మసీదుకు మారిన తర్వాత సాయిబాబా జీవితంలో ఏం జరిగిందో తెలుసా!
మసీదుకు మారిన తర్వాత సాయిబాబా జీవితంలో ఏం జరిగిందో తెలుసా!
సాయిబాబా ఒక ఆధ్యాత్మిక గురువు అయినా ఆయన్ను దైవంతో సమానంగా పూజిస్తారు. సాయిబాబాను పూజించడం వల్ల ఎంతో మంది తమ జీవితాలలో ఎన్నో కష్టాల నుండి, మరెన్నో ఇబ్బందుల నుండి బయటపడ్డారని తమ స్వీయ అనుభవాలతో చెబుతారు. అయితే సాయిబాబా షిరిడికి వెళ్లిన తొలి సంవత్సరాలలో జరిగిన విషయాలు చాలా మందికి తెలియవు. సాయిబాబా మొదట వేపచెట్టు కింద కూర్చునేవాడు. ఏమీ లేకుండా కనీస అవసరాలతో జీవిస్తున్న సాయిబాబా వేప చెట్టును వదిలి ఒక పాత శిథిలావస్థలో ఉన్న మసీదులో ఆశ్రయం పొందారు. దానికి ఆయన తరువాత “ద్వారకామాయి” అని పేరు పెట్టారు. ఈ మసీదులోనే ఆయన తన దైనందిన ఆధ్యాత్మిక సాధనను కొనసాగించారు. నిరంతరం మండుతూ ఉండే పవిత్రమైన ధునిని ఆయన దర్శించేవారు. అది ఎన్నో అనారోగ్యాల నుండి స్వస్థత చేకూరుస్తూ దైవ శక్తికి ప్రతీకగా నిలిచింది.
షిరిడి సాయిబాబా ఎంతో వినయంగా నిరాడంబరంగా జీవించేవారు. భిక్షాటన కోసం చుట్టూ పరిసరాలు తిరిగేవారు. ఆయనకు తినడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. చుట్టుప్రక్కల ఇళ్లలో ఏవరైనా ఏదైనా తినడానికి ఇచ్చే కొద్దిపాటి ఆహారంతోనే సరిపెట్టుకునేవారు. మొదట సాయిబాబా షిర్డీలో మూడు సంవత్సరాలు గడిపారు. అయితే ఒక సంవత్సరం పాటు ఆయన ఆ గ్రామం నుండి అదృశ్యమయ్యారని చెబుతారు. ఆ సంవత్సర కాలంలో ఆయన ఎందరో సాధువులను, ఫకీర్లను కలుసుకున్నారని నమ్ముతారు.
1858లో ఆయన షిర్డీకి తిరిగి వచ్చారు, 1918వ సంవత్సరంలో తన దేహాన్ని విడిచిపెట్టే వరకు అక్కడే శాశ్వతంగా నివసించారు. మొదట్లో, చాలా మంది గ్రామస్తులు సాయిబాబాను పిచ్చివాడని అనేవారు, కానీ తరువాత, ఆయన నిస్వార్థంగా చేసే పనులు, ఆయన అందరి పట్ల చూపించే శ్రద్ద అందరినీ ఆయన వైపుకు నడిపించాయి. కొద్ది కాలానికే పిల్లలు కూడా ఆయనను ఎలాంటి దురుద్దేశం లేని ఒక సాధుపురుషుడిగా భావించారు.
షిర్డీలోని వృద్ధ మహిళలు ఆయనను తమ కుమారుడిగా భావించి జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన నివసించిన మసీదు కొంత కాలానికే ఒక పవిత్ర స్థలంగా మారింది, అక్కడ అన్ని వర్గాల ప్రజలు గుమిగూడి షిరిడి సాయిబాబా నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినేవారు. సాయిబాబాకు అద్భుత శక్తులు ఉండేవట, కొన్నిసార్లు ఆయన తనను దర్శించే వారి ముందు తన సామర్థ్యాలను ప్రదర్శించేవారట.
కొన్నిసార్లు ఆయన అనారోగ్యంతో ఉన్నవారికి నయం చేసేవారు, పేదలకు అన్నదానం చేసేవారు, నీటితో దీపాలు వెలిగించేవారు, ప్రాణాంతక వ్యాధులను నయం చేసేవారు. కానీ వీటన్నిటికీ మించి, సాయిబాబా ప్రజల జీవితాల్లోకి అపారమైన సానుకూలతను, దైవత్వాన్ని తీసుకువచ్చారు. అలా షిరిడి సాయిబాబా జీవితం తొలి సంవత్సరాలలో షిరిడిలో గడిచింది.
*రూపశ్రీ.