Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 15


                                   శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్ఖుజం |
`                                  ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

                                             మొదటి అధ్యాయము

                                 జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం |
                                ఆధారస్సర్వ విద్వానాం హయగ్రీవముపాస్శహే ||

1.    ఓం ఇషే త్వోర్జే త్వావాయవ స్థాదేవోవః
    సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ
    ఆప్యాయధ్వమధ్న్యఇంద్రాయభాగం ప్రజావతీరనమీవా
    అయాక్ష్మా మా వస్తేవ ఈశత మాఘశ్కసో ధృవా
    అస్మిన్గోపతౌ స్యాత బహ్వీర్యజమానస్య పశూన్పాహి

    పలాశ లేక శమీ శాఖా! వర్షము కొరుకును, అన్నము, బలము కొరకును నిన్ను కొట్టుచున్నాను.

    ఓ దుడా! నీవు వాయుదేవుతా స్వరూపమవు. వెళ్లుము, మేయుము. సవిత నిన్ను మరల త్రిప్పి పంపును. సూర్యాస్తమయము అయినంత తిరిగిరమ్ము.

    అహింసనీయ గోవులారా! ఇంద్రుని భాగపు పాలను చన్నులందు సురక్షితముగ ఉంచండి. పాలుపితుకునపుడు శ్రేష్ఠతమ కర్మమగు యజ్ఞము కొరకు సమృద్ధిగా పాలు ఇవ్వండి. మీరు  సంతానవతులు కండి. రోగరహితులు కండి. మిమ్ము దొంగలు, కసాయీలు, వ్యాధుడు వశపరచుకొనరాదు. మీరందరు గోపతి- యజమాని- వద్దనే స్థిరముగా ఉండండి.

    పలాశ లేక శమీశాఖా! ఈ యజమాని పశువులను సురక్షితముగా ఉంచుము.

ఆలోచనామృతము

    వేదమున పలాశమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు. పలాశమనగా మోదుగు.

    1. సర్వేషాం వా సహవనస్పతీనాం యోనిర్యత్పలాశః

    2. తేజోవై బ్రహ్మవర్చసం వనస్పతీనాం పలాశః 3. బ్రహ్మ వై పలాశాస్య పలాసమ్ - పత్రం 4. సోమోవై పలాశః.

    శమీ అనగా జమ్మి.

    మొదటి అధ్యాయము :

    1. శంవైప్రజాప్రతిః ప్రజాభ్య: శమీపలాశై కురుత
   
    మోదుగు కొద్దికాలము క్రితము ఊరిబయట విరివిగా కనిపించెడిది. మోదుగు ఆకును బ్రహ్మస్వరూపము అన్నారు. మా బాల్యమున మేము మోదుగాకు విస్తళ్లలో భోజనము చేసినాము. ఏవో ఔషధి విలువలు ఉన్నట్లున్నది.

    ఆకుపచ్చని విస్తరి - తెల్లనిఅన్నము - పసుపు పచ్చని పప్పు - ఎర్రని ఊరగాయ వడ్డించిన విస్తరి పంచరంగులతో కంటికి ఇంపుగా ఉండునది.

    పలాశము పుష్పించుట వసంతాగమన చిహ్నము. పుష్పించిన పలాశవృక్షమున ఆకులుండవు. చెట్టు సాంతము పూయును. మోదుగు పూవు నిప్పుకణికవలె ఉండును.

    పూసిన మోదుగు జ్వాలలు దాల్చినట్లుండును.

    నేను "మోదుగుపూలు" అను నవల వ్రాసినాను.

    జమ్మి చింతవలె దట్టముగా ఉండు వృక్షము. చెట్టు మీద ఉన్న వస్తువు కనిపించనంత గుబురు. అజ్ఞాతవాసమున పాండవులు జమ్మిచెట్టు మీదనే ఆయుధములు దాచినారు. శమీ వృక్షమున అగ్ని దాగిఉన్నది.

    వృక్షములు మానవుని సంరక్షించును. ఈ విషయమును ఏనాడో వేదము గుర్తించినది దీనిని గుర్తించక ఆధునికులు అరణ్యములను ధ్వంసము చేసినారు. ఇప్పుడు విలపించుచున్నారు!

    కొమ్మను కొట్టుటకు గల కారణమును వృక్షమునకు చెప్పి కొమ్మను కొట్టుట ఈమంత్రము నందు చెప్పబడినది. వృక్షమును 'యజమానస్య పశూన్పాహి' అని ప్రార్థించుచున్నాడు. వృక్షమునాకు దేవత  అంతటి గౌరవము ఇచ్చి రక్షించుకున్నది వేదము.

    'యద్యప్య చేతనాశాఖా తథాపి తడభిమానినీం దేవతాముద్దిశ్యైవముక్తమ్" మహీధరవ్యాఖ్యా.

