నిమిషాలు గడుస్తున్నకొద్దీ నేను ముళ్ళమీద వున్నట్లు గడపసాగాను. పిల్లాడు గుడ్లు తేలేసి ,ఊపిరందక నరకయాతన అనుభవిస్తున్నాడు. తల్లి "నా పిల్లాడ్ని రక్షించండి బాబూ!" అని భోరుమని విలపిస్తోంది. నేను యాంటీ సీరమ్ యిచ్చేసి, కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతున్నాను.
ఓ అరగంటయాక వార్డుబాయ్ తిరిగివచ్చి అసిస్టెంటుగారు ఇంట్లో లేరనీ, సినిమాకి వెళ్ళారనీ, ఏ సినిమాకి వెళ్ళారో తెలీదనీ అన్నాడు. నాకు ఒక నిమిషం సేపు కాళ్ళాడలేదు ఇలా మెమోలు పంపుకోవటంతోనే టైమంతా గడిచిపోతోంది. ఇహ సమయం కాస్తా గడిచిపోయాక ఎమర్జన్సీ అర్ధమేమిటి ?
నేను ట్రేకియాటమీ ఎప్పుడూ చేయలేదు గాని విద్యార్ధి దశలో రెండు మూడుసార్లు ఎమర్జన్సీ జరుగుతూండగా చూశాను. ఆపరేషన్ సర్జరీ క్లాసులు జరుగుతూన్నప్పుడు కొన్నిసార్లు చేశాను. టెక్నిక్ క్షుణ్ణంగా తెలుసు.
క్షణాలు గడిచినకొద్దీ పిల్లాడి పరిస్థితి మరీ దిగజారిపోతోంది. చేస్తే వెంటనే చెయ్యాలి. లేకపోతే పిల్లాడు దక్కకపోవటం ఖాయం. చేస్తే ఏభై శాతం అవకాశాలున్నాయి రిస్క్ తీసుకోవడానికే నిశ్చయించుకుని సిస్టర్ని పిలిచి "ట్రేకియాటమీ యిన్ స్ట్రుమెంట్స్ ఇక్కడే వున్నాయా ? ధియేటర్ లోంచి తెచ్చుకోవాలా ?" అనడిగాను.
"అత్యవసర పరిస్థితుల్లో చెయ్యటానికి ఇక్కడో సెట్ వుంచారండి. టైము వుంటుందనుకుంటే థియేటర్ లో చేసేవారు" అంది సిస్టర్.
అయితే ఇన్ స్ట్రుమెంట్సు వెంటనే రెడీ చేయండి. స్పిరిట్ లోగాని, సావ్ లాన్ లోగాని ఒకసారి ముంచి తీసుకురండి."
"మీరు చేస్తారా ? వద్దండీ డాక్టర్, కేసు చాలా బాడ్ గా వుంది. ఏమయినా అయితే మీ కనవసరంగా చెడ్డ పేరొస్తుంది" అంది సిస్టర్, వారించటానికి ప్రయత్నిస్తూ.
"ఫర్వాలేదు. ఏం జరిగినా సిద్ధంగా వున్నాను. తీసుకురండి" అన్నాను, ధృడస్వరంతో.
నా గొంతులోని కాఠిన్యం విని, ఇహ ఆమె ఎదురు చెప్పలేక, ఇన్ స్ట్రుమెంట్స్ తీసుకురావటానికి లోపలకు వెళ్ళింది. ఆమె ట్రేకీయాటమీ త్యూబం బెల్టు మొదలైనవి తెచ్చేలోపల, నేను సబ్బుతో చేతులు వాష్ చేసుకుని రెడీగా వున్నాను. సిస్టర్ని చేతులమీద స్పిరిట్ పోయమన్నాను. తర్వాత గ్లవ్స్ తొడుక్కుని పిల్లాడి దగ్గరకు వెళ్ళాను. ఇదంతా రెండు నిమిషాల్లో జరిగింది.
"ఆపరేషన్ చేస్తారా ?" అంది పిల్లాడి తల్లి, యీ తతంగమంతా చూసి, భయపడుతూ.
