"మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఇక రావటం రాకపోవటం అన్నది మనచేతుల్లో లేదు. లెటజ్ వెయిట్ ఫర్ పార్చ్యూస్" అంది చేతుల్ని గోడపై ఆన్చుతూ.
"ఈ మధ్య ఎవరైనా ఏంజాబ్ అని అడిగితే చెప్పటానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నారట పాపం ఆ దూరదర్శన్ లో పనిచేసేవాళ్లు. మనం కూడా ఎందుకు తిట్టించుకోవటం....?"
ఆమె ఫక్కున నవ్వింది.
నవ్వుతున్న ఆమెకేసి తన్మయంగా చూస్తుండిపోయాడు అనిల్.
అతని పరధ్యానాన్ని పసిగట్టిన శిరీష చిటిక వేసింది.
అతను వెంటనే తేరుకొని ఏమిటన్నట్లు చూసాడు.
"ఏమిటా పరధ్యానం.....?" నవ్వుతూ అడిగింది.
"అబద్దం చెప్పటం నా కిష్టం లేదు. నిజంగానే మీ నవ్వు చాలా బావుంది....." అంటూనే బస్ కేసి సాగిపోయాడు.
ఆమె అలాగే అతనికేసి చూస్తుండిపోయింది.
* * *
"ఒరేయ్ అనిల్...... గొప్పఛాన్స్ మన ఇంటిముందుకొచ్చింది వప్పేసుకోరా....." టాగూర్ అనిల్ చేతులు పట్టుకుంటూ అన్నాడు.
"ఏంటది....? అనిల్ అడిగాడు.
"వినాయక చవితికి ఉషోదయానగర్ కల్చరల్ అసోషియేషన్ సభ్యులు చందాలు పోగుచేసి నాలుగైదు నాటకాలు వేస్తున్నారట....."
"అయితే మనకేమిటి లాభం?"
వాళ్ళు కుదుర్చుకున్న లేడీ ఆర్టిస్ట్ లాస్ట్ మినిట్ లో మిస్ కొట్టిందట.
"అయితే.....?" అనిల్ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
"ఏం లేదు.....నీకు చీరకడితే అచ్చం ఆడపిల్లలాగే ఉంటావు. అందుకే పాత్రని వప్పేసుకున్నాం. ఒక్క రాత్రికి వంద రూపాయలు ఇస్తారట. పై పెచ్చు అందులోని హీరోయిన్ మూగదట. నువ్వసలు మాట్లాడాల్సిన పనిగాని, డైలాగ్స్ ని బట్టీ పట్టాల్సిన అవసరంగాని లేదు. ఒప్పేసుకోరా" నారాయణ్ బ్రతిమిలాడాడు.
"ఒప్పుకుంటాను. కాని నాకు చీరకడితే అచ్చం ఆడపిల్లలాగే ఉంటానని ఇంకోసారి అనగూడదు ఓ.కే...."
"ఓకే..." అన్నారిద్దరూ ఆనందంగా.
అంతలో ఏదో శబ్దం వినిపించింది. నారాయణ్ గోనెసంచిని తోలిగించి "రండి.....రండి....అడ్వాన్స్ తెచ్చారా?" అన్నాడు ఆశగా అతనికేసే చూస్తూ.
"ఆ....ఆ....తెచ్చాను.....చీరకడితే అచ్చం ఆడపిల్లలా ఉండే కుర్రాడు వచ్చాడా?" అతను అమాయకంగా అడిగాడు.
ఆ మాటలు అనిల్ కి వినిపించా యేమోనని నారాయణ్ కంగారుపడ్డాడు.
"ఆడ వేషం వేసే కుర్రాడు ఉన్నాడా అని అడగొచ్చుగా?" నారాయణ్ చిన్నగా అతన్ని మందలించి లోపలకు రమ్మన్నాడు.
అనిల్ ని అతనికి పరిచయం చేసాడు.
"మాట దక్కించేసారు.....లేకుంటే చందాలు వసూలు చేసుకొని మ్రింగేశామనుకొనేవాళ్ళు.... మా వీధి జనాలు"
"ఇంతకీ విషయాన్ని ముందు బయటకు తీయండి" అన్నాడు టాగూర్ .
అతను వంద రూపాయల నోట్ ని బయటకు తీసి అనిల్ కి అందిస్తూ సరిగ్గా సాయంత్రం ఆరుగంటలకు రావాల్సి ఉంటుంది మీరు అన్నాడు.
ముగ్గురూ ఆనందంగా తలలూపారు.
* * *
"ఏమంది.....?
ఎడిట్ చేసి పంపిస్తానందా?" జయధీర్ పైప్ ని పీలుస్తూ, పచార్లు చేస్తూ అడిగాడు.
"ఎడిట్ చేస్తానని చెప్పింది సార్....." దాదా వినయంగా అన్నాడు.