    మోదుగు, జమ్మి చెట్ల ఓషధీవిలువలను తెలిసికొనవలసి ఉన్నది. నిమ్మ, వేప, తులసి వృక్షములను వలె వీటివిలువలను కూడా అమెరికన్లు తెలిసి కొందురేమో!

    పాలిచ్చుగోవులు యక్ష్మాది రోగములు లేకుండవలెను అన్నాడు. అవి దొంగలు, కసాయీలు, వేటగాళ్ళ పాలుకారాదన్నాడు.

    గోవు తన స్తనమునందలి పాలు దేవకార్యమునకు భద్రపరచవలెనట! పితుకునప్పుడు పాలు సమృద్ధిగా ఇవ్వవలెనట!!! ఎందు కొరకు?

    "శ్రేష్ఠతమాయ కర్మణ" అవి శ్రేష్ఠతమ మగు యజ్ఞమునకు - మానవ కళ్యాణమునకు ఉపయోగపడవలెనట!!!

    ఎంతటి ఉదాత్త- ఉన్నత ఆలోచన!

    చంద్రుని మీద అడుగు పెట్టినామని గర్వించు నాగరికత ఆలోచించగలదా?

    ఈ మంత్రపు అర్థము ఇట్లుకూడ చెప్పుకొనవచ్చును:-

    మానవుడు అన్నము ఆర్జించుటకు శ్రమించవలెను. అతడు అన్నము వలన బలవంతుడు కావలెను. రోగములు లేనివాడు కావలెను.

    బలవంతుడు ఆరోగ్యవంతుడై శ్రేష్ఠతమమగు మానవ కళ్యాణముచేయవలెను. పాలించువారు పాపిష్ఠులు, దొంగలు కాకుండ మానవుడు అప్రమత్తుడు కావలెను.

    2. పవిత్రమా! నీవు యజ్ఞసాధనములగు దుగ్ధములను పవిత్రము చేయుదానవు.

    ఓ పళ్లెరమా! నీవు ద్యులోకమవు. భూలోకమవు. నీవు దివ్వెను ధరించుదానవు.

    దీపమా! నీవు అందరను భరించుదానవు. నీవు ఉత్తమ తేజముగల అగ్ని కన్న దృఢతరమ వగుము. నీవు వంకరకాకుము. యజ్ఞస్వామి సహితము నిన్ను వంకర చేయజాలకుండవలెను.

    ఆలోచనామృతము:
   
    పవిత్రము అనగా రెండు మూడు దర్భలతో చేసినది.

    ఆరోగ్యవంతములగు పాలను గురించి తొలిమంత్రమున చెప్పినాడు. అట్లయ్యు పాలను పవిత్రము చేయుటకు దర్భలను వాడవలెననుచున్నాడు.

    దర్భలు పవిత్రము చేయుటకు ఉపయోగపడునవి.

    దీపమే కదా వెలుగు నిచ్చునది. నూనె దివ్వె అయినను, విద్యుద్దీపమైనను సరిగా వెలుగవలెను. వంకరగా వెలిగిన ప్రమాదము కలిగించును. ఎంతటి వాడును దీపమును, అగ్నిని దురుపయోగము చేయకుండవలెను.

    మరొక అర్థము:-

    మానవుడే వసువు. ద్యులోకము. భూలోకము. సర్వము మానవుడే. మానవుడు మహిమాన్వితుడు. అతడు తన మహిమను సంకరపనులకు- దుష్కార్యములకు వినియోగించరాదు.
   
    3. పవిత్రమా! శతధారాల దుగ్ధములను పవిత్రము చేయుదానవు. సహస్రధార దుగ్ధములను పవిత్రము చేయుదానవు.

    (అట్లని పవిత్రమును పాలపాత్రలో వేయవలెను)   

    క్షీరమా! సవిత పవిత్రము చేయువాడు. అతడు శతధారపవిత్రమున నిన్ను పావనము చేయును గాత.

    పాలు పితికినవాడా! నీవు ఏ ఆవు పాలు పితికినావు?

    4.(ఆ పాలనిచ్చిన) గోవు విశ్వాయువు. విశ్వమును నిర్మించునది. విశ్వమును పోషించునది.

    తోడుకొనుటకు పాత్రలో ఉంచిన క్షీరమా! నీవు ఇంద్రస్వరూపమవు. పెరుగు చేయుటకు నీలో తోడువేయుచున్నాను.

    విష్ణూ! హవనీయమగు దధిరూప దుగ్ధమును రక్షింపుము.

    ఆలోచనామృతము

    పాలను పవిత్రముచే చేయుట ఈ రోజులలో యాంత్రికముగా పాలను పరిశుభ్రపరచుట వంటిది.

    పెరుగు పాలకన్న బలప్రదము, ఆరోగ్యకరమని ఈమధ్య అమెరికాలో చేసిన పరిశోధన వలన  వెల్లడి అయినది. వేదకాలమున ఎన్ని పరిశోధనలు చేసి పెరుగును కనుగొని ఉందురు? మన గొప్పతనమును మనము గుర్తించుట లేదు! బయటవాడు చెప్పిన చంకలు కొట్టుచున్నాము.