"అవునమ్మా, చెయ్యకపోతే అబ్బాయి దక్కడు, చేస్తే ఫలితం నీ అదృష్టం మీద ఆధారపడి వుంది" అన్నాను.
ఆమె వెనువెంటనే, ఆలోచించకుండా, "అలాగే బాబూ! నా బిడ్డని మీ చేతిలో పెట్టాను. నీట ముంచినా, పాల ముంచినా మీదే భారం" అంది ఏడుపు దిగమ్రింగి.
మెడ దగ్గర స్పిరిటుతో శుభ్రంచేసి, ఒక్కసారి వ్రేళ్ళతో తడిమి చప్పున యిన్ షిషన్ ఇచ్చేశాను. ఆ చీలికను వెడంచేసి లోపలకు పోతూంటే వ్రేళ్ళు వణికాయి. భగవంతుడి మీద భారం వేసి చకచక మూడు నిమిషాల్లో పూర్తిచేసి ట్యూబ్ కూడా ఇమిడ్చి, ఇవతలకు వచ్చి గ్లవ్స్ తీసేసి చేతులు కడుక్కున్నాను. తర్వాత మళ్ళీ పిల్లాడి దగ్గరకు వెళ్ళి చూశాను. ఊపిరి కాస్త ఆడుతోంది పల్స్ సంతృప్తికరంగా వుంది.
"ఎలా వుంది డాక్టరుగారూ !" అనడిగింది, తల్లి.
"రేపు ఉదయం దాకా గడవాలమ్మా. అప్పటిదాకా ఏమీ చెప్పలేను" అని మరో అరగంట గడిపి, అక్కడే పిల్లాడు బ్రతకటానికి కాస్త అవకాశాలున్నట్లు గమనించి ఈ వార్త చెప్పటానికి నాయుడుగారి దగ్గరకు వెళ్ళాను.
విషయం విని ఆయన అభినందన పూర్వకంగా భుజంమీద కొట్టి, "రిస్క్ తీసుకున్నా మంచి పనే చేశారు డాక్టరుగారూ! ఆ కుర్రాడు బ్రతికితే జీవితాంతం మీకు ఋణపడి వుండాలి" అన్నాడు.
"నా అదృష్టం బాగుంది పిల్లాడు బ్రతికాడు. టెటనస్ రాకుండా ఎ. టి. ఎస్. ఇన్ జక్షన్ కూడా ఇచ్చాను.
మర్నాడు ఈ విషయం హాస్పటలంతా పొక్కిపోయి నాకు తెలిసిన హౌస్ సర్జన్లంతా వచ్చి అభినందించారు. మృదులకు ఆ రాత్రే తెలుసు డ్యూటీలోనే వుంది కాబట్టి.
"ఇహ మాలాంటి వాళ్ళను మర్చిపోతావు కాబోలు. పెద్ద సర్జన్ వి అయేటట్లు వున్నావు" అంది.
"జీవితంలో సుఖమంటే ఎరుగని, సుఖానికి నోచుకోని బీదవాణ్ని. నన్ను నీవే మరచిపోవాలిగాని, నేనెప్పటికీ ఎవర్నీ మరిచిపోలేను. మృదులా !" అన్నాను.
కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగినట్లున్నా యామెకు. ముఖం ప్రక్కకి త్రిప్పుకుని, మాట్లాడకుండా వూరుకుంది.
"కోపం వచ్చిందా ?"
ఆమె నావంక తిరిగి సజలనయనాలతో చూస్తూ "నేను శ్రీమంతుల బిడ్డనని నీతో ఎప్పుడైనా బడాయిలు చెప్పానా? ఎందు కెప్పుడూ ఈ గొప్పాబీద తారతమ్యం తెచ్చి ఎత్తి పొడుస్తున్నావు ?" అంది దగ్గుత్తికతో.
"లేదు మృదులా ! నాకు ఎత్తిపొడవటం చేతకాదు. ఒక్కోసారి నిజం మాట్లాడాలని వుంటుంది."
ఆ సంభాషణ అట్లా ముగిసింది.
