అస్తికత్వాన్ని అంతర యాగం అని వర్ణిస్తారు ఇందుకే!

 

అస్తికత్వాన్ని అంతర యాగం అని వర్ణిస్తారు ఇందుకే!


సృష్టికర్త సంకల్పంతో రూపుదిద్దుకున్న అద్భుత కళాచిత్రం ఈ సృష్టి. ఈ క్రమ పరిణామాన్నీ, ఆ సృష్టికర్తనూ అంగీకరించడం. ఆయనతో అనుసంధానాన్ని కలిగి ఉండడమే ఆస్తికత్వం. సర్వోన్నతుడైన ఆయన ఉత్తమోత్తమ, ఉన్నతోన్నత పాలనకు తలొగ్గి దాని ప్రకారం నడచు కోవడమే ఆస్తికత్వం. అణువంత అన్యాయానికైనా తావులేని ఆ సర్వోత్తముడి ఛత్రం కింద సేదదీరే అవకాశం రావడమే ఒక గొప్ప అదృష్టం. దాన్ని అంగీకరించడమనేది మన గొప్పతనమేమీ కాదు. కానీ మనిషి చాలాసార్లు మూఢుడు అవుతాడు. అహంకారాన్ని అలంకారంగా ధరిస్తాడు. అమ్మ స్నానం చేయించి మంచి దుస్తులు వేసి పంపిస్తే బిడ్డ బురద పులుముకున్నట్లు! 

భగవంతుడు మనిషిని సృష్టించి లోకంలోకి పంపింది ఒంటెద్దు పోకడ పొమ్మని కాదు. ఒంటి కాకిలా బ్రతకమనీ కాదు. జన్మకు ఉన్న ఉద్దేశాన్ని అనుక్షణం స్పృహలో ఉంచుకుంటూ జీవన గమ్యం వైపు సాగమని! తన చుట్టూ సాగుతున్నవారి పథ గమనంలో తనవంతు తోడ్పాటునందించమని! వారి త్వరిత గమనానికి దోహదం చేయమని!! భగవంతుడి అస్తిత్వం పట్ల విశ్వాసం ఉన్నవాడికి మాత్రమే ఈ లోకం పట్ల, సృష్టి క్రమంలో తన వంతు పాత్ర పట్ల, నిర్వహించవలసిన బాధ్యత పట్ల అవగాహన ఉంటుంది. అంతేతప్ప, నాస్తికుడికి ఉండదు.

అమ్మ పట్ల అనురాగం ఉన్నవాడికి తోటి తమ్ముళ్ళ పట్ల ఆప్యాయత సహజంగానే జనిస్తుంది. మనిషి తను ముందుకు సాగాలన్నా, పక్కవారి ప్రయాణంలో తాను ఆటంకం కాకూడదనుకున్నా, అందుకు సౌహార్దం ఉండాలి. అది భగవంతుణ్ణి నమ్మినవాడికి ఉంటుంది. అతడు ఏ రంగానికి చెందినవాడైనా సరే ఈ లోకానికి నిస్వార్థంగా తన సేవలందించినవాడు తప్పనిసరిగా ఆస్తికుడై ఉంటాడు. భగవంతుని సార్వభౌమత్వాన్నీ, ఆయన అనన్య అహేతుక ప్రేమనూ నమ్మినవాడై ఉంటాడు. 

మనిషి సర్వోత్తముడు కావాలంటే, దైవీగుణాలు సొంతం చేసుకోవాలంటే సుగుణాకరుడైన పరంధాముని పదాలను ఆశ్రయించి తీరాలి. దోపిడీ దొంగ అయిన రత్నాకరుడు రామాయణ సృష్టికర్త అయిన వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెందాడన్నా, మతిలేనివాడు మాన్యతనంది మహాకవి కాళిదాసుగా మారాడన్నా, బాల్య చాపల్యంతో బాధపడిన ధ్రువుడు అంబరాన ధ్రువతారగా వెలుగొందు తున్నాడన్నా, రాక్షస కుల సంజాతుడైన ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడై నరసింహావతారానికే కారకుడయ్యా డన్నా, శృంగార రసాస్వాదకుడు అన్నమయ్య పదకవితా పితామహుడై తరించాడన్నా, సామాన్య యువకుడైన మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టి, మహాత్మా గాంధీగా  వినుతులు పొందాడన్నా, మరెవరు మరే గొప్ప పరిణతి చెందారన్నా ఉత్తమగతి పొందారన్నా అదంతా పరమాత్మ పదాశ్రయ ఫలితమే! పూలను అల్లిన దారం పరిమళాన్ని పొందినట్లు. భగవదనుసంధానంతో మనమూ జీవన సాఫల్య సౌరభాన్ని సొంతం చేసుకోగలం.

 *నిశ్శబ్ద.