"ఇలా ఎందుకు తాగుతున్నావు?" కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. "ఆనందంగా వున్నప్పుడు ఒకటి రెండు పెగ్గులు ఫర్వాలేదు. అంతేకానీ- ఇది బాధని తగ్గిస్తుందనుకొని తాగటం వేస్టు. దానివల్ల బాధ మరింత ఎక్కువ అవుతుంది".
నాక్కోపం ముంచుకువచ్చింది. విసురుగా. "ఇలాంటి నీతివాక్యాలు నేను లక్ష చెప్పగలను. చదివే వాళ్ళుంటే లక్ష వ్రాయగలను. అనుభవిస్తుంటే తెలుస్తుంది ఆ బాధ" అన్నాను.
"నిజమా" క్లుప్తంగా అన్నాడు. అతడి ఆ ఒక్కమాటలో వున్న వేయి అర్థాలు నాకు అర్థమవటానికి కొంచెంసేపు పట్టింది. "నన్ను క్షమించు. నీలా అందరికీ ఆనందం పంచటం నాకు చాతకాదు. మరణం కూడా బాధ పెట్టని స్థాయికి చేరుకోవటానికి నా మెచ్యూరిటీ సరిపోదేమో" అన్నాను.
"అందరికీ ఆనందం పంచనవసరం లేదు. కనీసం మనం ఆనందంగా వుండగలిగితే చాలు...."
"ఎలా? ఎలా ఆనందంగా వుండటం?"
"బాధపడటం మానేసి ఆలోచించటం ద్వారా".
"ఏం ఆలోచించమంటావ్? అంకిత్ లేకుండా ఆనందంగా వుండటం ఎలా అనా?"
"కాదు. అంకిత్ ని బ్రతికించుకోవటం ఎలా అని".
"అసంభవం! అది కేవలం ఆలోచించటానికే బావుంటుంది".
"ఈ ప్రపంచంలో ఏదీ అసంభవంకాదు. ప్రయత్నించాలంతే!"
"ఏం ప్రయత్నించమంటావ్. సంజీవిని కోసం వెతకమంటావా?"
"అవసరంలేదు. అంకిత్ తల్లిదండ్రులకోసం వెతికితే చాలు".
నేను విభ్రాంతితో జాన్ వైపు చూసాను. అతడు నవ్వేడు. "ఏమీ చెయ్యకుండా కూర్చోవటం కన్నా- ఏదో ఒకటి చేస్తే మంచిది కదా".
"అంకిత్ మా కొడుకు కాదన్న ఆలోచననే మేము భరించలేము. ఇంతవరకూ ఆ భావమే మాకు కలగలేదు. నాకూ అరుంధతికీ తప్ప మరెవరికీ ఈ విషయం తెలియదు. తెలియటం మాకు ఇష్టంలేదు కూడా. అందుకే....అందుకే ఇంతకాలం మీకు కూడా ఈ విషయం తెలియనివ్వలేదు. నీకు తెలుసా జాన్? అంకిత్ కి ఈ విధంగా జరిగిందని తెలిసిన మొట్టమొదటి రోజే నేనూ అరుంధతి పరీక్షలు చేయించుకున్నాము. ఫలితం లేదు. ఆ తరువాత నీవూ, మృణాళినీ, ఇంకా ఎందరో ఇదే ప్రశ్న వేసారు. మేము సమాధానం చెప్పలేదు. మేము స్వార్థపరులమన్న అభిప్రాయం కలిగించటంకన్నా, అంకిత్ మా కన్నకొడుకు కాదు అన్న భావం మాకెక్కువ బాధ కలిగిస్తుంది. మాలో ఒకడిలా అంతగా కలిసిపోయాడు వాడు. ఎలాగూ ఫలితం లేనప్పుడు ఇక చెప్పుకోవటమెందుకు అనుకున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు".
"అర్థం చేసుకోగలను...."
నా హృదయం కాస్త తేలిక పడింది. బహుశా మనసులో మాటని ఇంకొకరితో పంచుకోవటం వల్లనేమో.
"అంకిత్ ని మీరెక్కడ నుంచి దత్తత తీసుకున్నారు?"
"దత్తత కాదు. ఒక తెల్లవారుఝామున మా ఇంటిముందు ఎవరో వదిలిపెట్టి వెళ్లారు. రోజుల శిశువు".
జాన్ కళ్ళు పెద్దవిచేసి చూసాడు. ఏమీ మాట్లాడలేదు. నేనే అన్నాను. "......అందువల్ల అంకిత్ అసలు తల్లిదండ్రులని కనుక్కోవటం కష్టం".
"పేపర్లో ప్రకటిస్తే?" సాలోచనగా అన్నాడు.
ఆ పరిస్థితుల్లో కూడా నాకు నవ్వొచ్చింది.
"......ఏమని ప్రకటిస్తాం? ఫలానారోజు, పది పన్నెండు సంవత్సరాల క్రితం ఫలానా వీధిలో ఫలానా నెంబరు ఇంటి మెట్లమీద మీ కొడుకును వదిలేసి వుంటే- ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో వున్నాడు. వచ్చి రక్షించండి... అని ఇస్తామా?"