అవకాశం వచ్చినప్పుడల్లా అలాగే చిన్న చిన్న ప్రయోగాలు చేయటం నాకు సరదాగా వుండేది ఒకసారి ఓ కలరా కేసుకు సెలైన్ డ్రిప్ పెట్టటానికి ప్రయత్నిస్తే వెయిన్ దొరకలేదు. ఈ విషయం నాయుడుగారికి చెబుతే "అయితే ఓపెన్ మెథడ్ పెట్టండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఓపెన్ మెథడ్ ! అంటే చర్మంకోసి రక్తనాళం బయటకు తీసి ,అందులోకి సరాసరి సూది ద్వారానో, పాలిథిన్ ట్యూబ్ ద్వారానో సెలైన్ ఎక్కించటం బ్రహ్మవిద్య అని కాదుగాని యిదివర కెప్పుడూ చెయ్యలేదు. అవతల పేషెంటు బాగా డిహైడ్రేటెట్ గా వున్నాడు. నాకేమీ పాలుపోక, ఒక నిమిషం మధన పడ్డాక, ఓ ఉపాయం తోచి గబగబ వార్డు నుండి బయటకు వచ్చి మార్చ్యుయరీకి వెళ్ళాను. ఎయిర్ కండిషన్డ్ ఛాంబర్ లో ఓ వృద్ధుడు శవం కనిపించింది. అక్కడ అటెండర్ నడిగి ఓ స్కాల్ పల్ తీసుకుని దాంతో ఆ శవం కాలిదగ్గర రక్తనాళం బయటకు తీసి ముడివేయడం ప్రాక్టీస్ చేశాను. తర్వాత రెండో కాలిమీద కూడా అలానే చేశాను. తర్వాత రెండో కాలిమీద కూడా అలానే చేశాను. అప్పుడు తిరిగి ఐసొలేషన్ వార్డుకు వచ్చి సిస్టర్ని ఓపెన్ మెథడ్ సెట్ తీసుకురమ్మన్నాడు. రోగికి బాగా నీరు బయటకు వెళ్ళిపోవటంవల్ల రక్తనాళాలు కృంగిపోయి మొదట కొంత కష్టమనిపించినా, ఓ పావుగంట అవస్థపడ్డాక కృతకృత్యుణ్ని కాగలిగాను.
"హమ్మయ్య ?" అంది సిస్టర్ నిట్టూరుస్తూ, "చాలా శ్రమపడ్డారు గాని కాసేపు ఫ్యాన్ క్రింద నిల్చోండి. వళ్ళంతా చెమటలు కూడా పట్టాయి."
వెన్నెముకదగ్గర ప్రత్యేకమైన సూదితో పొడిచి, నీరు బయటకు తీయటాన్ని లంబార్ పంక్చర్ అంటారు. మొదటి రోజున అది చేయవలసి వచ్చినప్పుడు చేతులు వొణికి గాభరాపడిన మాట నిజమే. కాని రానురానూ అలవాటైపోయి, రోజూ యించుమించు ఒకటి చేస్తూ వుండేవాణ్ని. అవకాశాలు కూడా అలాగే వచ్చేవి. ఎప్పుడన్నా అవకాశం రాక ఒకరోజు చెయ్యలేకపోతే ఆ రాత్రి నిద్రపట్టక, ఏదో వెల్తిగా వున్నట్లు అనిపించేది.
సాయంత్రాలు సాధారణంగా ఎక్కడకూ పోయేవాణ్ని కాదు. అంతకు ముందే తోటి హౌస్ సర్జన్లతో సంభాషణ వచ్చినప్పుడు వారివారి వార్డులలో ముఖ్యమైన కేసులు ఏమున్నాయనో, వాటి వివరాలూ అడుగుతూండేవాణ్ని. నా ఆసక్తి చూసి కొంతమంది ఏదో సమాధానం చెప్పి చాటుగా నవ్వుకునేవాళ్ళు. నా గురించి గుసగుస లాడుకున్నట్లు తెలిసేది. కొంతమంది మాత్రం నిజాయితీగా సమాధాన మిచ్చేవాళ్ళు. ఆ ప్రకారం సాయంత్ర వేళల అన్ని వార్డులూ తిరుగుతూ యింటరెస్టింగుగా వుండే కేసులు చూసుకుంటూ వుండేవాణ్ని.
