సీత ఫైనలియర్ ఎగ్జామిన్స్ రాసేసింది. సెలవులిచ్చారు. ఎలాగోలా ఆమెకి వివాహం చేయడానికి ప్రయత్నాలు చాలా చురుకుగా జరిగినయ్. ఆ రోజు వాళ్ళింటి కెళ్ళేసరికి తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతోందామె.
"ఏమి పుస్తకం అది!" అంటూ లాక్కొని చూశాను.
"సెక్స్ విజ్ఞానం" గురించి వ్రాయబడిన ఇంగ్లీష్ పుస్తకం అంది.
"ఏమిటీ పుస్తకం?" ఆశ్చర్యంగా అడిగాను.
"ఏమిటేంటోయ్! ఇంగ్లీష్ నీకు రాదూ?" అంది విసుగ్గా.
"అందుకే అడుగుతున్నా! ఇలాంటి పుస్తకాలా చదవటం"
"ఏం తప్పా?"
నాకు జవాబు తెలీలేదు. అది తప్పో కాదో నాకు తెలీదు. సీతలాంటి అందమయిన అమ్మాయి ఇలాంటి పుస్తకాలు చదవటం నాకంతగా నచ్చలేదనే చెప్పాలి. అదే అంటే ఆమె కోపంతో అదిరిపడింది.
"బ్లడీ ఫెలో! నువ్వు ఓ అమ్మమ్మగా పుట్టివుంటే బావుండేది. మనం అన్ని విషయాలు గురించీ తెలుసుకొంటున్నప్పుడు సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? ఫారిన్ లో సెక్స్ కూడా ఓ సబ్జెక్టుగా టీచ్ చేయడం లేదూ? వాళ్ళేం పిచ్చాళ్ళా?" అంటూ వివాదంలోకి దిగింది.
"అది సరే! నీకు ఏదో సంబంధం నిశ్చయమైందిటగా?" అన్నాడు టాపిక్ మారుస్తూ.
"అవునట! అమ్మ అంటోంది." అంది నవ్వుతూ.
"కుర్రాడు నచ్చాడా?"
"తర్వాత చెబుతానుగానీ, సాయంత్రం నాలుగింటికోసారి నువ్వు రావాలి! నీతో ఓ చిన్న పనుంది..." అంది మెల్లగా.
"ఏమిటది?" అన్నాన్నేను ఆశ్చర్యంగా.
"ముందు నువ్వు రావోయ్. తర్వాత చెప్తాను. ఆడపిల్లలా భయపడతావేం?" అంది నవ్వుతూ.
సాయంత్రం నాలుగింటికి మళ్లీ ఆమె దగ్గరకెళ్లాను. సీత అప్పటికే డ్రస్ చేసుకొని ఉంది. నల్లని పువ్వుల చీర కట్టుకొని అదేరంగు జాకెట్ వేసుకొంది. నన్ను చూడగానే "పద అలా తిరిగొద్దాం" అంటూ బయల్దేరింది. రోడ్డుమీద కొచ్చేసరికి అప్పుడే మంగినపూడి బస్ వస్తోంది.
"మనం ఈ బస్ లోనే వెళ్లాలి!" అంది సీత.
"ఎందుకు?" అన్నాన్నేను ఆశ్చర్యంగా.
"ఎందుకేమిటి నీ మొహం! వెధవ ప్రశ్నలేయకు..."
ఇద్దరం బస్ లో సీషోర్ చేరుకొన్నాము. ఇసుకలో తీరం వెంబడే చాలాదూరం నడిచాం. నేను పూర్తిగా సస్పెన్స్ లో మునిగిపోయి ఉన్నాను. ఎప్పుడూ ఏదో మాట్లాడే సీత అసలు నోరు మెదపడమే లేదు. సీరియస్ గా ఏదో ఆలోచిస్తోంది. బాగా ఎదిగిన సరుకు చెట్లమధ్య ఇద్దరం కూలబడ్డాం.
"ఏమిటి విశేషాలు చెప్పు!" అన్నాను.
తలెత్తి నావంక చూసింది సీత. ఆమె ముఖం మీద అస్తమించేస్తున్న సూర్యుడి నీరెండపడి తళతళ మెరుస్తోంది. సముద్రం ఘోష అంతకంతకూ ఎక్కువవుతోంది.
"ఎన్నాళ్ళకు నిజమయిన ఆడదానిలా అలంకరించుకొన్నా వివాళ!.. ఎంత బావున్నావో తెలుసా ఇప్పుడు?" ఆమె వంకే చూస్తూ అన్నాను.
చాలాదూరంలో నలుగురు కుర్రాళ్లు సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు.
