ఆవిడ జమీందారిణిగా దర్జాగా బతకడానికి అలవాటు పడింది. ఓ గృహిణంగా, భర్త, బిడ్డల ఆలనా పాలనా స్వయంగా చూడడం జమీందారీ కుటుంబాలలో జరగదు- అన్నింటికి అందరికీ వేరువేరు దాసదాసీలు వుంటారు- భార్యభర్తల అనుబంధం కేవలం రాత్రి మాత్రమే. ఆవిడ కాలక్షేపాలు, దాసీలు వేరు. ఆయన స్నేహితులు, ఆయన వేట, ఆయన మనుషులు వేరు. అలాంటి కనీసపు హోదాలు అంటిముట్టని జీవితం గడిపిన రంగారావుకి శ్రీమతి స్వయంగా అన్ని పనులు చూస్తూ అనుక్షణం నీడలా అంటిపెట్టుకుని వుండడం ఆనందన్నిచ్చింది. నిజమైన భార్యభర్తల అనుబంధాన్ని రుచి చూసాక ఆయనకి శ్యామల పట్ల ప్రేమాభిమానాలు మరింత పెరిగాయి.
జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని, ఆశించని ఈ భోగభాగ్యాలు- అభిమానించే భర్త- అనాధగా పెరిగిన తనకి యింత అదృష్టం పట్టిందంటే అప్పుడాప్పుడు శ్యామలకే నమ్మకం కలగదు. హాయిగా, ఆనందంగా జీవిస్తున్న శ్యామలకి ఒకసారి అనాధ శరణాలయం చూసి రావాలన్న కోరిక రోజురోజుకి పెరిగింది. పెళ్ళయ్యాక ధైర్యం చేసి తన మనసులో కోరిక రంగారావుతో వెళ్ళడించింది.
'తప్పకుండా వెళదాం శ్యామలా, దానికింత సందేహం ఎందుకు- అసలు రెండేళ్ళనుంచి నేను వెళ్ళలేదునా గొడవలలో వుండిపోయి శరణాలయం సంగతిని మరిచాను. తప్పకుండా రేపే వెళదాం, కబురు చేస్తాను మనం వస్తున్నట్టు.' 'అన్నపూర్ణ అనాధ శరణాలయం' తెల్లనిగేటు సూర్యకిరణాల కాంతిలో ధగధగ మెరుస్తూంది. అంతకన్నా మెరుస్తున్న నల్లని పెద్ధకారు గేటులోంచి దూసుకు వెళ్ళింది. బాటకిరువైపులా ఉన్న రకరకాల సైజు పూల మొక్కలలాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు.
కారు తిన్నగా వెళ్ళి పోర్టికోలో ఆగింది. మేనేజర్ కారు తలుపు స్వయంగా తెరిచారు. నల్లటి ఉలేన్ ప్యాంట్ తెల్లని జోధ్ పురి కోటుతో, చేతికర్రతో రంగారావు హుందాగా కారు దిగారు వెనువెంట శ్యామల మెరిసి ఖరీదయిన దుస్తులలో దిగింది. అక్కడ అనాధగా పెరిగింది అక్కడికే జమీందారిణీ హోదాలో అడుగు పెట్టగానే శ్యామల సిగ్గు, బిడియం, ఆనందం, గరం ఏవేవో భావాలతో అడుగు తడబడింది. మొహం ఎర్రబడింది. అందరి నమస్కారాలు అందుకుంటూ రంగారావు పిల్లల గదులు, ప్రార్ధన మందిరం, భోజనశాల, వంటగదులు అన్ని తిరిగి చూశారు. తరువాత ఆవరణలో ఏర్పరచిన సభలో ఆశీనులయ్యారు. పిల్లలందరిని బాగా చదువుకోమనీ,
క్రమ శిక్షణ పాటించమని , శుభ్రంగా ఉండాలని ఉద్భోదించారు. తరువాత శ్యామల పిల్లలందరికి తల ఒక జత బట్టలు, మిఠాయిలు పంచి పెట్టింది. సభ ముగిశాక రంగారావు ఆఫీసు రూములో జమా ఖర్చులు పరిశీలనలో మునిగిపోయారు. అలాంటి అవకాశంకోసం చూస్తున్న శ్యామల నెమ్మదిగా అక్కడనించి జారుకుంది. శ్యామల బయటకు రాగానే పిల్లలంతా సంబరంగా ఆమెని చుట్టిముట్టి "శ్యామలక్కా, శ్యామలక్కా" అంటూ ఆనందంగా పలకరించారు, శ్యామల అందరివంక అభిమానంగా చూసింది.
