సముద్రం అలల మీద నుంచి అంకిత్ దూరంగా, ఆకాశం నీరూ కలిసేచోట అదృశ్యమైపోయాడు. మేఘం వర్షించటంతో దృశ్యం మసక బారింది. అది నీటిపొర అని చెంపమీదకు జారాక తెలిసింది.
* * *
నేను ఇంటికి వచ్చేసరికి జాన్, అతని భార్య దయ వచ్చి వున్నారు. జాన్ ని చూడగానే నా మొహం విప్పారింది. నిజానికి ఆ టైమ్ లో నేను ఎవరో ఒక కంపెనీ కోసం మొహం వాచి వున్నాను. మనసు బాధగా వున్నప్పుడు ఒంటరితనం ఎంత బాధాకరమైనదో ఇప్పుడే తెలుస్తోంది.
"ట్రెయిన్ లో వచ్చారా?" అడిగాను.
"అవును. ముందు కార్లోనే వద్దామనుకున్నాం. కానీ....."మనం వెళ్తున్నది అంకిత్ ని చూడటానికి! వాడి కొడుకుని కాదు" అంది దయ. అందుకే ఆ కార్లో రాలేదు".
నేను బిగ్గరగా నవ్వేసాను. జాన్ లో వున్నదదే! ఎటువంటి వాతావరణాన్ని అయినా తేలిక చేయగలడు.
ఆ రాత్రి, బయట ఇంటిముందు లాన్ లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం. ".....అంకిత్ పరిస్థితి ఎలా వుంది?"
"ప్చ్...." భుజాలు కుదిపాను. "నాల్రోజుల్లోనే పరిస్థితి చాలా దిగజారింది. ఆ మిషన్ వల్ల ఏదైనా లాభం వుంటుందేమో చూడాలి".
జాన్ ఏదో అనబోయి మనసు మార్చుకున్నాడు. ఆ తరువాత ఇక ఆ టాపిక్ తీసుకురాలేదు. ఆ తరువాత ఇద్దరం కలిసి వెళ్ళి అరుంధతినీ, అంకిత్ నీ ఇంటికి తీసుకొచ్చాం. అంకిత్ ని చూడగానే దయ పక్కగదిలోకి వెళ్ళింది. బహుశా కళ్ళనీళ్ళు తుడుచుకోవటానికి కాబోలు.
ఆ మరుసటిరోజు డాక్టర్ మహారధిని కలుసుకుందామని జాన్ తో కలిసి ఆస్పత్రికి వెళ్ళాను. మహారధి లేడు. మృణాళిని వుంది. జాన్ ని పరిచయం చేసాను. ఆమె కళ్ళు ఓ క్షణం మెరిసాయి.
"జాన్ డేవిడ్ ..." అంది. ".....మీ పుస్తకాలు కొన్ని చదివాను. చాలా బావుంటాయి. సరీగ్గా చెప్పలేను. కానీ...." అంటూ ఆగి, ఏ పదమూ దొరక్క...... "చాలా బావుంటాయి......" అని నవ్వేసింది. జాన్ కూడా నవ్వి వూరుకున్నాడు. కనీసం థాంక్స్ అంటాడకున్నాను. అన్లేదు.
ఆ తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు మెడికల్ పరిభాషలో కొంచెంసేపు మాట్లాడుకున్నారు. నాకు సరీగ్గా అర్థంకాలేదు. జాన్ డేవిడ్ నావైపు తిరిగి..... "నేనొచ్చిన తరువాత ఆ పని సవ్యంగా జరిగితే ఒక శుభవార్త నీకు చెపుదామనుకున్నాను. కానీ" అన్నాడు.
"ఏమిటది?"
