Previous Page Next Page 
పర్ణశాల పేజి 11


    రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మెట్లు ఎక్కాడు. ఆ చప్పుడుకి తపోభంగమైన బుషిలా మెట్ల మీదనుంచి ఓ కప్ప కిందికి దూకింది.

    విశాలమైన గదిలో ట్రేలు వరుసగా వున్నాయి. ఆ పెద్ద పెద్ద ట్రేల మధ్య ఇరుకు దారిలోంచి నడిచేడు. ఆ నిశ్శబ్ధమూ, ఆ వాతావరణమూ ఏదో దారుణం జరిగిందని అతడి సిక్ట్ సెన్స్  కి చెబుతున్నాయి.

    ట్రేల మధ్య నుంచి మలుపు తిరిగిన చైతన్య ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు.

    చిన్న కేక గొంతులోనే ఆగిపోయింది.

    కోల్డు స్టోరేజి గదికి అడ్డంగా ...... తలుపుకు సగం అటు - సగం ఇటుగా  రంగయ్య పడి వున్నాడు.

    ఆ నిశ్చేష్టత నుంచి తేరుకోవటానికి అరక్షణం పట్టింది. ఒక్క గెంతులో దగ్గరగా వెళ్ళి మీద చేయివేసి చూసేడు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

    చైతన్య మనసంతా ఒక్కసారి శూన్యమైనట్లయింది. రంగయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. అంతా తనదైనట్లు ప్రతి పనీ స్వయంగా చూసుకొనేవాడు అతడు. చివరికి ప్రాణం కూడా  పనిచేస్తూనే వదిలేడు.

    మరణం అనేది ఎంత విచిత్రమైంది?

    చైతన్య అచేతనమైన శరీరంవేపే చూస్తున్నాడు! అతడిలోనూ కదలికలేదు. మెదడులో అస్పష్టంగా ...... చేపల కదిలిక వలె ఆలోచనలు, భావం మాత్రం శూన్యం, మనసు మొద్దుబారింది.

    నెమ్మదిగా వంగి అతడి తలను చేతుల మధ్యకు తీసుకున్నాడు. రెండో చెయ్యి కాళ్ళ క్రిందవేసి ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఫోన్ దగ్గరకు వెళ్ళి ఆఫీసుకు ఫోన్ చేసేడు..... తరువాత ఇంకో యిద్దరు  ముగ్గురికి..... మళ్ళీ వెనక్కి వెళ్ళాడు.

    నిశ్శబ్దం మందంగా పరుచుకొని వుంది. ఫ్యాక్టరీ  గోడలు వెలవెల బోతున్నట్లున్నాయి.

    కోల్డు స్టోరేజి తలుపు వేయబోతూ లోపలి చూసి, ఒక్కసారిగా లక్ష వోల్టుల షాక్  తగిలినట్లు అలాగే నిలబడిపోయాడు.

    ఐస్ పూర్తిగా కరిగి నీరు వెళ్ళిపోయినట్లుంది. రొయ్యలు పూర్తిగా  నల్లబడిపోయి వున్నాయి. పై అరలోంచి ఇంకా ఒక్కో చుక్కా క్రిందకి పడుతోంది.

    అతడికి తను చూస్తున్నది కలో నిజమో అర్థంకాలేదు.

    అడుగు ముందుకు వేసేడు. భరించలేని దుర్గంధం ఉక్కిరి బిక్కిరి చేసింది పదిహేను లక్షల రూపాయల విలువగల ప్యాకెట్లు...... ఇప్పుడమ్మితే ప్లాస్టిక్ కవర్ల  విలువ కూడా  రాని ప్యాకెట్లు.

    చైతన్య రేక్స్ దగ్గరగా నడిచేడు. ర్యాండమ్ శ్యాపింల్ లా తీసి పరీక్ష చేసేడు ఉహుఁ..... లాభం లేదు  ఒక్కటి కూడా పనికి రాదు. పాడైన సరుకు ఆలోచించలేదు అతడు.

    ఓ పెద్ద ఫర్మ్ కి- అనుకున్న సమయానికి సరుకు సప్లయ్ చేయలేకపోయానే  అన్న బాధ, అంతే.

    నెమ్మదిగా బయటికి నడిచేడు. తలుపు వెయ్యలేదు. వేసే అవసరం కూడా లేదు.

    ఖాళీ ట్రేల మధ్య నుంచి నడుస్తూ బయటకొచ్చాడు.

    అతడి ఒంటరితనాన్ని నిశ్శబ్దంతోనూ సానుభూతితోనూ పరిశీలిస్తున్నట్లు మౌనంగా వుంది ప్రకృతి. విశాలమైన కాంపౌండ్ లో అతడి కారు తప్ప  ఇంకేమీ లేదు. కారు అద్దంలోంచి "టాక్స్ టోకెన్" కనబడుతోంది.

    అది చూడగానే అతడి మెదడులో ఏదో మెరిసినట్లయింది. ఒక్కసారిగా అతడి మొహంలో మార్పు వచ్చింది.

