Read more!

వైద్య దేవతలు

 

వైద్య దేవతలు

 

అశ్వనీదేవతలు అనే మాట ఎపుడైనా వింటూ ఉంటాము. అయితే వీళ్ళ గురించి సరిగా తెలియదనే చెప్పాలి. ఈ అశ్వినీ దేవతలు అందరూ  సూర్యుని పుత్రులే. వినగానే ఆశ్చర్యం వేస్తుంది కానీ అదే నిజం. సూర్యుని భార్య  పేరు సంజ్ఞాదేవి. ఆమె సూర్యుడి తేజస్సును భరించలేక అశ్వ రూపంలోకి మారి కురుదేశానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. అయితే భార్యను వదిలి ఉండలేక సూర్యుడు కూడా అశ్వరూపంలోకి మారి ఆమె దగ్గరకు వెళ్తాడు.  అలా అస్వరూపంలో వారిద్దరూ జతకట్టగా  వాళ్లకు పుట్టిన సంతానమే అశ్వినులయ్యారు. నాసత్యుడు, దనుడు వారి పేర్లు. వారికి జన్మించిన మూడవ కుమారుడు దేవంతుడు. - ఇదంతా విష్ణుపురాణంలో పేర్కొనబడింది.

అయితే ఈ అశ్వినీ దేవతలు ఎవరు అంటే, దేవతలకు వైద్యులు అని పురాణాలు చెబుతున్నాయి. యుద్ధాలలో గాయపడే దేవతలకు వీరు చికిత్స చేసేవారని అందుకే వీరు దేవతలకు వైద్యులుగా పిలవబడ్డారని పురాణాల కథనం.  

అయితే ఈ అశ్వినీ దేవతల విషయంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదే సతీ సుకన్యను పరీక్షించడం. 

శర్వాతి అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఎంతకూ పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టని కారణంగా ఆయన  4000 మందిని పెళ్లి చేసుకుంటాడు. అయినా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. అయితే అదృష్టం కొద్దీ ఒకామె వల్ల ఒక పాప పుడుతుంది. ఆ పాపకు సుకన్య అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అలా ఆ పాప పెరిగి ఎంతో సౌందర్యవతిగా మారుతుంది.  శర్వాతి రాజు  రాజ్యానికి దగ్గరలో ఓ నందనవనం వంటి ప్రదేశం వుంది. అక్కడ చ్యవన మహర్షి తపస్సు చేసుకొంటూ వుండేవాడు. ఎక్కువ కాలం అలా తపస్సు చేసుకుంటూ ఉండటం వల్ల అతని చుట్టూ పుట్టలు,  చెట్లు అతడు కన్పించనంతగా పెరిగాయి. రాజు, రాణులు తమ కుమార్తె సుకన్యతో ఈ ఉద్యానవనంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండగా సుకన్య ఆడుతూ పాడుతూ అక్కడ తిరుగాడుతూ ఆ పుట్ట దగ్గరకు వెళ్లి లోపల మెరుస్తున్నట్టు కనిపించడంతో ఒక పుల్ల తీసుకుని లోపలికి పొడుస్తుంది. అయితే పుట్టలోని చ్యవన మహర్షి కళ్ళు అలా మెరిశాయని ఎవరికి తెలియదు. సుకన్య పొడవగానే చ్యవన మహర్షి కాళ్ళలో రక్తం వచ్చి అతనికి చూపు పోతుంది. అయినా అతను కోపం చేసుకోకుండా సుకన్యను శపించకుండా ఉంటాడు. 

తరువాత రాజు, రాణి సుకన్యను తీసుకుని తిరిగి వెళ్ళిపోతారు. అప్పటి నుండి రాజ్యంలో వర్షాలు లేక, పంటలు పండక, కరువు వచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడటం జరుగుతుంది.ఇదంతా తెలిసిన శర్వాతి రాజుకు ఇన్నాళ్లు ఎంతో సంతోషంగా ఉన్న రాజ్యం ఒక్కసారిగా ఇలా ఎలా అయిపోయిందని బాధపడుతుంటే, సుకన్య అక్కడికి వచ్చి తను చేసిన తప్పు గురించి చెబుతుంది. ఈ రాజు చ్యవనుని వద్దకు వెళ్ళి తమను మన్నించమని కోరగా, అలాగే  కాని ఆమెను తనకిచ్చి వివాహము చేయమని కోరతాడు. రాజు మనోవ్యధ చెందగా సుకన్య తన తండ్రిని అనునయించి ఆమె చ్యవనుని వివాహము చేసుకొని అతనికి సేవ చేసుకుంటూ ఉండేది. అశ్వనీ కుమారులు ఇది గమనించి అతని అంధత్వాన్ని పోగొడతామని, తమలో ఒకరిని వివాహమాడమని కోరగా ఆమె అందుకు నిరాకరిస్తుంది. అశ్వనీ కుమారులు చ్యవనుని అంధత్వం పోగొట్టి తాముకూడా చ్యవనుని రూపం దాల్చుతామని అందులో నీ ఇష్టం వచ్చిన వారిని వివాహమాడమని కోరి చ్యవనుని అంధత్వం పోగొట్టి తాము కూడా చ్యవనుని రూపంలోకి మారి సుకన్య ముందుకు రాగానే ఆశ్చర్యంగా సుకన్య ఆ ముగ్గురిలో నిజమైన చ్యవనుడు అయిన తన భర్తనే ఎంచుకుంటుంది.  ఇలా వారు సుకన్యను పరీక్షించడం వల్ల ఆమె గొప్పతనం అందరికి తెలిసింది.

నకుల సహదేవుల పుట్టుక వెనుక కూడా అశ్వినీదేవతల పాత్ర ఉందని తెలుస్తోంది. వ్యాసుని మంత్ర శక్తితో కుంతి కర్ణుని, ధర్మజుని, భీముని, అర్జునుని కంటుంది. 5వ మంత్రాన్ని ఆమె తన సవతి మాద్రికి ఉపదేశించగా ఆ మంత్ర మహిమతో ఆమె అశ్వనీ దేవతలను ధ్యానించి నకుల సహదేవులకు జన్మనిచ్చిందని పురాణ కథనం. 

ఇలా దేవతలకు వైద్యం చేసే అశ్వినీ దేవతల పాత్ర పురాణాల్లో పలుసందర్బాలలో ఉంది.

◆ వెంకటేష్ పువ్వాడ