ఎడిట్ చేయకపోతే ఏం చేయాలని కూడా అప్పటికే ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు జయధీర్.
* * *
"మేడమ్.... మీరేమి అనుకోనంటే చిన్న మాట....."
"స్క్రిప్ట్ చూసుకుంటున్న హంపీ తలెత్తి ఏమిటన్నట్లు కనుబొమ్మల్ని కదలించింది.
"అతను మామూలుగా స్ర్కిప్టుని ఓకే చేయడట మేడమ్. ఎంతో కొంత ఇచ్చుకుంటే తప్ప పని జరుగదని నాతో ఇద్దరు ముగ్గురన్నారు. మన నుంచి కూడా ఆశిస్తుండవచ్చు. కానుక మనం ఆ పద్దతిలో మూవ్ అవనంత కాలం ఏదో ఒక వంక పెట్టి ఆపే ప్రయత్నంలోనే ఉండవచ్చు" విల్సన్ నెమ్మదిగా అన్నాడు.
ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్టు.....తనకే తెలీని తప్పుల్ని ఎత్తిచూసి రిజెక్టు చేశాడు. ఆ కథలో అంతర్లీనంగా చెప్పే మంచి విషయాలు అతని దృష్టికి రాలేదా? వచ్చినా మరో ఉద్దేశ్యంతో తిరస్కరించాడా......?
భవానీ వచ్చి మేడమ్! లైటింగ్ డల్ అయిపోయింది. ఆకాశమంతటా దట్టమైన మేఘాలు కమ్ముకొస్తున్నాయి....." అన్నాడు.
ఆమె అప్పటికేతేరుకుంది.
"ఇంకెన్ని సీన్స్ ఉన్నాయ్......" ఆమె ఇక్కడ మాట్లాడుతున్నా ఆమె ఆలోచన లెక్కడో ఉన్నాయి.
"మూడున్నాయ్ మేడమ్"
"అయితే ఫినిష్ చేసేయడమె బెటర్..... కీ లైట్ ఉపయోగించండి.......ఆటో మేటిగ్గా నేచురల్ లైటింగ్ సెటప్ వచ్చేస్తుంది....." అందామె కెమెరాకేసి నడుస్తూ.
* * *
ఒప్పుకున్న ప్రోగ్రామ్ ప్రకారం డ్రామాలో లేడీ క్యారెక్టర్ ని పోషించేందుకు బయలుదేరాడు అనిల్.
"ఒరేయ్ నేను స్త్రీ పాత్ర ధరించినట్లు మాట వరుసకైనా శిరీషతో అన్నారో చంపేస్తాను......' అంటూ బస్ దిగాడు అనిల్.
"చచ్చినా చెప్పం" నారాయణ్, టాగూర్ ఒకేసారి అన్నారు.
మొత్తానికి ముగ్గురూ కలిసి బయలు దేరారు. ఆ ముగ్గుర్ని చూస్తూనే సెక్రటరీ పరుగుపరుగున వచ్చి "టైమ్ కొస్తారో లేదో అని భయపడిపోయాను, హమ్మయ్య! మాట దక్కించారు....." ఆయాసపడిపోతూ అన్నాడు.
వెంటానే అనిల్ కేసి చూస్తూ "త్వరగా మేకప్ రూమ్ లోకి పదబాబు" అన్నాడు అనిల్ చేయి పట్టుకొని లోపలకు దారి చూపిస్తూ.
మొత్తానికి మరో పావుగంటలో డ్రామా మొదలైంది.
చిన్న స్టేజీ.......ఎదురుగా షూమారు రెండువేల మంది ప్రేక్షకులు.....
అనిల్ ఎలా చేస్తాడోనని నారాయణ్, టాగూర్ కంగారు పడుతుండగా తెర మెల్లగా పక్కకు తప్పుకుంది. ఒక పాత్ర రంగప్రవేశం చేసింది. ఆ పాత్ర అటూ, ఇటూ పచార్లు చేస్తుండగా మరోపాత్ర వచ్చింది. ఐదు నిమిషాలకు మరో స్త్రీ పాత్ర ఎంటర్ అయిపోయింది. డ్రామా జరిగిపోతూనే ఉంది కాని అనిల్ మాత్రం స్టేజీ మీదకు రాలేదు.
"కొంపతీసి వేషం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకోలేదు గదా?" టాగూర్ తన అనుమానాన్ని బయటపెట్టాడు.
"అదేం కాదు......వాడి పాత్ర రంగప్రవేశం చేయవల్సినప్పుడు వస్తాడు నువ్వేం కంగారు పడకు....." అన్నాడు నారాయణ్ ధైర్యంగా.
క్షణాలు...... నిమిషాలు....... గడిచి పోతున్నాయ్. డ్రామా బాగా రక్తికడుతోంది.
