదు. పుస్తకం సాధారణ జనానికి అందడం. అందుకు సమర్థుడైన ప్రచురణకర్త అవసరం. నాకు అర్థించడం రాదు. నిరీక్షించాను.
దైవికంగా విచిత్రం జరిగింది. విచిత్రాలు దైవికంగానే జరుగుతాయి!
ఆరోజు ప్రమాది కార్తీక కృష్ణ సప్తమి 28 - 11 - 1999 ఆదివారం సాయంత్రం, వర్జ్యం లేని 5.00 గంటల ప్రాంతం. ఒక యువకుడు పండ్ల సంచితో మా ఇంటికి వచ్చారు. టేబుల్ మీద ఫలాల సంచీ పెట్టారు. "నాపేరు దూపాటి విజయకుమార్. నేను ఎమోస్కో ప్రచురణల తరపున వచ్చాను" అన్నారు.
వారు నన్ను ఒక సమావేశానికి ఆహ్వానించడానికి వచ్చారు. ఆ తేది నాకు అనుకూలంగా లేదు అన్నాను. అంతటితో వారు వచ్చిన పని తీరిపోయింది. ముచ్చట పుస్తకాలమీదికి మళ్లింది. ఇద్దరిదీ ఒకేలోకం - కాలం గడిచిపోతున్నది.
కావాలని కాదు - వేదం ప్రస్తావన వచ్చింది. ఆరుబైండ్లుగా ఉన్న వ్రాత ప్రతుల్ను వారికి చూపించాను. దైవికంగా వారికి వేదం విషయంలో శ్రద్ధాసక్తులు ఏర్పడ్డాయి.
"మేం వేదం ప్రచురిస్తున్నాం" అన్నారు.
ఎమెస్కోవారు 1969లో నా తొలి నవల "చిల్లరదేవుళ్ళు" ప్రచురించారు. వారు సమర్థులు. వేదం జనానికి అందించగలరు. నా గుండె గంతులు వేసింది. ఇది భగవత్ ప్రసాదం. అంగీకరించాను.
కార్తీక కృష్ణ దశమి గురువారం ఉదయం 8. 00 గంటలకు విజయకుమార్ వచ్చారు. శుక్ల యజుర్వేదం వ్రాతప్రతి అందుకున్నారు. అచ్చుకిస్తున్నానన్నారు. 'ఎమెస్కో ఆర్షభారతి' పక్షాన ప్రచురిస్తామమన్నారు. ప్రమాది మార్గశీర్ష కృష్ణ త్రయోదశి 04 - 01-2000 మంగళవారం విజయవాడలో స్వామి అమృతానంద ఆవిష్కరిస్తారన్నారు.
అది నాకు అమృతవార్త.
ఆ ముహూర్తానికే ఆవిష్కరణ జరుగుతున్నది. అది భగవదనుగ్రహం.
వావిళ్ల వారి నుంచి ప్రమాది వరకు ఎవరూ తలపెట్టని ఆంధ్రవచన వేదాలను ప్రచురిస్తున్నందుకు నేనూ, ఆంధ్ర ప్రజానీకం 'ఎమోస్కో ఆర్షభారతి' కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
ఎమెస్కో ఆర్షభారతికి పరమపిత పరాత్పరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
ఈ గ్రంథం శుద్ధప్రతి తయారు కావటంలో ఎంతో శ్రమకోర్చిన చిరంజీవులు దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి, (ఆంధ్రసారస్వత పరిషత్ -హైదరాబాద్) శ్రిష్టి లక్ష్మీ సత్యనారాయణ శర్మ (సంస్కృత విభాగం, హిందూ ఉన్నత పాఠశాల, విజయవాడ)లకు నా శుభాశ్శీస్సులు. వారు వేద భాస్కరానుగ్రహపాత్రులగుదురుగాక.
సర్వేపి సుఖినస్సంతు -అంతా సుఖించాలి.
సర్వేసంతు నిరామయాః - అంతా వ్యాధిరహితులు కావాలి.
సర్వే భద్రాణి పశ్యంతు - అంతా శుభాలు చూడాలి.
మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్ - ఏ ఒక్కడూ దుఃఖ భాజనుడు కారాదు.
ప్రమాధి మార్గశీర్ష కృష్ణ పంచమి సోమవారం డాక్టర్ దాశరథి రంగాచార్య
27-12-1999 సికిందరాబాదు