    చిన్న అనుమానం క్షణంలో పెనుభూతమైంది.

    ఒక్క గెంతులో కారులో కూర్చుని,  ఇగ్నిషన్ ఆన్ చేసి రివర్స్ లోకి మార్చేడు. శరీరం కంపిస్తున్నది. దవడ కండరాలు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. స్టీరింగ్ ను పట్టుకున్న  చేతులు చెమటతో తడిసిపోయాయి.

    వేటగాడి వింటినుంచి వెలువడిన బాణంలా సాగిపోతోంది కారు. అతడికేమీ  కనబడటం లేదు. ఒకటే ఆలోచన. ఒకటే అనుమానం. టర్నింగ్స్ లో కూడా చేయకుండా పోనిస్తున్నాడు కారు.

    గేట్లోంచి బుల్లెట్ లా దూసుకుపోయింది కారు. కీచుమన్న శబ్దంతో  బ్రేకులు పడ్డాయి. తలుపులు విసురుగు తీసుకొని బయటకు గెంతేడు.

    వడివడిగా ఆఫీసు గదిలోకి నడిచాడు. నుదుటిమీద చెమట ధారాపాతంగా కారుతోంది.

    టేబిల్ మీదున్న కాగితాల్ని చిందరవందర జేస్తూ తొందర  తొందరగా వెతికేడు.

    కావల్సిన కాగితం దొరికింది.

    ఆతృతగా పరిశీలించి చూసేడు. రక్తం పూర్తిగా ఇంకిపోయినట్లు అతని మొహం తెల్లబడింది.

    చేతుల్లోంచి కాగితం జారిపోయింది.

    అతడు తన స్టాకుమీద చేసిన ఇన్సూరెన్స్ కి ఆఖరుతేదీ అయిపోయి అప్పటికి వారం రోజులు కావొస్తుంది.

    తలుపువేసి వుంచటానికీ, తీసి వుంచటానికీ తేడా పదిహేను లక్షల రూపాయలు.


                              *    *    *

    ఒక్కసారిగా తుఫాన్ లా దూసుకొచ్చిన కారునీ, అందులోంచి ఆఫీస్ లోకి వెళ్ళిన చైతన్యనీ పై నుంచి చూస్తూ "అబ్బ, అంత స్పీడ్ గా డ్రైవ్ చేయడమెందుకు బాబూ" అంది కాంతిమతి.

    పక్కనే వున్న కౌసల్య మాట్లాడలేదు.

    ఇద్దరూ బాల్కనీలో నిలబడి వున్నారు. కాంతిమతి మళ్ళీ ఏదో  అనబోయేటంతలో చైతన్య బయటికి రావడం కనిపించింది. వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికీ అతడిలో చాలా మార్పు కనిపిస్తున్నది. ఒక్కసారి పది సంవత్సరాల వయసు పైబడినట్లు కనిపిస్తున్నాడతను.

    ఏదో కలలో నడుస్తున్నవాడిలా వచ్చి కారులో కూర్చున్నాడు. కారు కదిలింది.

    "అరె- అదేమిటి! ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు?" అంది తనలో  తను అనుకొంటున్నట్లుగా కాంతిమతి.


                                                              *    *    *


    తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతత.

    ఆ ప్రశాంతతలో ఏవీఁ మిగలలేదనే నిశ్చింత.

    ఒక్కొక్క కెరటమే వచ్చి తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోతోంది. ఒడ్డున కూర్చొని వున్నాడు చైతన్య. రాత్రి ఒంటిగంట అయింది. మేఘాలు విచ్చుకోవటంవల్ల వెన్నెల సముద్రం మీద ఆరేసినట్లు పడుతోంది. దూరంనుంచి ఈదురుగాలి శబ్దం శంఖంతో ఊదినట్లు వినిపిస్తోంది.

    అతడికి సమయం తెలియటం లేదు. ఎంతసేపటినుంచీ అలా కూర్చుని వున్నాడో అతడికి తెలియదు. అతడి మెదడులో ఆలోచనలకీ, సముద్రంలో కెరటాలకీ తేడా లేదు. అతడి కాళ్ళని కెరటాలు తడిపి వెళుతున్నాయి.

    ఎదుట విశాలమైన సముద్రం- చుట్టూ ఇసుకతీరం. మధ్యలో అతడు.... పిపీలికంలాంటి మనిషి ఎదురుగా పెద్ద ప్రహేళిక. సీమితము సావధికము సాంతము అయినదేదయినా నిత్యమూ వరమమూ కాదు, కాలేదు.

    పుణ్యం నుండి కూడా విడుదల కానిదే ముక్తిలేదు.

    వాదనవల్ల అభిప్రాయాలు మారవు. మారేది అనుభవాల వల్లనే.

    ప్రతివాడూ తన పూర్ణత్వం గురించి అనభిజ్ఞుడే. అందుకే ఈ అన్వేషణ.

    కాంట్రడిక్షన్, ఇన్ కొహహరెన్స్-ఇవే అవిద్యా స్వరూపాలు.