"వాడ్డూ యూ మీన్? ఇన్నాళ్లూ మొగాడిలా ఉన్నానా?" అంది సీత నవ్వుతూ.
"ఏం? ఇంకా డౌటా?"
"ఏమో? నువ్వన్నది నిజమే అయుండొచ్చు. కాని ఆడది తలొంచుకు నడవటం, ఎప్పుడూ సిగ్గు పడుతూండడం, పాంట్లు, షర్టులు వేసుకోకుండా చీరలే కడుతూండడం, గాజులు వేసుకోడం, ఒక్క మొగాడికే హృదయం ఇచ్చేయడం, వాడు గర్భం చేసి పారిపోతే ఘోల్లున ఏడ్చేయడం, మొగుడు ఛస్తే మగాడిలా రెండోపెళ్ళి చేసుకోకుండా మూల కూర్చోటం - ఇవన్నీ ఆడదాన్ని లక్షణాలని ఈ కుళ్ళు సన్యాసులు, సన్యాసినులు అనుకొంటున్నారు. ఇలాంటి రిపేర్ కి వీల్లేని ఆలోచనలు తొంభై తొమ్మిది పాళ్లు కేవలం ఆడాళ్లల్లోనే వున్నాయి. పైగా పనీపాటా లేక మన రచయిత్రులు ఉండి ఉండి పత్రికల్లో మగాళ్లని దుమ్మెత్తి పోస్తూంటారు. ఆడదాన్ని అణగద్రొక్కిన మగజాతి మీద వ్యాసం వ్రాసి ప్రక్కింటి కుర్రాడికిచ్చి పోస్ట్ చేయిస్తారు. ఆవిడే కవరు స్వయంగా పోస్ట్ లో చేయడానికి ఆడతనం అడ్డొస్తుంది. అక్కడే మొగాడు ఎదిగిపోతున్నాడు. వీళ్లు తాము చేయలేని పనుల గురించి నవలలు వ్రాయగలరు. కాని అదే పని మరో ఆడపిల్లచేస్తే గుండెలవిశేలా బాధపడి ప్రచారాలు మొదలెడతారు..."
"ఈ స్పీచ్ ఇవ్వడానికి నన్నింతదూరం తీసుకొచ్చావ్, నీకేమయినా న్యాయంగా ఉందా ఇది?" మధ్యలో అడ్డుతగిలాను. సీత ఆగిపోయి కిలకిల నవ్వేసింది.
"నిజమే! అనవసరమయిన టాపిక్! కాని నేనీ లెక్చర్ ఇవ్వడానికి నువ్వే కారణం. నేనివాళ ఆడదానిలా కనిపిస్తున్నానని ఎగతాళి చేశావ్... సరే! అదలా వుండనీగాని..." ఓ నిముషం ఆగి మళ్ళీ అందామె. "నిన్నటి నుంచీ అమ్మకీ నాకూ యుద్ధం జరుగుతోంది- అదీ నీ విషయంలో..." ఆఖరి మాటలనెప్పుడు నావంక చూడకుండా సముద్రం వంక చూస్తూ అందామె.
అదిరిపడ్డాను.
"నా విషయంలోనా? ఎందుకూ?"
సీత జవాబు చెప్పలేదు. తలవంచుకుంది.
"మాట్లాడవేం?" అన్నాన్నేను విసుగ్గా.
"ఎందుకో చెప్తాను. ముందు నేను నిన్ను కొన్ని ప్రశ్నలడగాలి. దమ్ముంటే జవాబియ్యి..." నవ్వుతూ అంది.
"ఏమిటా ప్రశ్నలు?"
"నా గురించి ఖచ్చితంగా నీ అభిప్రాయం చెప్పు!"
నాకు మతిపోయినంత పనయింది. సీతకి కొంచెం పర్ వర్టెడ్ నెస్ రాలేదు కదా అనిపించింది.
"నీ వంట్లో బావుందా సీతా! ఇలా అడిగానని ఏమీ అనుకోకు. ఎంచేతంటే నీ మాటలు నాకేమాత్రం అర్థం కావడం లేదు..."
నా మాటలకి సీతకి కోపం కొంచెం ఎక్కువగానే వచ్చుండాలి.
"యూ ఇన్నోసెంట్ ఫూల్!" అంది. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది. సూర్యుడు పూర్తిగా అస్తమించేశాడు. సంధ్య చీకటి అలుముకొంటోంది. కెరటాల ఉధృతం ఎక్కువయింది. సీషోర్ లో మేమిద్దరం తప్పితే మరెవ్వరూ కనిపించటం లేదు.