నందితాదేవి వెనుకనే వురుకులు, పరుగుల మీద వస్తున్న రౌడీలిరువురూ సందులోకి వచ్చారు.
ఆ సందు చివర అడ్డంగా రెండంతస్తుల మేడ వుంది. అటునుంచి మార్గంలేదు. ఆ సందులో అటుయిటూ యిల్లు ఉన్నాయి. పారిపోవటానికి ముందుకు దరి లేదు. వెనక్కు తిరుగుదామంటే రౌడీలు సందుదాకా వచ్చే వుంటారు. నందితాదేవి ఆలోచించ దల్చుకోలేదు. మొండి ధైర్యంతో గేటు తీసికుని ఓ యింట్లోకి దారితీసింది. ఇంటి తలుపులు వేసియున్నాయి. కిటికీలోంచి లైటు వెలుతురు పడుతున్నది. లోపల అలికిడి లేదు.
తను తలుపు తడితే వాళ్ళు యక్ష ప్రశ్నలు వేస్తారు. యీ లోపల వెతుకుతూ రౌడీలు వచ్చేస్తారు. ఇది మార్గం కాదు. నలువైపులా చూసింది. అయిదారు గదులుకూడా వున్నాయో- లేవో బెంగుళూరు పెంకులతో కట్టిన యిల్లు అది. ఇల్లు కుదమట్టంగాను, ఇంటి చుట్టూ పెద్ద స్థలము, చిన్నా పెద్దా అనేకం చెట్లు వున్నాయి.
"హలో" అంటూ ఎవరో ఫోనులో మాట్లాడుతున్నారు. అందమైన ఆడ కంఠం ఇంట్లోంచి వినవస్తున్నది.
నందితాదేవి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. గుబురుగా వున్న మల్లెపొద చాటున దాగి కూర్చుంది. కాంపౌండ్ గోడ ఎత్తుగా లేదు-- సందు కనిపిస్తున్నది. రౌడీలు సందులో కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు.
వాళ్ళు మామూలు రౌడీలు కారు. తను బైట పడాలంటే చిన్న గొందిలాంటి ఒకే మార్గమున్న ఈ సందులోంచి వెళ్ళాలి. ఇప్పుడు కాకపోతే తెల్లారే లోపల తాను బయటకి వచ్చి నడవక తప్పదు. ఇది తప్పని సరి అని వూహించే వుంటారు వాళ్ళు. ఒకరి తర్వాత ఒకరైనా కాపలా కాస్తారు. ఏ యింట్లోంచి ఎవరయినా బయటకు వెళ్తుంటే వారితో పడి మామూలుగా నడుస్తూ సందు దాటాలి. అలా దాటాలంటే ఈ డ్రస్సు మార్చాలి. నందితాదేవి ఎంతో ముందు చూపుతో ఆలోచించింది. మల్లె పొద చాటునే ఉండి బ్రీఫ్ కేస్ తెరిచింది.
మరికొద్ది సేపటిలో సూటూ బూటూ బ్రీఫ్ కేసులోకి వెళ్ళాయి. నందితాదేవి చీర, జాకెట్టు మార్చుకుంది. చీకట్లోనే కూర్చుని తల దువ్వుకుని రెండు జడలు వేసుకుంది. బొట్టు పెట్టుకుని చెవి రింగులు, చేతికి గాజులు ధరించింది.అందమైన ఆడపిల్లలా మారిపోయింది. బ్రీఫ్ కేసు చేతిలోకి తీసుకుని చెట్లచాటు నుంచి కాంపౌండ్ దగ్గరకొచ్చి బైటికి చూసింది!
సందు చివర వకడు నుంచుని బీడీ తాగుతున్నాడు. మరొకడు సందు మొదట్లో వున్న ఇంట్లోకి వెడుతున్నాడు. నందితాదేవికి అర్ధమైపోయింది. ప్రతి యిల్లూ గాలించ దల్చుకున్నారు ఆ రౌడీలు. అంతేకాదు ఏదో కట్టుకధ చెప్పి తన్ని తీసికేళ్ళటానికి గట్ట నిశ్చయంతో వాళ్ళా పనికీ పూనుకున్నారు. తనూ బైటపడి గోల చేసి నలుగురి సాయంతో పోలీసుస్టేషన్ కి వెళ్ళవచ్చు కాని తనది దొంగ బ్రతుకయింది. తను బైటపడితే మొదటికే మోసం వస్తుంది. ఈ ఆపద నుంచి తప్పించుకోవాలి. తొందరపడాలి. వాళ్ళు ఈ ఇంట్లో ప్రవేశించకముందే ఏదో వకటి చేయాలి.
నందితాదేవి గబ గబ వెనుదిరిగింది. ఇంటి మెట్లు ఎక్కి తలుపు తట్టబోయింది. తెరిచే వున్న తలుపులు తెరుచుకున్నాయి కొద్దిగా.
తలుపులు నెట్టుకుని గబుక్కున లోపలికి వెళ్ళి గడియ బిగించింది.
గదిలో తగ్గు స్వరంలో రెడియోలోంచి పాప్ మ్యూజిక్ వినపడుతున్నది. కిచన్ లోంచి కాబోలు మృదువుగా ఆడ కంఠం కూనిరాగం తీస్తున్నది. వంటగది గుర్తుగా గరిట చప్పుడు అవుతున్నది. ఇప్పుడు తను ఆమెకి తన్ని పరిచయం చేసుకుని కథ చెప్పే టైము లేదు. దాక్కోవాలి. పక్క గదిలోకి తొంగి చూసింది. ఎవరూ లేరు.. అది బెడ్ రూమ్. అడుగులు చప్పుడు కాకుండా బెడ్ రూమ్ లో దూరి కర్టెన్ చాటున దాక్కుంది నందితాదేవి.