    పెరుగు ఎంతటి పవిత్రమైనదనిన 'విష్ణో హవ్యం రక్ష' అనుచున్నాడు.

    పాలు, పెరుగు విషయమున అంతటి జాగ్రత్త అవసరము.

    5. అగ్నీ! నీవు యజ్ఞపాలకుడవు. నేను వ్రతమును పూర్తిచేయదలచినాను. నాలో వ్రతము పూర్తి చేయు సామర్థ్యము పెంపొందించుము. నీ కృపవలన వ్రతము పూర్తికాని అసత్యము నుండి యజ్ఞమును పూర్తిచేసిన సత్యమును చేరుకొందును.

    "ఇహమహమనృతాత్సత్యముపైమి."

    ఆలోచనామృతము:

    అగ్నిని "వ్రతపతే" అన్నాడు. వ్రతమును పూర్తి చేయుటకు ప్రాణము ముఖ్యము "ప్రాణోవాఅగ్నిః" అన్నాడు. దేహమున వేడి- జీవము- ఉన్నకదా వ్రతసమాప్తి! అందుకే  అగ్నిని ప్రార్థించుట. "శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" దేహమేకదా అన్ని ధర్మములు సాధించునది!

    వ్రతము మాత్రమేకాదు ఏదైనను చేయుదునని చేయకుండుట అనృతము అసత్యము అగును. అందువలన అనృతదోషము కలుగును. ఒక పనిని పూర్తిచేయుట అచ్చపు మానవ ప్రయత్నమున సాధ్యము కాదు. దైవమును  ఆశ్రయించినవే పని పూర్తి అగును. సత్యము ఫలించును.

    6. (యజ్ఞము ప్రారంభించునపుడు జలమునకు ప్రణమిల్లి)

    జలపూర్ణపాత్రా! నిన్ను ఈ కర్మమున నియమించినవారెవరు? నిన్ను ప్రజాపతియే నియమించినాడు.

    పాత్రా! ఎవరికొరకు నిన్ను ఆ ప్రజాపతి నియమించినాడు? అగ్ని కొరకును యజ్ఞము కొరకును నిన్ను నియమించినాడు.

    శూర్చ- అగ్నిహొత్రహవణే! మీ  ఇరువురను యజ్ఞము కొరకు గాను అందుకొనుచున్నాను.

       
                                               శూర్పము-చేట

    7. (ఆ రెంటిని నిప్పుకు కాపుచు)

    రాక్షసులు దగ్ధము చేయబడినారు. దానము చేయనివారు అదాతలు- దగ్ధము చేయబడినారు.

    రాక్షసులు పూర్తిగా భస్మము చేయబడినారు. అదాతలు పూర్తిగా దగ్ధము చేయబడినారు. ఇక నేను విస్తృత అంతరిక్షమున ప్రవేశింతును.

    "ఉర్వంతరిక్షమన్వేమి"

    8. (హవిస్సులు వహించు శకటము అగ్నితో అనుచున్నది)

    నీవు హింసించువాడవు. హింసించు రాక్షసులను హింసించుము. మమ్ము హింసించువారిని హింసించుము. మేము  హింసించువారిని హింసించుము.

    శకటమా! నీవు దేవతల వాహనమవు. భక్తుడవు. పాలకుడవు. ప్రియతముడవు. ఆహ్వానకర్తవు.

    9. శకటమా! కుటిలుడవు కాకుము. సాధుస్వభావుడవగుము. దృఢతరమవగుము. వంగి పడకుము. యజ్ఞపతి సహితము నిన్ను  వంచకుండును గాత.

    శకటమా! నీ మీద విష్ణువు ఎక్కవలెను. వాయువు ప్రవేశించునట్లు విస్తరింపుము. పిడికెడు యవలు మాకు ప్రయోగార్థము ప్రదానము చేయుము.

    10. నేను సవిత ఆజ్ఞప్రకారము ప్రవర్తించు అధ్వర్యుడను. హవీ! అశ్వినుల బహువులతోను, పూష హస్తములతోను నిన్ను పట్టుకొనుచున్నాను. నీవు అగ్నికి ప్రీతికరమగు హవివి. నిన్ను పట్టుకొనుచున్నాను. నీవు అగ్ని సోములకు ప్రీతికరమగు హవివి. నిన్ను పట్టుకొనుచున్నాను.

    11. 9 వ మంత్రము నందలి పిడికెడు గింజల గురించి చెప్పుచున్నాడు:-

    ఇవి భూమిలో విత్తి ఎక్కువ చేయుటకు ఉంచినాను. దానము తప్పించుకొనుటకు మిగల్చలేదు.

    తూర్పున ఆదిత్యుని దర్శింతును. భూమిమీది గృహములు స్థిరములుగా ఉండవలెను. నేను విశాల అంతరిక్షమును అందుకొందును.

 Previous Page Next Page