"అదేమిటండీ ఎక్కడి చూసినా మీరే కనిపిస్తున్నారు? మీకు హాస్పిటలే యిల్లూ వాకిలా ? ఇంకేమీ వ్యాపకాలూ, సరదాలూ లేవా?" అనేవారు సిస్టర్లు.
"ఏ వార్డుకు పోయినా ఒక సిస్టర్ ఎదురవుతూ వుండె. ఇంత మంచి కాలక్షేపం యిక్కడ వుండగా వేరే వ్యాపకా లెందుకు ?" అన్నానోసారి, ఒక సిస్టర్ తో.
ఆమె బుగ్గ నొక్కుకుని "అమ్మో! మాటలు రావనుకున్నాను, గడుసువారే" అంది.
డ్యూటీరోజున లిల్లీ "అబ్బ! యివేళ మీరా బాబూ! అయితే నా పని అయిందన్నమాటే. రోజూ ఎడ్మిషన్లు లేకుండా సుఖంగా నిద్దరోతున్నాను. ఇవేళ పేషెంట్లు దండయాత్ర కొచ్చారన్నమాటే" అనేది కళ్ళు తిప్పుతూ.
సరిగ్గా అలాగే జరిగేది కూడా. సాధారణంగా చాలా మంది హౌస్ సర్జన్ లు "రాత్రి డ్యూటీ బ్రహ్మాండంగా వుంది. హాయిగా నిద్రపోయాను" అనో, "వస్తూ వేరుశనక్కాయలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాననో అంటూండేవారు. నా కా యోగమెన్నడూ పట్టలేదు. ఏనాడూ డ్యూటీరోజున సుఖంగా నిద్రపోయి ఎరుగను.
సాయంత్రాలు నేను నిత్యమూ వార్డులకు పోతూ వుండటం చూసి జగన్నాధం తను రెండవసారి చేయవలసిన యింజక్షన్ లు నా కప్పజెప్పేవాడు. కేసులు చూడటానికి అతని వార్డుకి ఎలాగూ పోవలసివుంది. కాబట్టి నాకు కష్టమనిపించేది కాదు.
అయితే ఒక అంశం మాత్రం నాకు తరచు చికాకు కలిగిస్తూ వుండేది. మెడిసిన్ మీద శ్రద్ధాసక్తులున్న ఎవరికైనా హౌస్ సర్జన్ పీరియడ్ మహత్తరమైన దశ. ఉత్సాహముంటే ఎంతో చూడవచ్చు. ఎన్నో నేర్చుకోవచ్చు. కాని విశృంఖలంగా కొత్తకేసులు చూసుకోవటానికి, వాటిని గురించి స్టడీ చెయ్యటానికి హౌస్ సర్జన్ చెయ్యవలసిన యాంత్రికమైన పని ప్రతిబంధకంగా వుండేది. ఎనిమిదింటికల్లా వార్డుకి వెళ్ళటం, కేసు షీటులన్నీ సరిగ్గా వున్నాయో లేదో చూసుకోవటం, బ్లడ్ ప్రెషర్ నోట్ చెయ్యటం, నెత్తురు మొదలైనవి తీసి ఇన్వెస్టిగేషన్స్ పంపించటం, యింతలో అసిస్టెంట్ రౌండ్స్ , చీఫ్ రౌండ్స్ తర్వాత ఇంజక్షన్ ఈలోగా ఏదయినా కేసు సీరియస్ గా వుంటే అక్కడే సపర్యలు చేస్తూ గడపటం_ వీటితో అలిసిపోయినవాడికి ఏ కేసునైనా లోతుగా స్టడీచెయ్యాలన్న ఉత్సాహం చచ్చిపోయేది. ఆ యాంత్రికమైన పనులన్నీ పూర్తి చేసుకుని, తమపని అయిపోయినట్లుగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయేవారు. అందుకే నేను సాయంత్రాలు ఎన్నుకున్నేవాణ్ని.