కార్తీక పౌర్ణమి నాడు ఈ చిన్న పని చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం!

 

కార్తీక పౌర్ణమి నాడు ఈ చిన్న పని చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం!


కార్తీక మాసంలో చేసే శివారధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారధన, జపం, అభిషేకం వంటివి చేయాలి.

సాధారణంగా అన్ని మాసాల్లోకెళ్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైందిగా నిలుస్తోంది. సనాతన ధర్మంలో ఆయనములు రెండు ఉన్నాయి. అవి ఉత్తరాయణం, దక్షినాయణం. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా పవిత్రమైంది. ఈ పుణ్యమాసం హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైంది.

ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం వివరిస్తోంది. కార్తీకమాసంలో స్నానం, దానం, దీపారధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకంగా సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్పశక్తి ఉంటుందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం చెబుతోంది. అంతేకాదు దీపారధన చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మాలధారణ చేసేవారు కూడా ఈ నెలను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు.


కార్తీకమాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో 15వ రోజు వచ్చే కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకమైంది. దీన్నే కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి జీడికంటి పున్నమని పిలుస్తుంటారు. ఈ రోజున తెల్లవారకముందే స్నానం చేస్తారు. శివుడి గుడికి వెళ్లి గుమ్మడ ఆకు, వక్క, పండ్లని బ్రాహ్మణులకు దానమిస్తుంటారు. ముత్తైదువులకు వాయినాలు కూడా ఇస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అరటిదొన్నెలో దీపాలను వెలగించి పసుపు, కుంకుమ చల్లి నదులు, కాలువల్లోకి వదులుతారు. ఇలా చేయడం వల్ల అష్టశ్వర్యాలు తమ వెంటే వస్తాయని కుటుంబం చల్లగా ఉంటుందని నమ్ముతుంటారు.

ఈ రోజంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు దీపాన్ని దానం చేస్తే చాలా పుణ్యం, బియ్యంపిండి లేదా గోధుమపిండితో చేసిన దీపాలతోపాటు స్తోమతను బట్టి వెండి ప్రమిదలను కూడా దానం చేయోచ్చు. కార్తీకపౌర్ణమినాడు ఉసిరి దీపాలను వెలిగించడంతోపాటు శివుడికి ఇష్టమైన ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు నీడలో తలస్నానాలు కూడా చేస్తారు. దీనిని ఉసిరికాయ స్నానం అంటారు.

కార్తీకమాసమంతా కూడా ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడతారు. పౌర్ణమి రోజు ఇంట్లో తులసి పూజ చేసి వత్తులు వెలిగించడం యజ్నం చేయడంతో సమానం. అంతేకాదు ఇంటిముందు ముగ్గులు పెట్టి, తులసి కోట లేదా కాలువ చెరువుల దగ్గర 365 ఒత్తులను ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిసేత మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.