జాన్ జేబులోంచి రెండు కార్టులు తీసి నా చేతిలో పెట్టాడు. నేను ఆశ్చర్యంగా అందుకున్నాను. అవి "డిక్లరేషన్" ......కార్డులు. మరణానంతరం తమ అవయవాలని రోగులకి ఇవ్వవసిందిగా రాసి వుంది. ఒకటి జాన్ మరొకటి దయాది!
"నేనెలాగూ మరణించబోతున్నాను. అది చూసి దయ కూడా తీసుకుంది అయితే మేమిద్దరం ఆ కార్డులు అంకిత్ కోసమే తీసాం. ప్చ్..... బ్లడ్ గ్రూప్ లు కలువలేదు. నాదీ దయదీ కూడా!"
నేను అప్రయత్నంగా జాన్ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. నా మనసులో అదొక అద్భుతమైన ఫీలింగ్! ఎదురుగా వున్నది నా మిత్రుడు కాదని రక్తం పంచుకు పుట్టిన నా సోదరుడనీ అనిపించే ఫీలింగ్! ప్రపంచంలో ఒక మనిషి మరొక మనిషికి ఉపయోగపడటానికి ఏ బంధుత్వమూ అవసరం లేదు. మనిషయితే చాలునన్న ఫీలింగ్!!! నా దృష్టిలో ఆ క్షణం ఆ దంపతులు ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయారు. చేతులు జోడించాలనిపించింది. నవ్వి వూరుకున్నాను.
మృణాళిని పరిస్థితి వేరే విధంగా వుంది. "మరణించబోవటం ఏమిటి?" అని అడిగింది. జాన్ స్పష్టంగా తన పరిస్థితి చెప్పాడు. అతడు సాధారణంగా ఎవరికీ చెప్పడు. చాలాకాలం వరకూ నాకే తెలీదు. సానుభూతి- అతడు అన్నిటికన్నా చివరగా ఆశించేది. కానీ ఆమె డాక్టరు!
అయితేనేం?
ఆమె కూడా మనిషే!
మృణాళిని కంపించటం సృష్టంగా తెలుస్తోంది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక అపురూపమైన వస్తువుని చివరిసారి చూసుకుంటున్నట్టు అభిమానంగా చూసింది అతడివైపు. ఒక రచయితగా అతడి పట్ల ప్రజలకి అంత అభిమానం వుందని నాకు తెలీదు. బహుశా నాకు ఆప్తుడవటంవల్లనో ఏమో- నేనతడి విలువ గుర్తించలేకపోయాననుకుంటాను.
"మీరూ.. మీరూ" అంది మృణాళిని. ఆమె కంఠం గద్గదికమైంది.
డోన్ట్ బి ఎమోషనల్" అన్నాడు జాన్ వారిస్తున్నట్టు.
ఆమె మాట్లాడకుండా మౌనంగా వుండిపోయింది. అతడు మాట మారుస్తున్నట్టు "మా ప్రయత్నాలు మేము చేసాం. చంకలో పిల్లాడ్ని పెట్టుకుని వూరంతా తిరిగినట్టు" అన్నాడు.
"అంటే?" అర్థంకానట్టు అడిగాను.
"తల్లిదండ్రులు మీరుండగా ఇంకేమిటి సమస్య?"
నేను మాట్లాడలేదు. జాన్ అన్నాడు. "మీకు బాధ్యత తెలీదని కాదు. ముత్యంలాంటి కొడుకు వాడు. వాడు నరకయాతన అనుభవిస్తూంటే చూస్తూ మీరెలా వూరుకోగలరు? తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి కిడ్నీ సరిపోక పోవటంమంటూ వుండదు".
