Previous Page Next Page 
శిక్ష పేజి 12


    "అలా అనకు ...... పాపం ఆ తల్లి కన్న బిడ్డని మరేగతి లేక వదిలేయాల్సి వచ్చినందుకు ఎంత బాధపడి వుంటుంది" పాపని ముద్దు పెట్టుకుంటూ అంది శ్యామల ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది. శ్యామల బాధగా ఏదో అనబోయింది ...... యింతలో జమీందారుగారి పిలుపు వచ్చింది. శ్యామల పిల్లను మరోసారి ముద్దు పెట్టుకొని ఆయాకిచ్చి "పాపని జాగ్రత్తగా చూడు సుగుణా వెళ్ళివస్తాను. నీకు చెప్పింది గుర్తుంచుకో -మీకేం కావల్సినా సందేహించక రాయి మరి వస్తాను, వస్తానర్రా పిల్లలదరికి చెప్పి భారంగా కదిలింది. కారు కదులుతూంటే కల చెదిరినట్లు పిల్లలంతా దిగులుపడి నిలుచున్నారు.
    ఆ రాత్రి శ్యామలకు చాలాసేపు నిద్రపట్టలేదు. పక్కమీద యిటు అటు దొర్లుతూ, ఆలోచనలతో సతమతమవుతూ, ఏదో చెప్పాలని ఆరాటపడుతూ, ఎలా చెప్పడం అన్న సంశయంతో నలిగిపోతున్నట్టు కనబడ్డ శ్యామలని వింతగా చూశారు రంగారావు. ఎప్పుడూ సంతోషంగా కళకళలాడే శ్యామల మొహం ఈ రోజు అదోలా వుండడం ఆయన దృష్టిని దాటిపోలేదు.
    "ఏం శ్యామలా - నిద్రపోవడం లేదూ" అన్నాడు మృదువుగా.
    "ఉహు- నిద్రరావడం లేదు యివాళ."
    "ఏం వంట్లో బాగుగాలేదా - అదోలా వున్నావు యివాళ."
    "వంట్లో బాగానే వుంది." శ్యామల నసిగింది.
    "మరి" శ్యామల ఏదో చెప్పాలని నోరు తెరిచింది భర్త మొహంలోకి సూటిగా చూస్తూ.
    "నేనొకటి అడుగుతాను కాదనకుండా చేస్తారా?" ఆఖరికి అనగలిగింది, రంగారావు వింతగా చూశాడు. ఎప్పుడూ ఏ చీరలు, నగలుకొన్నా వద్దు వద్దు అనడం తప్ప ఏదీ నోరు తెరచి అడగని శ్యామల ఈనాడు ఏదో కావాలనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. "ఏమిటది- అడుగు- నేను చేయగలిగింది అయితే చేస్తాను" రంగారావు అభయం యిచ్చాడు. శ్యామల ఒక్కక్షణం తటపటాయించి మనసులో మాట పైకి చెప్పగలిగింది- ఆ మాటకి రంగారావు ముందు ఒక్కక్షణం ఆశ్చర్యపడి, తరువాత తేలిగ్గా నవ్వేశాడు.
    "ఏం అప్పుడే బయట పిల్లల మీద మనసు పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టరని భయమా? నేను అంత ముసలివాడిని కాను" ఛలోక్తిగా నవ్వారాయన. శ్యామల మొహం ఎర్రబడింది. సిగ్గుగా తల దించుకుని ..... "అదికాదు" అదికాదు ఎందుకో ఆ పాప నాకు చాలా నచ్చింది. చాలా ముద్దుగా వుంది. మనకు కాస్త కాలక్షేపం అవుతుందని ....." నసిగింది శ్యామల.
    "బాగానే వుంది. కానీ పెంచుకోవడం అంటే మాటలా- ఎందుకు వచ్చిన గొడవ రేపు మనకి పిల్లలు పుడితే ఏం చేస్తాం బాగా ఆలోచించు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పు" సాలోచనగా అన్నారాయన.
    "ఆలోచించడానికి ఏముంది. మనకి పిల్లలు పుడితే ఆ పిల్లల్తోపాటు పెరగకూడదా ఉష. ఆ ఒక్క పిల్ల మనకిబరువవుతుందా, ఇంట్లో ఇంతమంది వుండగా, " రంగారావు ఆలోచనలో పడ్డారు- "సరే నీకంత ముచ్చటగా వుంటే నాకేం అభ్యంతరం లేదుగాని, అయినా అంతమంది వుండగా ఆ పాపమీదే నీ కెందుకంత మక్కువ?" శ్యామల మొహంలోకి చూసారాయన. శ్యామల జవాబు రానట్టు తడబడింది. ఒక్కక్షణం" చెప్పానుగా అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తుందని, ఎవరో గొప్పింటి పిల్లలాగే వుంది. అంత చక్కని పాప అలా అనాధగా పెరుగుతూంటే నాకేమిటో కష్టంగా వుంది" అంది. రంగారావు శ్యామల వైపు ఒక్కక్షణం అభిమానంగా చూశారు. ఆమె మంచిమనసుకి.