    అవిద్యా నిరాకరణమే ముక్తి!

    ముక్తి చిదానంద ప్రాప్తి!!

    నిష్కాను కర్మచే చిత్తము శుద్ధమయినపుడు ఉపనిషత్సత్యము బోధపడుతుంది.

    అదే సమయం!

    దాని భావం అమరం!


                                              7

    ఏదో చప్పుడవటంతో కళ్ళు విప్పి చూసింది కాంతిమతి.

    చైతన్య లోపలికి వచ్చేడు. అతడి కళ్ళు ఎర్రగా వున్నాయి. జుట్టు నుదుటిమీదకు పడుతోంది. బట్టలు నలిగిపోయి వున్నాయి ముఖం వాడిపోయి పది లంఖణాలు చేసినవాడిలా వున్నాడు.

    కాంతిమతి కంగారుగా పక్కమీద నుంచి లేచి, "ఏమయిందండీ" అంది భర్త చెయ్యిపట్టుకొని.

    చైతన్య మాట్లాడలేదు. గదిలో చీకటిని బెడ్ లైటు పారద్రోలటానికి ప్రయత్నిస్తూంది. గడియారం రెండు చూపిస్తూంది.

    కాంతిమతి జగ్ లోంచి వాటర్ గ్లాసులో పోసి అతడికి యిచ్చింది. అందుకోలేదు. అతడు ఒకటే మాట అన్నాడు. ఒకే ఒక మాట.

    "-కాంతీ..... మనం వెళ్ళిపోతున్నాం ఇక్కణ్ణుంచి."

    ఆమెకి అర్థంకాలేదు. "ఎక్కడికండీ?"

    అతడు తలుపుతూ "ఉహు..... నాకూ తెలీదు" అన్నాడు.

    ఆమె అతడివేపు అయోమయంగా చూసింది. సాయంత్రంమనగా బయటకు వెళ్ళిన భర్త అర్థారాత్రి దాటినా తరువాత వచ్చి ఎక్కడికి వెళ్ళిపోదామంటున్నాడో ఆమె వూహకి అందటం లేదు. మాట మారూస్తూ "పడుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోండి" అంది లాలనగా.

    "విశ్రాంతి" జీవంలేని నవ్వు నవ్వాడు. "ఇక అంతా విశ్రాంతే కాంతీ! అందుకే పద వెళ్ళిపోదాం."

    "ఈసారి ఎక్కడికి అని అడగలేదామె. భర్త ఏదో మానసికాందోళనలో వున్నాడని గ్రహించి, సర్లెండి. అలాగే వెళ్ళిపోదాం రేప్రోద్దున్న" అంది.

    "రేప్రోద్దున్నా" మళ్ళీ నవ్వేడు. "రేప్రోద్దున్నకల్లా మనం లేవగానే కనబడే దృశ్యం ఏమిటో తెలుసా కాంతీ" అతడి కంఠంలో కొద్దిగా ఆవేశం ధ్వనించింది. "మెయిన్ హాలులో కొంతమంది అప్పులవాళ్ళు కూర్చొని వుంటారు. కొంతమంది ముఖాలు  ఎందుకు  అప్పిచ్చేమా అన్నట్లు వాడిపోయి వుంటాయి. మరికొంత మంది పైకే తిడుతూ వుంటారు. కొంతమంది 'ఇంటిని అమ్మితే ఎంతొస్తుందా' పని పరీక్షగా చూస్తుంటారు. ఇది  కాంతీ మనం రేపటివరకూ వుంటే చూడవలసిన దృశ్యం!"

    ఆమె చప్పున దగ్గరకొచ్చి "ఏమిటండీ? ఏం జరిగింది?" అంది ఆందోళనగా.

    అతడు క్షణం మాట్లాడలేదు. కిటికీ  వూచల్ని పట్టుకొని బయట చీకట్లోకి చూస్తూ చాలాసేపు నిలబడిపోయేడు. అతడి కంఠం మందంగా వినిపించసాగింది.

    "ప్రతిమనిషి జీవితంలోనూ కొన్ని వీక్  మూమెంట్స్ వుంటాయి కాంతీ! ఆ బలహీనమైన క్షణంలో నేను కొద్దిగా నిర్లక్ష్యంగా ప్రవర్తించేను. కానీ ఆ ఒక్కక్షణపు నిర్లక్ష్యానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా కాంతీ..... పదిహేను లక్షలు!"

    క్షణం ఆగి చెప్పసాగాడు.

    "ఇంకో పది సంవత్సరాలు పోయిన తరువాత ఈ సంఘటన జరిగి వుంటే నిలదొక్కుకునే వాణ్ణేమోగానీ ఇప్పుడు మాత్రం లాభంలేదు. స్థిరాస్థి చరాస్థి అన్నీ  కలిపినా ఆరేడు లక్షలకన్నా ఎక్కువలేవే.... ఎలా..... ఎలా..... కాంతీ, రేప్రోద్దున్నే అందరికీ ముఖం చూపించటం?"

 Previous Page Next Page