కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకు

 



కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకు?

 

 

 నదీస్నానం అనగానే గుర్తుకువచ్చేది కార్తీకమాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఆ మాసాన్ని ఆధ్యత్మిక భావనలు పెంపొందించుకోవడంతో పాటుగా, చలితో కృంగిపోయే శరీరాన్ని దృఢపర్చుకునే విధంగా నియమాలను రూపొందించారు పెద్దలు. కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేవమన్న సూత్రాన్ని పాటించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ అసలు బాధంతా స్నానంతోనే ఉంటుంది. వేణ్నీళ్లతో స్నానం చేయవచ్చు కానీ…. శరీరం తన సహజస్థితి నుంచి దూరమవుతుంది. బాహ్య వాతావరణానికి అనుగుణంగా తనని తాను మల్చుకునే అవకాశాన్ని దానికి దూరం చేసినవారవుతాము. ఇక నిలువ ఉంచిన నీరైతే చల్లబడిపోయి ఉంటుంది. భూగర్భం నుంచి లభించే నీరు మాత్రం శరీరాన్ని వెచ్చగా, సేద తీర్చేలా, ఉదయం వేళ బద్ధకాన్ని వదిలించేలా ఉంటుంది.

 

 

కార్తీక మాసంలో నదీ స్నానాలకి కూడా కొన్ని కారణాలు కనిపించకపోవు. మన దేశంలో కురిసే వర్షాలలో మూడొంతులకు పైగా నైరుతి రుతుపవనాల వల్లే ఏర్పడతాయి. వీటి ప్రభావం అక్టోబరు తొలినాటి వరకూ… అంటే సుమారుగా ఆశ్వయుజమాసం వరకూ ఉంటుంది. వరద నీటితో పోటెత్తిన నదులన్నీ కార్తీక మాసానికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి. నదులతో పాటుగా కొట్టుకువచ్చిన చెత్తాచెదారం అంతా అడుగుభాగానికి చేరుకుని, పైన ఉండే నీరు కాస్తా తేటగా మారుతుంది. నదీ స్నానం చేయడానికి ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది. రాళ్లనీ, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు, ఆయా ఖనిజాలనీ, మూలికలనీ తమలో కలుపుకుని సాగిపోతాయి. అంటే నదీజలాలలో ఉండే ఔషధీగుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయన్నమాట!

 



ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పెద్దలు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. ఇంటిలో స్నానం చేసినా సరే… ఆ నీటిని


` గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`


అన్న మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించేవారు. గంగ, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం. అలాంటిది సాక్షాత్తూ ఆయా నదీజలాలలోనే స్నానంమాచరించే సందర్భం వస్తే వదులుకోరు కదా! ఆ సందర్భమే కార్తీక మాసం!!! ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, పితృదేవతలను తల్చుకుని, దానధర్మాలు చేసి, దీపాన్ని వెలిగించి, భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయవచ్చని ప్రోత్సహిస్తుంటారు పెద్దలు.

- నిర్జర.