"తప్పు! శ్యామలక్కా అని పిలవకూడదు ఇప్పుడు ఆవిడ జమీందారిణి. అమ్మగారూ అనాలి!" పెద్దక్క సుగుణ తప్పు సవరించింది. "సుగుణా! ఏమిటమ్మా ఆ మాటలు! నేను మీ పెద్దక్కనే ఎప్పుడూ.. ఇక్కడ మీ అందరిమధ్య పెరిగి పెద్దదానినయ్యను మీతో పాటు. ఈనాడు ఆయన దయవల్ల అదృష్టం పట్టినంత మాత్రాన నేను మీ అక్కనవనా!" సుగుణ భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా అంది శ్యామల. సుగుణ కళ్ళుతడి అయ్యాయి, "అక్కా! నీవెంత అదృష్టవంతురాలివి! ఎంత పుణ్యంచేసుకున్నావో! పోనీ! మలో ఒకరికైనా ఇంత అదృష్టం పట్టిందంటే మాకెంత ఆనందంగా ఉందో తెలుసా! నిన్ను జమీందారుగారు పెళ్ళాడారని విని ఎంత సంతోషించామో! పిల్లలంత ఆశ్చర్యంగా కళ్ళు విచ్చుకొని శ్యామల చీర ముట్టుకొని ఒకరు, రవ్వల గాజులు, మెరిసే ఉంగరం, కాళ్ళ జారీ చెప్పులు అన్నీ భయం భయంగా పట్టుకొని వింతగా, కుతూహలంగా "అబ్బ! ఎంత బాగుందీ! అమ్మో ఎలా మెరుస్తుందో!" అనుకొంటూ చూస్తుంటే శ్యామలకి బాధ అన్పించింది. ఆ నిర్భాగ్యులని చూస్తుంటే తనంత అలంకరణతో వారి మధ్యకి రావడం సిగ్గనిపించింది. కాని రాణీ హోదాలో వస్తూ జమీందారుగారి తాహతుకి సరిపడని అలంకరణతో ఎలా రాగలదు- ఒక నిట్టూర్పు విడిచి "సుగుణా ఇక్కడ ఇప్పుడెలా వుంది పరిస్థితి? అంతా సరిగా వుందా మీకేం కావలసినా నాకు రాయి సుగుణానేను జమీందారు గారితో చెప్పి మీ అందరికి మరిన్ని సదుపాయాలు జరిగేట్టు చేస్తాను. ఎప్పుడు ఏం కావల్సినా ఈడక్కని మరిచిపోవద్దు సందేహించకుండా వెంటనే రాస్తే నేను చూస్తాను- నేను తరుచువస్తూ చూస్తూంటాను యిక్కడ అంతా సవ్యంగా వుండేట్టు ......." శ్యామల ఆదరంగా అంది.
పిల్లలతో మాట్లాడుతున్నా శ్యామల దృష్టి లోపలకే వుంది. "పదండర్రా నర్సరీలోకి వెడదాం-పాపలెలా వున్నారో చూద్దాం' అంది. శ్యామల వెంట పిల్లలంతా వెంటబడ్డారు. నర్సరీ హాలులో పిల్లలు నెలలనించి ఏడాది, రెండేళ్ళు, మూడేళ్ళ నించి ఐదుఏళ్లవరకు రకరకాలుగా వున్నారు. ఆమె చూపులు చాలా జాగ్రత్తగా ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నాయి ఆ పాపలందరి మధ్య మంచంలో కూర్చుని ఆడుకుంటున్న రెండేళ్ళ పాపమీద ఆమె దృష్టి పడగానే శ్యామల మొహం విప్పారింది. తను వెతుకుతున్నది ఆ పాపే అని గుర్తించింది. ఆరాటం అణుచుకుని యధాలాపంగానే అడుగులు వేసింది.
మిగతా పాపలందరికీ భిన్నంగా చూడగానే ఆకర్షించేలా, చాలా తెల్లగా ముద్దుగా బాతుల మధ్య రాజసింహంలా వుంది ఆపాప. తెల్లటికళ్ళు, నల్లని ఒత్తు జుట్టు, మెరుస్తున్న పెద్దకళ్ళు, చూడగానే ఏ గొప్పింటి పిల్లో అన్పించక మానదు. పోషణ సరిగాలేక బలహీనంగా వున్నా, చవక దుస్తులలో వున్నా ఆ పిల్ల మొహం కళతో వెలిగిపోతుంది శ్యామల ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఆయా పున్నమ్మ వినయంగా నమస్కరించింది. "ఏం పున్నమ్మా! బాగున్నావా?" అంటూ పాపని ఎత్తుకుంది. "అబ్బా! ఎంత చక్కగా వుంది పాప. ఎప్పుడు దొరికిందర్రా" ఆరాటంగా అడిగింది. ఆ పాపని పరీక్షిస్తూ.
"అక్క ...... అక్కా...... మరేమో యీ పాప పేరు ఉష ....." పిల్లలు అంత ఆరాటంగా చెప్పబోయారు. సుగుణ అందరిని వారిస్తూ, ఉష దొరికిన వైనం చెప్పింది. తెల్లాంగట్ట దొరికిందని ఉష అని పేరు పెట్టాం. ఉష బాగుంది కదక్క. యిక్కడందరిలోకి ఉషే బాగుంటుంది. అందుకే మనందరికీ ముద్దు. సుగుణ అంది- "ఎవరికి పుట్టిందో ....... ఏ గొప్పింటి పిల్లలాగో వుంది - ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో ఇలాంటి బంగారంలాంటి పిల్లనిలా వదిలేయడానికి వళ్ళు తెలియకుండా తిరగడం- యిలా పిల్లల్ని కనిపారేయడం" ఆయ కటువుగా అంది- ఆ మాటలకి శ్యామల మొహం వివర్ణమయింది.