Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 12

   
                                                 8

    ఇంటి ముందు రిక్షా ఆగింది.

    కోదండరామయ్య దగ్గర వుంది సొంతగా కట్టించిన కొంప అది.

    ఆ ఇంటికి వాడిన సగం సామానులు ఘనత వహించిన రైల్వే వారివే.

    కోదండరామయ్య పెద్ద భాగంలో తను వుండి అటూ ఇటూ వున్న రెండుభాగాలు అద్దెకి ఇచ్చాడు. శెలవులకి పిల్లా జల్లావచ్చి ఓ నెలరోజులపాటు వుంటాను. అదీగాక తేరగా తెచ్చి పడేసిన సామానుబోలెడు వుంది. అందువల్ల పెద్దభాగం తన క్రింద వుంచుకున్నాడు.

    అద్దెకున్న వాళ్ళు అద్దెకున్న వాళ్ళే. కోదండరామయ్యని "బాబాయిగారూ!" అంటూ వెంకుమాంబని "పిన్నిగారూ!" అంటూ మహా విలువయిస్తారు. కూరలు, పచ్చళ్ళు, పిండివంటలు తెచ్చి రుచి చూడండని పెడతారు.

    తేరగా వచ్చిందితినటం ఆయనకీ ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచీ అలవాటు. "ఎందుకమ్మా! వద్దంటే వినవు కదా!" అంటూనే అంది పుచ్చుకుని ఆరగిస్తుంటారు.

    కోదండరామయ్య కట్టించిన యిల్లు అన్ని సౌకర్యాలతో వుంటుంది! అందువల్ల అద్దెకున్న వాళ్ళు కూడా బంకలా ఆ కొంపనే అంటిపెట్టుకుని ఆ దంపతులకి నైవేద్యం పెడుతుంటారు.

    ప్రస్తుతం అదీ ఆ యింటి కథ.

    వాకిట్లో రిక్షా ఆగంగానే.

    "బాబాయిగారు వాళ్ళూ వచ్చేశారు!" అన్త్ప్ప్ కుడి పక్క వాటాలో వున్న మనోరమ ఆనందంగా అరిచినంత పని చేసింది.

    కోదండరామయ్య, వెంకుమాంబ రిక్షా దిగే సమయానికి మరోరమ వరండాలో కుర్చీలో కూర్చుని తెల్లకాగితాలు ఖరాబు చేస్తున్నది.
    మనోరమ రచయిత్రి కాదు గాని కవయిత్రి, శ్రీశ్రీ ఈమె ముందు బలాదూర్ అనిపించుకోవాలన్న కోరిక కొండంత అయితే వుందిగాని, ఆమె కవిత్వం పసరు మొగ్గలోనే వుంది. పత్రికలవారు స్వీకరించటం మహాగగనంగా వుంది. కొన్ని వేల సార్లు భాగ్యలక్ష్మి టిక్కట్టు కొంటే ఒకటి రెండు సార్లు అయిదు పది రూపాయిల ప్రైజులొచ్చినట్టు వంద రకాల కవిత్వాలు రాస్తే ఒకటి అరా కవిత వెలుగు ముఖం చూస్తున్నాయి.

    కవయిత్రి మనోరమ భర్త శంకర్రావు. ఇద్దరికిద్దరు అన్నట్లు యిద్దరు పిల్లలతో కుడివేపు వాటాలో వున్నది.

    "బాబాయిగారు వాళ్ళూ వచ్చేశారు" అన్న అరుపులాంటి మాట విని ఎడం పక్కవాటాలో వున్న పంకజం ఒక్క పరుగున బయటికి వచ్చేసింది.

    "పిన్నిగారు, బాబాయిగారు వచ్చారు. ఇంక సందడికేం తక్కువలేదు" అని..." ప్రయాణం బాగా సాగిందా పిన్నిగారూ!" అంది పంకజం.
    ".......ఆ" అంది వెంకుమాంబ.

    రిక్షావాడు వరండాలో పెట్టె అతి బలవంతాన దింపి అలసిపోయి చెమట తుడుచుకున్నాడు.

    కవయిత్రి మనోరమ కళ్ళు, పంకజం కళ్ళు పెట్టెమీద పడ్డాయి.

    స్టేషను నుంచి యింటికి రిక్షా మూడు రూపాయలకు మాట్లాడిన కోదండరామయ్య అయిదు రూపాయల నోటుతీసి యిచ్చాడు. రిక్షా అతను రెండు రూపాయలు తిరిగి ఇవ్వబోతుంటే "వుంచుకో వాయ్!" అన్నాడు ధర్మదాత ఫోజులో.

    "ధర్మప్రభువులు. అంతా మీలాగానే వుంటారా! ఎవరో మీ లాంటి వారు కష్టం చూసి యిస్తారు. పెట్టె చచ్చే బరువుంది. మీకు బరువు బాధ తెలుసు కాబట్టి యిచ్చారు" అంటూ రిక్షా అతను వెళ్ళి పోయాడు.

    "కోదండరామయ్య ధర్మ ప్రభువా?" ఆశ్చర్యంగా ముఖ ముఖాలు చూసుకున్నారు పంకజం, మనోరమ.

    కోదండరామయ్య తాళం తీస్తుంటే "పెద్ద ట్రంకు పెట్టె కొనుక్కొచ్చారే బాబాయిగారు." అంది పంకజం.  

 Previous Page Next Page