మృణాళిని కల్పించుకుని, "అంకిత్ పరిస్థితి ఏమీ బావోలేదు" అంది. "....నాలుగురోజుల్లో చాలా కృశించిపోయాడు. నాకు తెలిసినంతలో ఇలా జరిగిన మొదటి పేషెంట్ ఇతడే! నేనిలా చెపుతున్నానని ఏమీ అనుకోవద్దు. డాక్టర్ మహారధి కేవలం మీకు ధైర్యం ఇవ్వటంకోసం అలా మాట్లాడుతున్నారేతప్ప- ఆ మిషన్ వల్ల లాభ, ఏమీలేదు. కేవలం మనిషిని జీవచ్ఛవంలా బ్రతికించి వుంచుతుందంతే. స్వభావసిద్ధమైన కిడ్నీ అలాకాదు. దానికి పరిపూర్ణమైన ప్రత్యామ్నాయం ఇంకా సృష్టించబడలేదు. మీకీ విషయం తెలుసా? ఆ మిషన్ ఉపయోగించటం వలన పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే- ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ వ్యధ భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు".
ఉలిక్కిపడ్డాను. కలవరంగా "......మృణాళినీ" అన్నాను. ఆమెని పేరు పెట్టి పిలిచే చనువు- అంకిత్ వల్ల, ఈ నాల్రోజుల్లోనే కలిగింది. ఆమె పట్టించుకోకుండా కొనసాగించింది. ".....అంకిత్ మామూలు కుర్రాడు కాదు. విజ్ఞాన ఖని,అతని రక్తం మరింత పాడైపోయి, అది మెదడుని చచ్చుబడేలా చేయకముందే మేల్కొనండి. అంకిత్ ని ఆ బాధనుంచి తప్పించండి".
"ఏం చెయ్యటం?"
"ట్రాన్స్ ప్లాంట్! మీ కిడ్నీని మీ కొడుక్కిబదిలీ చేయటం".
నేనో క్షణం మౌనంగా వూరుకుని...... "మరో మార్గంలేదా?" అన్నాను.
ఆమె ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచింది. ఆమె మొహం ఎర్రగా మారింది. పిడికిలి బిగించి ఆవేశంగా అరిచింది. "నేనింతకాలం శృతి తల్లిదండ్రులే మూర్ఖులు అనుకున్నాను. కానీ మీరు కూడా అదే కోవకి చెందుతారని....."
"నేను చెప్పేది....."
"వినను. పైకి ఎంతో సంస్కారవంతంగా, ప్రేమ మూర్తుల్లా కనిపిస్తూ, కన్నకొడుకుకి కిడ్నీ ఇవ్వటానికి వెనుకంజ వేస్తున్న వారిని నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. మీకన్నా శృతి తల్లిదండ్రులే నయం. లోపలి స్వార్థాన్నీ, రాక్షసాన్నీ పైకే వెళ్ళగక్కారు వాళ్ళు. కన్న కొడుకు నరకయాతన పోగొట్టే మరో మార్గంలేదా అని అడిగే కిరాతకులు మీరు" ఆమె కంఠం అప్రయత్నంగా రుద్ధమైంది. ".....మేమేమీ బలవంతంగా అడగటంలేదే. నిజానికి అంకిత్ మాకేమీకాడు. కానీ నాల్రోజుల సహచర్యంలో అతడిని నేను ఎంతగానో ప్రేమించాను. అలాంటి కొడుకు నాకుంటే వాడికోసం ప్రాణాలయినా అర్పించి వుండేదాన్ని. మాకున్న బాధలో కనీసం వెయ్యవ వంతయినా మీకుంటే ఈపాటికి ఆపరేషన్ జరిగి వుండేది" ఆమె ఆవేశంతో రోప్పుతోంది. జాన్ డేవిడ్ ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. అతడికి కూడా నామీద ఈపాటికే ఏహ్యభావం కలిగి వుంటుంది.
"మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటున్నారంటే- మీ పిల్లాడి ప్రాణంకన్నా మీ చిన్న అవయవానికే విలువ ఎక్కువ అన్నంతగా".
"ఆపండీ!" అరిచాను.
"ఆపను. నా కసి తీరేలా అననివ్వండి! నా ఇన్ని మాటల్లోంచి కనీసం ఒక్కమాట మీ గుండెకు సూటిగా తగిలి మీరు మారితే చాలు- అంకిత్ బాగుపడతాడు".