"ఇస్తే తప్పేమిటి?"
నేను చివుక్కున తలేత్తాను. అతడు కుర్చీలోంచి లేచి చెట్లమధ్య పచార్లు చేయటం ప్రారంభించాడు.
"......ఆ తల్లి తన బిడ్డని నీ ఇంటిముందు వదిలేసినప్పుడు ఆమె పరిస్థితి ఏమిటో మనకు తెలీదు. వివాహం జరిగి వుండొచ్చు, కాకపోయి వుండవచ్చు. బిడ్డని కన్న తరువాత, ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుని వుండొచ్చు. ప్రస్తుతం వారు కూడా తమ బిడ్డకోసం వెతుకుతూ వుండొచ్చు....."
"నా బిడ్డని నేనివ్వను" చప్పున అన్నాను.
మళ్ళీ నవ్వేడు. "-ఇక్కడ సమస్య నువ్వు ఇస్తావా లేదా అనికాదు. అంకిత్ బ్రతకడు. మొదటి సమస్య నీది. రెండోది అంకిత్ ది!"
"నువ్వు అన్నట్టు వారిద్దరూ వివాహం చేసుకున్నాక, అంతకు పూర్వపు పాపఫలితాన్ని వెతకదల్చుకుంటే- ఆ సంఘటన జరిగాక మూడు నాలుగుసంవత్సరాలపాటు మేము ఆ ఇంట్లోనే వున్నాం. మా దగ్గరకి వచ్చి వుండేవాళ్ళు "కసిగా అన్నాను.
"ఆమె విధవరాలై వుంటే?"
నేను కళ్ళు చిట్లించాను. "...అంటే?"
"పెళ్ళయిన మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఆమె భర్త చనిపోయి పిల్లలు కలగక౦ ఇప్పుడు వివాహత్పూర్య బిడ్డకోసం అర్రుల సాచుతూ వుంటే-?"
నేను సమాధానం చెప్పలేకపోయాను. అతనే అన్నాడు. "-కాబట్టి మనం ఏ ప్రోబబులిటీని కాదనలేం. మనకి తెలిసినవి ఈ రెండు అవకాశాలు మాత్రమే మనం ఊహించలేని కోణాలు ఇంకా ఎన్నో వుండవచ్చు. వాటిని వెతుకుతూ కూర్చోవటం కన్నా- ప్రకటన ఇవ్వటం మంచిది....."
....ఆ మరుసటిరోజు జాన్, అతడి భార్యా హైదరాబాద్ వెళ్ళిపోయారు.ఆ రోజే నేను పత్రికా ప్రకటన ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. బాక్స్ నెంబర్ ఇచ్చాను. కిడ్నీ విషయం చెప్పలేదు. కేవలం వివరాలు చెప్పానంతే.
చిన్న వెలుగు కిరణం అన్వేషణకి ముఖ్యం కదా! నిజం బయట పడటానికి అది కనీసావసరం.
5
కొంతలో పది శాతం- శూన్యంలో నూరుశాతం కన్నా ఎక్కువ.
* * *
అంకిత్ పరిస్థితిలో మార్పేమీ లేదు.
అయితే భయంకరమైన మార్పు అతడి మానసికస్థితిలో వచ్చింది.
ఆ డయాలిసిస్ మిషన్ చూస్తేనే వాడు విపరీతంగా భయపడుతున్నాడు. మంచంమీద పడుకోబెట్టి- సూదులు గుచ్చి -రక్తం తోడటం.
ఊహించుకోవటానికే గగుర్పాటు కలిగించే దృశ్యం.
మామూలుగానే రక్తం చూస్తేనే భయపడేవాళ్ళు కొందరు. తమ శరీరానికి గాయమై, కళ్ళముందు రక్తమడుగయితే స్పృహ తప్పేవాళ్ళు మరికొందరు. అటువంటిది- మొత్తం రక్తమంతా కళ్ళ ముందే బయటకి ప్రవహిస్తే.....
అందులోనూ వాడి వయసెంతనీ?
ఆ వయసులో నేనొకసారి చాలా భయంకరంగా ఆలోచించాను. నాకు జ్వరం వచ్చి అమ్మ ఆస్పత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ మూడ్రోజులు ఆస్పత్రిలో వుండాలన్నాడు.
ప్రతిరోజూ ప్రోద్దున్నా సాయంత్రమూ నర్సు తెచ్చి గుచ్చే ఆ పెద్ద ఇంజెక్షన్ గురించీ, రాత్రంతా ప్రొద్దున్న సంభవించబోయే దుర్ఘటన గురించీ భయపడుతూ గడిపేవాడిని. అది నా జీవస్మరణ సమస్య అయిపోయింది.
నర్స్ ఇచ్చిన టాబ్లెట్ అయితే నాలుక్కింద దాచి, ఆవిడ వెళ్ళగానే వూసే సేవాడిని. ఇంజెక్షన్ తప్పించుకునే వీలులేదు.
