యమునమ్మకి పుష్కరాలు

 

యమునమ్మకి పుష్కరాలు


రచన - యం.వి.ఎస్.సుబ్రహ్మణ్యం



 

సూర్యకిరణాల వల్ల ఆవిరిగా మారిన సముద్రజలాలు మేఘలుగా రూపాంతరం చెంది వర్షధారలుగా భూమిపై కురిసి నదులుగా ప్రవహిస్తాయి.. ఇది భౌగిళిక సత్యం.

శివుని జటాజూటం నుంచి జాలువారిన దివిజ గంగ... అనేక రూపాలతో అనేక నామాలతో భూమాత పై నర్తిస్తూ, జీవకోటికి జవ జీవలనందిస్తూ, సాగరసంగమం కోసం పరుగులు తీస్తుందని పురాణాల కధనం. ఏది ఏమైనా జన జీవన చైతన్యానికి నదులే ఆధారం అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.

అడగకుండానే అన్నం పెట్టి, ఆకలి తీర్చేది... "తల్లి "
అడగకుండానే పంటలిచ్చి అందరి ఆకలి తీర్చేది..."నది "
అందుకే " నది "ని  "తల్లి" తో పోల్చారు ఋషులు.


అలాంటి నదీమతల్లులు పన్నెండు ఈ భరత ఖండం పై నిరంతరం ప్రవహిస్తూ, వేద భూమి అయిన ఈ భారతావనిని ఆధ్యాత్మిక, ఆహార సుసంపన్నం చేస్తూ ప్రపంచ  ప్రమాణాలు అందుకుంటున్నాయి.

ప్రపంచంలో నదులు పూజించే సంప్రదాయం మనకు ఒక్క భారతదేశంలోనే కనిపిస్తుంది. నదులు మనకు దేవతలతో సమానం. అందుకే మనం వాటిని ప్రేమిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం...


నదులను ఎందుకు పూజించాలి?

నదీస్నానానికీ, పూజకు  ఓ అనుష్టాన ప్రక్రియను  నిర్దేశించారు మన ఋషులు. ఈ విశాల ప్రపంచంలో  ప్రవహించే సకల నదులూ, మన మానవ దేహంలోని నాడులలో రక్తం రూపంలో ప్రవహిస్తాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. మానవ శరీరంలో 72 వేల నాడులలో సకల తీర్దాలు, వాటి అధిష్టాన దేవతలూ వున్నారు. అందుకే -

 



"దేహదేవాలయః ప్రోక్తో- జీవో దేవస్సనాతనః "

అని మన పురాణాలు ప్రవచించాయి.మన శరీరంలోని 72 వేల నాడులలో ముఖ్యమైన నాడుల సంఖ్య 101. వాటిలో ప్రధానమైన నాడులు 12. ఈ ద్వాదశ నాడులూ మన జీవనదులైన ద్వాదశ నదులకు ప్రతీకలు. ఈ జీవనదులన్నింటికి అధిష్టాన దేవత  సాక్షాత్తు నారాయణుడు. సకల జీవనదుల ఆవిర్భావానికి ఆధారస్థానమైన "గంగ" విష్ణు పాదాల నుంచే కదా ఉద్భవించింది. అందుకే నీటికి ఆధారం " నారాయణుడు" అయ్యాడు. అందుకే-

" అకాశాత్పతితం తోయం - యధా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారం- కేశవం ప్రతి గచ్ఛతి" అన్నారు.


ఆకాశం నుండి జాలువారిన ప్రతి నీటి చినుకు, ఎలా సముద్రాన్ని చేరుతుందో.. మనం ఈ దేవతకు నమస్కరించినా, అది ఆ శ్రీమన్నారాయణునికి చేరుతుంది. అందుకే తీర్ధయాత్రలలో నదీస్నానానికి అంత ప్రాముఖ్యత నిచ్చారు.

దశవిధ స్నానాలు :

నదిని సేవించడం అంటే.. నదిలో స్నానం చేయడమే. పావన నదీ స్నానం, కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్పాయి. స్నానాలు దశవిధాలు.

ఆదౌ మలాపకర్షంతు సంకల్పంతు ద్వీతీయకం
తృతీయంతు మృదాస్నానం మంత్ర స్నానం చతుష్టయం
పంచమం పితృభిః స్నానం షష్టించైవ గురోన్మరేత్
సప్తమం పురుష సూక్తేన దశమం తీర్ధవారిణామ్.


మలాపకర్షణ స్నానం, సంకల్పస్నానం, మృత్తికాస్నానం, మంత్ర స్నానం  పితృ సంబంధ స్నానం, గురు సంబంధ స్నానం, మూల మంత్ర స్నానం,అఘమర్షణ స్నానం, పురుష సూక్త స్నానం, తీర్ధ స్నానం. ఈ దశవిధ స్నానాలలో అతి శ్రేష్టమైనది తీర్ధ స్నానం. తీర్ధ స్నానా చరణకు విధి విధానం వుంది. ప్రవాహానికి అభిముఖంగా నడుము లోతు నీటిలో  నిలబడి నది ప్రాముఖ్యతను, మహిమనూ, స్మరించి, నదికి అధిదేవత అయిన భగవంతుడి రూపాన్ని నామాన్ని, ధ్యానించి మునకలు వేయాలి. నదీ స్నానం కేవలం  తన శరీరానికే కాదనీ, అంతరంగానికి కూడా అనీ ,తనలో సుక్ష్మ రూపంలో నెల కొన్న దైవ స్వరూపానికి కూడా అనీ భావించాలి. దశవిధ స్నానాలలో తీర్ధ స్నానం ఉత్తమమైనదైతే - పుష్కర పుణ్య సమయంలో ఆచరించే పుష్కర స్నానం విశేష ఫలదాయకం అని పెద్దలు చెప్తుంటారు.