పుష్కరమంటే ఏమిటి

 

పుష్కరమంటే ఏమిటి?


రచన - యం.వి.ఎస్.సుబ్రహ్మణ్యం

 



 

జలానికి పుష్కరమని పేరున్నది. "సోషయ తేతి పుష్రరం"- పోషించేది అని అర్థం. తీర్థాలన్నింటికి నాయకుడు పుష్కరుడు. అతన్ని పుష్కరుడని, "తీర్థరాజు"  అని అంటారు. ఈయన్ని బ్రష్ఠు సృష్టించాడని, పురాణాలు చెప్తున్నాయి. బుద్ధిలోనూ, గుణాల్లోను మంచితనాన్ని కొన్ని రెట్లుగా ఇనుమడింప చేసేది పుష్కరం. నదులలో పుష్కరుడు నివసించే పవిత్రమైన కాలం నదీ పుష్కరం అవుతుంది. మేషము మొదలైన పన్నెండు రాసులలో సుర గురువు బృహస్పతి  సంచరించు వేళ పుష్కరుడు ఆయా నదుల యందు నివసిస్తూ వుంటాడు. బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిలో ప్రవేశించినపుడు గంగకు పుష్కరం. వృషభ రాశిలో నర్మదకు, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహంలో సరస్వతికి, కర్కాటకంలో యమునికి, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరథికి, ధనస్సులో బ్రహ్మపుత్రకు,  మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధునదికి, మీనంలో ప్రణితానదికి, (ప్రాణహిత) పుష్కరాలు వస్తాయి. కాబట్టి బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో దానికి  సంబంధించి నదీ పుష్కరము వస్తూ వుంటుంది. అంటే పన్నెండు సంవత్శరాలకొకసారి క్రమంగా పై నదులకు పుష్కరోత్సవాలు వస్తూ వుంటాయి. పుష్కర పర్వము ప్రతీనదికిని సంవత్సర కాలం వుంటుంది. మొదటి 12 రోజులు ప్రధాన పుష్కర పర్వదినాలుగా పరిగణింపబడుతాయి.

పుష్కర సమయంలో ఏం చేయాలి?
పుష్కర సమయంలో ఆయా నదులలో ఎక్కడ స్నానం చేసినా, పూర్వ జన్మల్లో మనస్సు, వాక్కు, శరీరమనే త్రికరణాలతో చేసిన అన్ని పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. ఎన్నో పుణ్య కార్యాలు ఈ సమయంలో చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మానవులు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టాలను పితృ పిండ ప్రదానాలను చేయాలని మహర్షులన ప్రబోధించారు. పుణ్య కార్యాలన్నింటిలో ముఖ్యమైనది, మహత్తరమైనది, పుష్కరస్నానం.

 



జన్మ ప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషేణవా
పుష్కరే స్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్వతి


పుట్టినప్పటి నుంచి స్త్రీచే కానీ, పురుషునిచే గాని, చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే, తొలగిపోతుంది. పుష్కర సమయంలో ప్రాతఃకాల స్నానం ఉత్తమమైనది. అవకాశమున్నవారు పుష్కరవిధిని ఆచరించడానికి ముందురోజే రెండు పూటలో, ఒక పూటో  ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయం ముండనం చేయించుకొని స్నానం చేయాలి. స్నానం తరువాత ముఖ్యమైనది - దానం. దశదానాలు, షోడశ మహాదానాలు, చేసి తీర్థశ్రాద్ధములు చేసి పితృదేవతలను సంతృప్తి పరచాలి.


- పుష్కరాలలో మొదటి రోజు బంగారం, వెండి, ధాన్య భూదానాలు చేయాలి.
- రెండోరోజు వస్త్రము, లవణము, గోపు, రత్న దానాలు చేయాలి.
- మూడవ రోజు బెల్లము, గుర్రము, కూరలు, పండ్లను దానం చేయాలి.
- నాల్గవ రోజు పాలు, పెరుగు, తేనే, నేతిని, దానం చేయాలి.
- ఐదవ రోజు ధాన్యము, బండి, గేదే, వృషభము, నాగలి దానం చేయాలి.
- ఆరవ రోజు ఔషధము, కర్పూరము, చందనము కస్తూరి దానం చేయాలి
- ఏడవ రోజు గృహము, పీఠము, శయ్య, పల్లకీయును దానం చేయాలి.
- ఎనిమిదవ రోజున గంధపు చెక్క, పుష్పములు, దుంపలు, అల్లము దానం చేయాలి.
- తొమ్మిదవ రోజున పిండప్రదానము, శయ్యము దానం చేయాలి.
- పదవరోజున శాక, సాలగ్రామ, పుస్తకాలు,
- పదకొండవ రోజున ఏనుగును,
- పన్నెండవ రోజున యథాశక్తి పైన వివరించిన వాటిలో వేటినైనా దానం చేయాలి.


పుష్కరాలలో పుణ్య నదీ తీరాన ఆచరించే పితృకర్మకు "పుష్కర శ్రాద్ధం" అంటారు. కనుక ీ పుష్కరాల రోజులలో పై విధంగా చెప్పిన దానాలు చేసి, పుష్కర శ్రాద్ధం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.  పుష్కరాలలో యమునానదీ పుష్కరాలకు ఒక ప్రాధాన్యత వుంది. అందులోనూ ప్రయాగ క్షేత్రంలోని (అలహాబాద్) యమునానదికి మరింత ప్రాధాన్యత వుంది. అది గంగా, యమునా, సరస్వతుల పవిత్ర సంగమ క్షేత్రం. కనుక యమునా పుష్కరాలకు, త్రివేణి పుష్కరాలు అని మరో పేరు కూడా వుంది. కనుక ఈ యమున పుష్కర సమయంలో యథాశక్త్యానుసారం స్నాన, దాన, శ్రాద్ధాది కర్మలు ఆచరించి, విశేష పుణ్య ఫలాన్ని సంపాదించగలరని ఆశిస్తూ...