మూడ్రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గలేదు. డాక్టర్ మరో రెండురోజులు వుండాలన్నాడు. ఆ రాత్రి మంచం దిగి, హాలు తలుపు దగ్గరికి వచ్చాను. నర్సు బల్లకి తల అన్చుకుని నిద్రపోతోంది. నర్సుమీదా, డాక్టరు మీదా ఎంతో కోపం. మా అమ్మమీద ఏదో తెలియని కసి! ఇదంతా తీర్చుకోవటానికి ఒకే మార్గం కనిపించింది. అందుకే బయటకొచ్చాను. మెట్లమీదుగా హాస్పటల్ పైకి చేరుకున్నాను. చల్లగాలి నన్ను చుట్టుముట్టింది. అలాగే నడుచుకొంటూ, భవంతి చివరి అంచువరకూ వచ్చాను.
అంతలో మెట్లమీద ఎవరో పరుగెత్తుకుంటూ వస్తూన్న శబ్దం వినిపించింది. నీళ్ళ టాంక్ వెనుక దాక్కోవాలనుకున్నాను కానీ కుదర్లేదు. వార్డుబోయ్ వచ్చి నన్ను పట్టుకుని క్రిందికి తీసుకువెళ్ళాడు.
నర్సు అరుస్తోంది. అమ్మ ఏడుస్తోంది. పైకి ఎందుకు వెళ్ళావని ఎవరడిగినా చెప్పలేదు. చివరికి అమ్మ అడిగినా కూడా!
'నేనా బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.'
* * *
పేపర్లో ఇచ్చిన ప్రకటనకి దాదాపు ఇరవై దాకా ఉత్తరాలు వచ్చాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇందరు తల్లులు తమ పిల్లల్ని ఇలా వదిలెయ్యటం అనేది నమ్మశక్యం కాని విషయం.
కొందరు ఇంటి మెట్లమీద వదిలెయ్యలేదు. కానీ గోడ అవతల పారేసామనీ మరికొందరు- తమ తల్లిదండ్రులు ప్రసవ సమయములోనే బిడ్డని మాయచేసారనీ, ఎక్కడ పారేసారో తెలీదనీ వ్రాసారు. పది పన్నెండు సంవత్సరాల క్రితం కాదనీ, అయిదారెళ్ళ క్రితమనీ - కాస్త వెరిఫై చేయమనీ ఒక తల్లి తన బిడ్డ సంగతి వ్రాసింది.
వదిలేసిన మాట వాస్తవమేకానీ, అది మొగశిశువు కాదనీ, ఆడబిడ్డ అనీ వచ్చిన ఉత్తరాల్లో తొంభై శాతం వుండటం నాకు ఆశ్చర్యముతో పాటు విచారాన్ని కూడా కల్గించింది.
ఏ ఉద్దేశ్యంతో నేను ప్రకటన ఇచ్చానో ఆ కార్యం మాత్రం నెరవేరలేదు. స్పందించిన వారిలో ఎవరూ కూడా తమ అడ్రసు కానీ, పేరుకానీ ఇవ్వలేదు.తమ బిడ్డ ఎక్కడున్నా-క్షేమంగా వుంటే చాలునని, దేవుడు చల్లగా చూడాలనీ దీవెనలు (?) ఇచ్చి, కన్వీనియెంట్ గా తన సెంటిమెంట్ ని నిరూపించుకున్నారు. ఒక స్త్రీ మాత్రం, ఫలానా టైమ్ కి ఫలానా పార్క్ దగ్గరికి తన కుర్రాడిని తీసుకొస్తే దూరంనుంచి చూసి (నాక్కూడ్డా) కనబడకుండా వెళ్ళిపోతానని వ్రాసింది.
ఆ విధంగా నా మొదటి ప్రయత్నం ఫెయిలయింది.
* * *
ఆ రాత్రి పది దాటాక హైదరాబాద్ ఫోన్ చేసాను. జాన్ ఎత్తాడు. జరిగినాదంతా వివరించి "చూసావా! నేను ముందే చెప్పాను కదా. అలాగే జరిగింది" అన్నాను.
"జరిగిందేదో జరిగింది కానీ నేను నీకో సలహా ఇవ్వదలచుకున్నాను నువ్వేమీ అనుకోనంటే....."
"చెప్పు."
"ఓడిపోగానే, 'నేను ముందే అనుకున్నాను' అని ఎప్పుడూ సమర్థించుకోక ......." అంటూ ఫోన్ పెట్టేసేడు. సాచిపెట్టి కొట్టినట్టవలేదు. జాన్ గురించి నాకు బాగా తెలుసు. మనిషిలోని బలహీనతని అతడు అసలు క్షమించలేడు. ఇది అతడు బలహీనత అని నేను ఏడిపిస్తూ వుంటాను.
నేను పక్కమీద వాలి నిద్రకుపక్రమించాను.
కానీ మళ్ళీ ఆలోచన్లు అరుంధతి నా వేపు తిరిగి పడుకుంది. నిద్రలో సన్నగా కలవరిస్తోంది. లేచి బయటకొచ్చి హాల్లో మళ్ళీ ఫోన్ పక్కన కూర్చొని డయల్ చేసాను.