నేనూ అంతే ఆవేశంగా, "నాకు ఈ ప్రపంచంలో ప్రాణంకన్నా విలివైనది అంకిత్ మాత్రమే" అన్నాను.
జాన్ తాపీగా, "ప్రతి మనిషీ తనకు చాలా సెంటిమెంట్ లు ఉన్నాయని ఊహించుకుని పొంగిపోతూ వుంటాడు. అందులో చాలావరకూ- చిన్న పరీక్షకు కూడా తట్టుకోలేవు" అన్నాడు.
నేను బాణం తగిలిన పక్షిలా విలవిలలాడుతూ చూశాను. ఈ మాటలన్నది జాన్ డేవిడ్!!
అతను కూడా.....!
నా శక్తినంతా కూడగట్టుకున్నాను...... "నేనూ అరుంధతీ మా కిడ్నీలు ఇవ్వలేం. ఎందుకంటే" నా మాట పూర్తికాలేదు.
"మీరు శృతి తల్లిదండ్రులకి భిన్నమైన వారు కాదు కాబట్టి" పూర్తి చేసింది మృణాళిని.
"కాదు.. అదికాదు కారణం".
"మరి ఎందుకు ఇవ్వలేరు?" రెట్టించింది.
నేను ఊపిరి బిగపట్టి చెప్పేసాను. "ఎందుకంటే అంకిత్ ని కన్నవాళ్ళం మేముకాదు కాబట్టి".
అక్కడ నిశ్శబ్దం సింహాసనాన్ని అధిష్టించింది. ఎన్నాడూ తొణకని జాన్ కూడా విభ్రాంతుడై నావైపు చూసాడు. ఆ నిశ్సబ్దం ముందు వినమ్రుణ్ని అయి- చివరిమాట అన్నాను.
"అవును. అంకిత్ మా పెంపుడు కొడుకు".
* * *
రాత్రి ఒంటిగంట అయింది. అరుంధతి బాగా అలసిపోవటం వలన గాఢనిద్రలో వుంది. అంకిత్ కూడా మా రూమ్ లోనే నిద్రిస్తున్నాడు. జాన్ దంపతులు వాడి రూమ్ లో వున్నారు.
నాకు నిద్రపట్టటం లేదు.
లేచి బయట లాన్ లో కూర్చుని బాటిల్ విప్పాను. దూరంగా సముద్రపు హొరు వినిపిస్తూంది. ఒకప్పుడు దాన్ని ఆనందించేవాడిని. ఎక్కడెక్కడినుంచో, ప్రపంచపు అవతలి తీరాల్నుంచి ఎన్నెన్నో కథల్ని తీసుకొచ్చి సంగీత రూపంలో నాకు వినిపిస్తూన్నట్టు వుండేది ఆ కెరటాల చప్పుడు! ఇప్పుడు నా వ్యధకి నేపధ్య సంగీతంలా వుంది అది.
అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. నాలుగైదు గ్లాసులు తాగి వుంటాను. ఇంకో అయిదారు నెలలు పోయాక- అంకిత్ లేని ఇంట్లో నేనూ అరుంధతీ- మేమిద్దరమే- ఎవరి ఒంటరి గూట్లో వారు ఇలాగే కుమిలి కుమిలిపోతూ మిగిలిపోవాలన్న భావన నా గుండెని రంపపు కోత కోస్తోంది.
నేనలా ఆలోచనల్లో కాలిపోతూండగా ముందు తలుపు చప్పుడయింది. జాన్ డేవిడ్ నైట్ డ్రస్ లో బయటికి వస్తున్నాడు. "కిటికీలోంచి చూస్తే చెట్లమధ్య నువ్వు కనిపించావు" వివరణ ఇస్తున్నట్టు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు.