శ్యామలకు కుతూహలం తొంగి చూసింది. "సరే- నా డ్రాయింగు రూమ్ కి పంపు, యిప్పుడే వస్తున్నాను" అంది. శ్యామల జమీందారిణి హోదాలో ఆగదికేసి నడిచింది. అక్కడ ఓ నలభై నలభై ఐదు సంవత్సరాల మనిషి వున్నాడు వేషం బీదరికాన్నే సూచిస్తుంది. మాసిన కాకి పాంటు, షర్టు వేసుకున్నాడు. జుట్టు బాగా పెరిగి దుబ్బలా వుంది. తాగినట్లున్న ఎర్రటి కళ్ళు, మాసిన గడ్డం వేషం చూడగానే కింద తరగతి మనిషని చెప్పవచ్చు-అతనెవరో చూసినగుర్తు అన్నాలేదు శ్యామలకి. ఆ ఆగంతకుడికి తనతో ఏం పనో కూడా అర్ధంకాలేదు. ఒకసారి అతన్ని పరీక్షగా చూసి "ఎవరు నువ్వు? ఏం కావాలి?" అంది అధికారయుతంగా.
"మీతో ఒక్క విషయం మాట్లాడాలని వచ్చాను" అతను ఏ మాత్రం సంకోచం, భయం, మర్యాద లేకుండా కాస్త పొగరున, నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ అవిధేయత ఆ మాట కరుక్కి శ్యామల మొహం ఎర్రబడింది. గంభీరంగా "మాట్లాడదలచినది, జమీందారుగారితో చెప్పు నాతో నీకేం పని?" అంది నుదురు చిట్లించి. "జమీందారిగారితో నాకేం పనిలేదు మీతోనే వుంది" అన్నాడు అదోలా నవ్వి. శ్యామల మరింత ఆశ్చర్యపడింది. అనుమానంగా చూస్తూ "సరే అదేమిటో చెప్పు?" అంది. అతను యిటు అటు చూసి "ఇక్కడింకెవరూ వుండకపోవడం మీకే మంచిది" అన్నాడు. శ్యామల ఈసారి మరింత ఆశ్చర్యపోయింది. అనుమానంగా చూసింది అతనివంక. యితని విషయం వింతగా వుంది అనుకుంటూ, అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెని తొందరపెట్టింది. "లక్ష్మీ నీవు వెళ్ళు- తలుపులు మూసివెళ్ళు" అంది శ్యామల దాసీది వెళ్ళాక "ఊ........ యింక చెప్పు త్వరగా అవతల నాకు పనివుంది" అంది తీక్షణంగా అతను ఒక్కక్షణం గొంతు సవరించుకుని "పాప సంగతి మాట్లాడాలని వచ్చాను" అన్నాడు శ్యామల వంక సూటిగా చూస్తూ - శ్యామల తెల్లపోయింది!
"పాప -ఏ పాప?" అంది.
"అదే ...... అనాధ శరణాలయంనుంచి మీరు తెచ్చి పెట్టుకున్న ఉష గురించి ......."
"ఉష గురించా? ......" శ్యామల ఆశ్చర్యంగా చూసింది. "ఉష గురించి ఏం మాట్లాడుతావు?" అర్ధం కానట్టు అంది. "అదే - ఉష ఎవరో నాకు తెలుసునని - ఉష సంగతి జమీందారుగారికి తెలియదని -ఆయన దగ్గిర ఈ విషయం దాచి ఉషని నీవు తీసుకొచ్చావని, నాకు తెలుసునని చెప్పడానికి వచ్చాను" అదోలా విషపు నవ్వునవ్వి అన్నాడు అతను. శ్యామల బిత్తరపోయింది. అతనివంక వెర్రిదానిలా చూసింది ఒక్కక్షణం. "నీకు నీకెలా తెలుసు ఈ విషయం?" తడపడుతూ అడిగింది. అతను అదోలా తలెగరేసి నిర్లక్ష్యంగా నవ్వాడు.
"ఎలా తెలిస్తేనేం-నాకు అంత తెలుసు" శ్యామల మెదడు ఒక్కక్షణం శూన్యం అయింది, అంతలోనే నిలద్రొక్కుకుంది. అతనంత నిర్లక్ష్యంగా, అమర్యాదగా మాట్లాడుతుంటే, కోపం వచ్చింది- సాధ్యమైనంత తడబాటు అణుచుకుని "అయితే ఏమిటంటావు?' అంది గంభీరంగా. "జమీందారుగారికి ఈ సంగతి నేను చెప్పకుండా వుండాలని మీరనుకుంటే నాకు వెయ్యి రూపాయలు ఇయ్యాలి" విలాసంగా అన్నాడు అతను. శ్యామల మొహం ఎర్రబడింది. "బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చావా?" అంది.
