కొద్దిసేపు తర్వాత వకామె బెడ్ రూమ్ లోకి వచ్చింది. కర్టెన్ చాటున ఉన్న నందితాదేవి పరీక్షగా ఆమెని చూసింది. బక్కపల్చగా తెల్లగా వుంది. బాబ్డ్ హెయిర్ తల, పూల నైటీ ధరించింది. చూడగానే ఆంగ్లో ఇండియన్ లా వుంది. రేడియోలోంచి వినవచ్చే మ్యూజిక్ కి అనుగుణంగా అడుగులు వేస్తూ వచ్చింది. బెడ్ మీద వున్న మ్యాగ్ జయిన్ అందుకుని ముందు గదిలోకి వెళ్ళిపోయింది. చిన్న శబ్దం చెయిర్ లాగినట్లు చెయిర్ లో కూర్చుని వుంటుంది బహుశా.
నందితాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. తను బైటపడి చెపితే ఆమె వినిపించుకోవద్దూ! ఇదోరకం నాటకం దొంగని అంటూ నలుగురినీ పిలచీ గోల చేస్తే వీధిలో తనకోసం కాపలా కాస్తున్న రౌడీలు ఇదే సందని వస్తే? ఊహూ ఇది మంచి పనికాదు.
నందితాదేవి ఆలోచనలు ఆగిపొయ్యాయి. ఆమె గదిలోకి వచ్చింది.
గుమ్మంలోనే ఆగి చూస్తున్నది.
ఆమె చెయ్యి నైటీకున్న జేబులో వున్నది.
ఆమె ఏమిటి చూసేది!
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, ప్రాణాలు పోతాయి. చేతులు పైకి ఎత్తి కర్టెన్ చాటున ఉన్నదెవరో బైటికి రండి" నైటీ జేబులోంచి చిన్న పిస్టల్ తీసి కర్టెన్ వైపు సూటిగా పెట్టి గద్దిస్తూ అంది ఆమె.
నందితాదేవి గుండె ఆగి కొట్టుకోటం మొదలుపెట్టింది! బ్రీఫ్ కేసుతో సహా చేతులు పైకి ఎత్తి పెట్టి కర్టెన్ చాటునుంచి బైటికి వచ్చింది.
నిలువెల్లా వణికిపోతూ భయంతో తెల్లగా పాలిపోయిన ముఖము కంపిస్తున్న ఎర్రని పెదవులు. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని సుందర సుకుమారంగా ఉన్న ఆ పడతిని చూసి ఆమె తెల్లబోయింది. పిస్టల్ పట్టిన చేయి మాత్రం కిందకు దించలేదు. "ఎవరు నీవు?" నందితాదేవిని నిలువెల్లా గుచ్చిగుచ్చి చూస్తూ కంగారుగా అడిగింది.
"నేనే నేనే" నందితాదేవి అంది.
"నీవు నీవేలే పేరు?"
"కుమార్ రాజా బలదేవ్"
"ఆ!" తెల్లబోయి చూసి ఫక్కుననవ్వింది. నందితాదేవికి తన పొరపాటు తెలియవచ్చింది. ఇప్పుడు తను మగవేషంలో లేదు. కంగారుపడుతూ "నంది కాదు కాదు, సరళ కాదు అరుణ"
"చుప్ రహో" ఆమె గద్దించింది.
నోరు మూసుకుంది నందితాదేవి.
"ఆ బ్రీఫ్ కేసులో వుంది ఏమిటి?"
"బ...బ...బట్టలు..."
"పిచ్చివేషాలు వేసి వృధాగా ప్రాణాలు పోగుట్టుకోక బ్రీఫ్ కేసు తెరిచి దానిలో ఏమున్నాయో ఒక్కొక్కటీ తీసి చూపు."
నందితాదేవి నెమ్మదిగా కిందకు కూర్చుని బ్రీఫ్ కేసు తెరిచింది. ఒక్కోటీ బైటికితీసి పరిచినట్లే పెట్టింది. మీసం, చక్కని క్రాపుతో వున్న విగ్గు, సూటు -- బూటు. దువ్వెన, అద్దం, టాయ్ లెట్, సామాను, నాలుగు చీరలు, లంగాలు-జాకెట్లు, టవలు, అలాంటివే మరికొన్ని.
ముందుగా మీసం చూసి తెల్లబోయింది ఆమె.
"నాటకాల్లో వేషాలు వేస్తున్నాను. మా నాటక సమాజం వారికి నాకు పడలేదు. నాటకంలో హీరో వేషం వేసేవాడికి విలన్ బుద్ధులు. నాటక సమాజం వాళ్ళంతా వాడి పక్షమే. బలవంతాన నా మెడలో తాళి కట్టబోయాడు. నా అనేవాళ్ళు నా కెవరూ లేరు. తప్పించుకుని పారిపోయి వచ్చాను. నా వెనుక యిద్దరు మావాళ్ళే పడ్డారు. నోటికి వచ్చిన అబద్దాలు ఆడి నన్ను బలవంతాన లాక్కు వెళతారు. అందుకే మీ యింట్లో దూరి దాక్కున్నాను" నందితాదేవికి బుర్ర పనిచేసింది, కొత్త కధ అల్లి గబగబా చెప్పింది.
ఆమె ఈ కథ నమ్మిందో లేదో దేముడికే తెలియాలి. ఇంకా అనుమానంగానే చూస్తూ "చేతులు పైకి ఎత్తిపెట్టి లేచి నుంచో" అంది.