అయినా రాలేదు అనిల్...... ఈసారి నారాయణ్ క్కూడా అనుమానం వచ్చింది. వారికిప్పుడు ఆందోళనగా ఉంది.
వేషం ఇవ్వలేదు కనుక ఇచ్చిన వంద వెనక్కు తీసుకుంటే.....?
వాళ్ళలా ఆలోచిస్తుండగా "హలో" అన్న మాటలు వినిపించి ప్రక్కకు చూశారు.
ఆమె.....అక్కడ ..... ఆమె నవ్వుతోంది.
"మీరేమిటి ఇలా వచ్చారు?" నారాయణ్ శిరీషకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
"ఈ ఏరియాలో మా బంధువులున్నారు. చూసెల్దామని వచ్చాను. ఇక్కడేదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని వాళ్ళు బయలు దేరటంతో నాకు రాక తప్పలేదు. అవునూ......మీరేమిటి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు......?" శిరీష వారి ప్రక్కనే కూర్చుంటూ అడిగింది.
"అదీ.....అది....నాకు నాటకాలంటే తెగపిచ్చి.....వీడికీ అంతే......పిచ్చి వెధవ....." అంటూ నారాయణ్ టాగూర్ కేసి చూస్తూ ఏమిటి కర్తవ్యం అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు.
"అది సరే.....మీ ఫ్రెండ్ రాలేదా?" ఇద్దరూ ఉలిక్కిపడ్డారు ఆ ప్రశ్నకు.
"వాడు రాలేదు......ఏదో కంపెనీలో ఖాళీలున్నాయంటే వెళ్లాడు. మధ్యాహ్నం వెళ్ళినవాడు ఇంతవరకూ రాలేదు" చటుక్కున అబద్ధమాడేసాడు టాగూర్.
ముగ్గురూ తిరిగి డ్రామా చూడటంలో నిమగ్నమైనారు.
మొత్తానికి 45 నిమిషాలకు డ్రామా అయిపోయింది. తెరదించేసారు.
జనాలు చప్పట్లు కొడుతున్నారు.
శిరీష లేచింది.
వాళ్ళిద్దరూ లేచి ఆమె వెళ్ళిపోతుందేమోనని ఆశగా చూశారు.
ఆమె బయలు దేరబోతూ "మీకు అబద్ధాలాట్టం కూడా తెలుసన్నమాట"
వాళ్ళు ఉలిక్కిపడ్డారు.
"మీ ఫ్రెండ్ భలే నడిస్తాడే........?"
వాళ్ళకు ఆమె అన్న మాట అర్థంకాలేదు.
"మీ ఫ్రెండ్ మంచి ఆర్టిస్టే......స్త్రీ పాత్రలో అద్భుతంగా నటించారు......"
అనిల్ స్త్రీ పాత్ర ధరించటానికి ఒప్పుకున్నా మాట నిజం. అలాగే స్టేజీ మీదకు రాకపోవటం కూడా నిజం. కాని ఈమె?
వాళ్ళిద్దరూ అయోమయంగా చూశారు.
"అదేం లేదే.....అసలు మావాడు ఈ ప్రాంతానికి రాలేదు.... నారాయణ్ కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాడు.
"ఒక అబద్దాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మరికొన్ని అబద్దాలాట్టం ఏం బావోలేదు. హీరోయిన్ పాత్ర ధరించింది మీ ఫ్రెండే కదా? వస్తాను." అంటూ వడివడిగా ప్రేక్షకుల మధ్యనుంచి బయటకు సాగిపోయింది.
వాళ్ళిద్దరూ షాక్ తిన్నారు.
ఒకరికేసి ఒకరు అయోమయంగా చూసుకున్నారు.
వెంటనే ఇద్దరూ హడావుడిగా గ్రీన్ రూమ్ కేసి పరుగెత్తారు.
అనిల్ అప్పుడే ముఖానికున్న మేకప్ ని తుడిచేసుకుంటున్నాడు.
అనిల్ కి అద్దంలో నారాయణ్, టాగూర్ కనిపించారు.
"ఎలా ఉందిరా నా నటన?"
అనిల్ వాళ్ళవేపు తిరక్కుండానే అడిగాడు.
"హీరోయిన్ పాత్ర వేసింది నువ్వా? ఓర్ని! మేం అసలు గుర్తుపట్టనే లేదు" నారాయణ్ ఆశ్చర్యపోతూ అన్నాడు.
"మీరు గుర్తు పడితే నేనెందుకు యాక్ట్ చేయటం?" అనిల్ చీరను విప్పేస్తూ అన్నాడు.
"కాని......నేను గుర్తుపట్టాను."
ముగ్గురూ ఉలిక్కిపడి వెనుదిరిగి చూశారు.
అక్కడ శిరీష నిలబడుంది.....!!!