    దయార్ద్ర హృదయానికి మెచ్చుకున్నట్టు ప్రేమగా చేయివేసి దగ్గరకు లాక్కుని "నీ యిష్టం కాదంటానా శ్యామలా అలాగే రేపే వెళ్ళి ఉషని తీసుకొస్తాను" అన్నారు. శ్యామల సంతృప్తిగా ఆయన కౌగిలిలో కరిగిపోయింది.
    ఉషని తీసుకొచ్చి నెలరోజులు గడిచింది. ఈ నెల రోజులనించి శ్యామలకి ఉషతో బాగా కాలక్షేపం అవుతూంది. ఆమె ఆటపాటలు, ముద్దు ముచ్చట్లు చూస్తూ- రకరకాల గౌనులు తొడిగి ముస్తాబు చేస్తూంటే తీరికి చిక్కినంత కాలక్షేపం అవసాగింది. అన్నాళ్ళు పోషణలేక చిక్కిపోయివుండే ఉష యీనెల రోజులకే బొద్దుగా తయారైంది. రంగు మిసమిసలాడసాగింది. దానికితోడు చక్కని బట్టలు తొడగగానే ఏజమీందారు బిడ్డలాగానో వుంది. అంతవరకు కసుర్లు విసుర్లు తప్ప ఆదరణ, ఆప్యాయత, అనురాగం ఎరుగని ఆ రెండేళ్ళ ఉషకి కూడా శ్యామల చూపే అనురాగం, ముద్దు అర్ధమై నెలరోజులకే శ్యామలకి బాగా చేరిక అయి అమ్మా-అమ్మా అంటూ ఎప్పుడు విడవకుండా తిరిగేది. అప్పుడప్పుడే వస్తున్న ముద్దు మాటలతో అందంగా వున్న ఉషని చూస్తే రంగారావు ముచ్చటపడేవాడు. రంగారావు ని శ్యామల 'డాడీ' అని పిలవమని ఉషకి నేర్పింది. ముద్దుగా 'డాడీ' అంటూ దగ్గరికి వచ్చే ఉషని చూస్తే ఆయనకి చాలా ప్రేమ కలిగింది. ఎన్నాళ్ళ తరువాతో యింట్లో చంటి బిడ్డ ఆట పాటలు చూస్తూంటే చాలా తేలిగ్గానే నెలరోజులకే ఉష పట్ల అనుబంధం, ఆత్మీయత ఏర్పడ్డాయి రంగారావుకి. ఉషని చూస్తుంటే ఆపసిపాప కళ్ళల్లో కాంతి చూస్తుంటే ఆయనకి ఎవరో తెల్సిన మొహంలో కన్పించేది." శ్యామలా ఉషని చూస్తుంటే తెల్సిన ఎవరి పోలికో కనిపిస్తూంది. నీకేమనిపిస్తూంది -ఎవరి పోలిక అంటావు" అన్నారు ఓరోజు శ్యామల కాస్త తడబడి సర్దుకుని నవ్వేసింది. "బాగుంది ఎవరి బిడ్డో అనాధగా పెరిగింది. ఆమె ఎవరి పోలికో నాకేం తెలుస్తుంది" అంది.
    "ఊహు కాదు -నాకు బాగా తెలిసిన వాళ్ళ పోలికలున్నాయి. కాని......ఎవరు? ఎక్కడ చూశాను అన్నది గుర్తురావడం లేదు" అన్నారు. శ్యామల యింక మాటలు పెంచే అవకాశం యీయకుండా ఏదో పనున్నట్లుగా లేచి వెళ్ళిపోయింది. "ఉష వచ్చిం దగ్గరనించి నన్ను మరిచిపోతున్నావు- రోజంతా నీకు ఉషతోటే సరిపోతూంది" అనేవారు రంగారావు నవ్వుతూ శ్యామల రాత్రి పడుకోడానికి ఆలస్యంగా వస్తే" పెంచుకున్న బిద్దమీదే నీకింత ప్రేమయితే- రేపు మనకు పుడితే ఇంక అసలు నన్ను చూడవు కాబోలు" అనే వారు "కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు మీకు  తెలియదా" అనేది వచ్చి ..... మొత్తంమీద యిద్దరికీ ఉష ఎక్కడనించో తెచ్చి పెంచుకుంటున్న పిల్లలా అన్పించలేదు. ఉదయం పదకొండు గంటల వేళ శ్యామల పనులన్నీ ముగించుకుని తీరిగ్గా ఉషకు బొమ్మలు పెట్టి ఆడిస్తుంది. రంగారావు ఎవరో పెద్దమనుషులు వస్తే మాట్లాడుతున్నారు. దాసీది వచ్చి "అమ్మా - ఎవరో అతను వచ్చి మిమ్మల్ని చూడాలంటున్నాడు!" అంది. "నన్ను.......నన్ను చూడాలంటున్నాడా ఎవరతను?" ఆశ్చర్యంగా అడిగింది శ్యామల.  తెలీదమ్మా - పేరయినా చెప్పలేదు. మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటున్నాడు?" శ్యామల ఆశ్చర్యంగా "బాబుగారున్నారు చూడమనకపోయావా?" "చెప్పాను- అయ్యగారితో కాదు అమ్మగారితో పని అన్నాడు."

 Previous Page Next Page