చతుర్విధ ఆశ్రమాలను ఎందుకు పాటించాలంటే..

 

చతుర్విధ ఆశ్రమాలను ఎందుకు పాటించాలంటే..

జీవితం హాయిగా, సుఖంగా, సాఫీగా సాగిపోవాలనే అందరికీ ఉంటుంది. అయితే అలా జీవితం ఎలాంటి ఒడుదుడుకులూ లేకుండా పూలబాటగా వెళ్ళి పోవాలంటే ఎలా? ఒక గది  ఎప్పుడు అందంగా, సౌకర్యవంతంగా, సుఖ వంతంగా, గందరగోళం లేకుండా ఉంటుంది? ఆ గదిలోని వస్తువులన్నీ ఒక క్రమంలో ఉన్నప్పుడు! ఆ గదంతా అందంగా సర్దినప్పుడు!! జీవితం కూడా అంతే! దాన్ని క్రమంలో ఉంచుకొంటే, చక్కగా సర్దుకొంటే పూలబాటే అవుతుంది. మనిషి తన జీవితాన్ని అలా అందంగా సర్దుకోవడం ఎలాగో వివరించేవే  ఆశ్రమాలు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్న్యాసం  అన్న చతుర్విధ ఆశ్రమాలు మనిషిని మనిషిలా బతికేలా చేసే జీవన విధానాలు.

18 లేదా 20 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువుకోవాలి. అది నేటి గ్రాడ్యుయేషన్ కావచ్చు, అలనాటి వేదవిద్యో, వృత్తివిద్యో కావచ్చు. మొత్తం మీద మనిషి తన జీవిత మొదటిదశలో చేయాల్సిన పని  నేర్చుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం. తన చుట్టూ ఉన్న పరిసరాల గురించీ, ప్రపంచం గురించీ, వివిధ విషయాల గురించీ ఆకళింపు చేసుకోవడమే తొలిదశ.

జ్ఞానాన్ని సముపార్జించేటప్పుడు మనిషికి కావలసింది ఏకాగ్రత, శ్రద్ధ. అందుకే బ్రహ్మచర్య ఆశ్రమంలో వ్యక్తికి కఠినమైన నియమనిబంధనలు విధించారు. ఆహార విహారాల్లోనూ, వ్యవహారాల్లోనూ స్వీయ నియంత్రణ పొందడానికి కావలసిన విధివిధానాల్ని తప్పక పాటించాలన్నారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే  పాఠశాలకో, కళాశాలకో వెళ్తున్న అబ్బాయికి ఉదయాన్నే లేవడం, చదువుకోవడం, క్రమం తప్పకుండా కళాశాలకి వెళ్ళడం, దురలవాట్లకు దూరంగా ఉండడం లాంటి కఠిన నియమాలు పెడతాం కదా! విచక్షణ జ్ఞానం నేర్పుతాం కదా!! అందుకే 'మాతా' శత్రు: పితా వైరీ యేన బాలో న పాఠితః" పిల్లల చదువు సంధ్యలు పట్టించుకోని తల్లితండ్రులు వారి పాలిట శత్రువులు అన్నారు పెద్దలు.

అలా బ్రహ్మచర్య ఆశ్రమంలో అస్ఖలిత అకళంక అశ్రద్ధ రహితుడై ఒకవ్యక్తి తన సర్వ ఇంద్రియాల్నీ జ్ఞానంపై, చదువుపై నిలిపితే అప్పుడతను తొలిదశను పూర్తి చేసుకొన్నట్లు లెక్క జ్ఞానాన్ని అందుకొంటే సరిపోదు. అది జీవితానికి ఉపకరించాలి. అడవి కాచిన వెన్నెల కాకూడదు. మానవుడికి ఉండే వాంఛలను ధర్మబద్ధంగా, సామాజిక ఆమోద యోగ్యంగా తీర్చుకోవడం విజ్ఞతకు నిదర్శనం. అందుకే బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమం లోకి పయనించాలని పెద్దలు అన్నారు. చదువు పూర్తయ్యాక, ఉద్యోగమో, వృత్తి ఉపాధి పొందాక గృహస్థ జీవితంలో అడుగు పెట్టాలి. అయితే సంసార చట్రంలో చిక్కుకొన్నాక కొన్ని చిక్కులు వచ్చిపడతాయి. సంసారం, సంతానం, బరువు బాధ్యతలు, బాదర బందీలు... వీటన్నింటినీ తీర్చడానికి డబ్బు కావాలి. సనాతన ధర్మం మనిషి డబ్బు సంపాదించవద్దనీ, నీకంటూ కొంత సంపదను ఏర్పరచుకోవద్దనీ చెప్పలేదు. ఎటొచ్చి ధర్మం తప్పవద్దని చెప్పింది. అందుకే ధర్మ అర్ధకామ మోక్షాలు అన్నారు.

గృహస్థ ఆశ్రమాన్ని పూర్తి చేసేసరికి మానవుడికి సుమారు యాభై ఏళ్ళ వయసొస్తుంది. సంతానం బ్రహ్మచర్య ఆశ్రమాన్ని అప్పటికి పూర్తి చేసుకొని ఉంటుంది. వారికి వివాహాలు చేసి వారిని గృహస్థాశ్రమంలోకి సాగనంపి ఆ గృహస్థు భార్యతో కలిసి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. వానప్రస్థ ఆశ్రమం అంటే ఇదే! రెండూ పూర్తి చేసుకొన్ని ఆ వ్యక్తి ఇప్పుడు అంతర్ముఖుడవ్వాలి, అంతర్మథనం చెందాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో జ్ఞానాన్ని తీసుకొన్న ఆ వ్యక్తి, గృహస్థ ఆశ్రమంలో తన బాహ్య ప్రపంచాన్ని చవిచూసిన ఆ వ్యక్తి  ఇప్పుడు ఆ రెంటికీ నడుమ ఉన్న గరిమనాభిని పట్టుకొనేందుకు తనలోకి తాను పయనించాలి. తపస్సు అంటే అదే. వానప్రస్థ ఆశ్రమం అందుకే.  అరవైయ్యేళ్ళు వచ్చాక  అన్నింటినీ పరిత్యజించి, సన్న్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి. ఇదీ మనిషి జీవనాన్ని  ఉద్దేశించిన విధానం ..

                                         *నిశ్శబ్ద.