షిరిడీ సాయి బాబా తన మతం మూలాలను ఎందుకు అస్పష్టంగా ఉంచారో తెలుసా!
షిరిడీ సాయి బాబా తన మతం మూలాలను ఎందుకు అస్పష్టంగా ఉంచారో తెలుసా!
షిరిడీ సాయిబాబా భారతదేశంలో ఎంతో మందికి ఆరాధ్య దైవం. ఆయన అనుగ్రహం, కరుణ ఎంతో మందికి చీకటిలో వెలుగు లాగా దారి చూపుతుందని అంటారు. ఎంతోమంది షిరిడీ సాయి నాథుడిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని కూడా పొందారు. అయితే షిరిడీ సాయి బాబా గురించి చాలా విషయాలు సందేహాలుగా, మరెంతో చిక్కు ప్రశ్నలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో షిరిడీ సాయిబాబా మతం కూడా ఒకటి. అసలు సాయిబాబా ముస్లిం అని కొందరు, సాయిబాబా ఏ మతాన్ని తన మతం అని చెప్పలేదని మరికొందరు, సాయిబాబా రామ నవమి వేడుకలు లాంటివి జరిపించేవాడు కాబట్టి ఆయన ముస్లిం కాదని మరికొందరు.. ఇలా చాలా రకాల వాదనలు ఉన్నాయి. అయితే తన మతం గురించి స్పష్టంగా చెప్పకపోవడం వెనుక చాలా పెద్ద కారణం ఉందని, అది అర్థం చేసుకున్న వారు మాత్రమే షిరిడి సాయిబాబాను కూడా అర్థం చేసుకుంటారని అంటున్నారు సాయి బాబాను సాధన చేసిన భక్తులు. అసలు షిరిడి సాయి బాబా తన మతం గురించి స్పష్టంగా చెప్పకపోవడం వెనుక అసలు కారణం ఏంటి? తెలుసుకుంటే..
షిరిడీ సాయినాథుని అంతరంగం..
తన మతాన్ని, మతం మూలాలను షిరిడి సాయిబాబా బయటకు చెప్పకపోవడానికి అసలు కారణం.. దేవుడు, మత, వర్గాలకు అతీతుడని తన ద్వారా లోకానికి చాటి చెప్పడం. షిరిడీ సాయి బాబా ప్రేమ, కరుణ, భక్తి, ధర్మం గురించి బోధించాడు. వీటికి ఎలాంటి మతం, కులం, వర్గం అవసరం లేదని, ఇవన్నీ ప్రతి మనిషి ఎలాంటి కులమత బేధాలు లేకుండా ఆచరించవచ్చని తన జీవితం ద్వారా ప్రజలకు బోధించాడు. ఈ కారణంగానే షిరిడీ సాయిబాబా తన మతం గురించి బయటకు చెప్పలేదు.
విశ్వానికి బోధన..
షిరిడీ సాయిబాబా తాను ఫలానా మతం అని చెప్పలేదు. ఆయన దగ్గర అన్ని మతాలు, కులాలు, వర్ణాలకు చెందిన భక్తులు ఉండేవారు. వారు తమ తమ కులం, మతం, ధర్మానికి తగ్గట్టు సాయిని ఆరాధించేవారు. షిరిడీ సాయిబాబా కూడా మసీదులో నివసించినా, శ్రీరామ నవమి వేడుకలు ఎంతో వైభవంగా జరిపించినా.. అన్ని పండుగలు, అన్ని మతాలను గౌరవించినా.. దీని వెనుక ప్రధాన ఉద్దేశం.. కుల మత బేధాలను మరచి ప్రజలందరూ ప్రేమ, కరుణ, ధర్మం, న్యాయంతో బ్రతకాలని చెప్పడమే.. ఇదే షిరిడీ సాయినాథుని బోధనగా విశ్వవ్యాప్తమైంది.
*రూపశ్రీ.