"నాకు డబ్బవసరం వుంది. మీకీ రహస్యం పైకి పొక్కడం యిష్టంలేదు. అల ఆయనకీ తెలియకుండా వుండాలంటే మీరు డబ్బివ్వక తప్పదు. దీన్ని బ్లాక్ మెయిల్ అన్నా మరొకటి అన్నా మీ యిష్టం" నిర్లక్ష్యంగా శ్యామల ఎదుటే బీడీ తీసి వెలిగించుకున్నాడు. శ్యామలకి ఉద్రేకం ఆగలేదు. కాని ఏం చెయ్యాలో ఆ క్షణాన తోచలేదు. తొందర పడి ఉద్రేకపడితే లాభం ఏమిటని వివేకం హెచ్చరించింది. అయిన నిబ్బరంగానే నిలదొక్కుకుని "డబ్బీయకపోతే ఏం చేస్తావు?" సూటిగా అడిగింది.
"చేయడానికి ఏముంది? నాకు తెల్సిన రహస్యం జమీందారుగార్కి చెప్పి వెడతాను?"
"చెపితే నీకు కలిగే లాభం ఏమిటి?"
"నాకు లాభం లేకపోయినా నీకు నష్టం అన్న సంగతి నీకు తెలుసు, అసలు సంగతి జమీందారుగారికి తెలిస్తే నీవీ రహస్యం దాచి ఆయన్ని మోసం చేసినందుకు.
ఆయన వూరుకుంటారనుకున్నావా? తర్వాత నీగతి ఏమవుతుందో ఆలోచించుకో!" శ్యామల ఎంత నిబ్బరం నటించినా ఆమె కళ్ళల్లో వణుకు ఆరంభించింది, గుండెల్లో దడ, వళ్ళంతా చెమట పట్టింది. ఒక్కక్షణం ఆలోచించి" సరే డబ్బిచ్చాకకూడా నీవు ఆయనతో చెప్పవని నమ్మకం ఏమిటి?" అంది.
"చెప్పను నాకు కావలసింది డబ్బు. ఆ డబ్బు ముట్టాక నీవేం చేస్తే నాకేం అవసరం" శ్యామల ఒక్క క్షణం తటపటాయించి లోపలికి వెళ్ళింది. వెయ్యి రూపాయలు తీసుకొచ్చి యిచ్చి "జాగ్రత్త మళ్ళీ యీ చుట్టుపక్కల కనిపించావంటే వూరుకోను. ఈ రహస్యం పైకి వచ్చిందంటే నీవల్లేనని నాకు అర్ధం అవుతుంది. అప్పుడు నేనేమైనా నిన్ను మాత్రం ఉపేక్షించను. బ్లాక్ మెయిల్ చేస్తున్నావని జైల్లో పెట్టిస్తాను. అర్ధమైందా వెళ్ళు యిక్కడనించి మళ్ళీ నా ఎదుటికి రాకు ఎప్పుడూ!" తిరస్కారంగా, తీక్షణంగా తలుపు మూసింది శ్యామల అతను ఒక నవ్వునవ్వి బయటకి వెళ్ళాడు. శ్యామల సోఫాలో వాలిపోయి తలపట్టుకుంది. ఎదురు చూడని ఈ హఠాత్ సంఘటనకి ఆమె ధైర్యం సడలిపోయింది.
ఆ రోజంతా శ్యామల మనస్సు పాడయింది. బ్లాక్ మెయిల్ కి అలవాటు పడిన వాడు ఒకసారితో వదులుతాడా? మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఎన్నిసార్లు తమ డబ్బు ఈయగలదు? రంగారావుకి తెలియకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టగలదు? అసలు ఈ మనిషి ఆయన కంటపడితే ఎంత ప్రమాదం? ఇలా చాటుమాటుగా అతను వస్తూ పోతూ వుంటే పనివాళ్ళు ఏమనుకుంటారు. అసలింతకీ ఈ విషయం అతని కెలా తెల్సింది? అసలతను ఎవరు? రంగారావుకి ఈ విషయం తెలిస్తే తనెలాంటి పర్యవసానాన్ని ఎదుర్కోవాలి. ఆయన దగ్గర ఈ విషయం దాచినందుకు ఎంత మాత్రం క్షమించారు. కాని- ఎలా చెప్పడం? చెపితే క్షమిస్తారా?
ఎంత ఆలోచించినా శ్యామలకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. తనకర్తవ్యం తట్టలేదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వుంటుందని ఊహించని శ్యామల మనసంతా ఈ సంఘటనలతో అల్లకల్లోలమైంది. ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్నందుకు తనకి తను నిందించుకుంది.