కార్తీక పురాణం ఎందుకు చదువుతారు.. శివకేశవుల గురించి కార్తీక పురాణంలో ఏముంది!

 

కార్తీక పురాణం ఎందుకు చదువుతారు.. శివకేశవుల గురించి కార్తీక పురాణంలో ఏముంది!

 

 

కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన కాలం. సాధారణంగా కార్తీకమాసంలో కార్తీక పురాణం చదువుతూ ఉంటారు. కానీ మరొకవైపు శివకేశవుల బేధం లేదని చెప్పే మాసం అని కూడా అంటుంటారు. అసలు కార్తీక పురాణం చదవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? కార్తీక పురాణంలో ఏ విషయాలు ఉంటాయి? కార్తీక మాసం శివకేశవుల గురించి ఏమ్ చెబుతుంది?  వివరంగా తెలుసుకుంటే..

కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎందుకు చదువుతారు?
కార్తీక మాసం అంటే శివవిష్ణు ఏకతకు ప్రతీక.
ఈ మాసం  ఆరంభం, పుణ్యం, కర్మా-విముక్తి ఫలితాలు అన్నీ కార్తీక పురాణంలో వివరించబడ్డాయి.

కార్తీక పురాణం అంటే ఏమిటి?
కార్తీక పురాణం ప్రధానంగా పద్మ పురాణంలోని ఉత్థాన ఖండం భాగం. ఈ గ్రంథంలో విష్ణు భక్తి, శివ పూజా మహిమ, దీపదానం, స్నానం, తులసీదళ సమర్పణ, ఉపవాసం, దానధర్మాలు గురించి విశదంగా చెప్పబడింది. అందుకే కార్తీకమాసంలో కార్తీక పురాణం చదవడం అంటే…  ఆ మాసం యొక్క ఆధ్యాత్మిక నియమాలు తెలుసుకోవడం, ఆచారాలు ఎందుకు చేస్తున్నామో గ్రహించడం, శివ, విష్ణు, తులసి, గంగా మొదలైన శక్తుల అర్థం తెలుసుకోవడం జరుగుతుంది.  కేవలం శ్రద్ధగా పఠనం చేస్తే చాలు, పాపక్షయ ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది.

 “శివకేశవుల బేధం లేదు” అంటారు కానీ  ఎందుకు శివుడికి సంబంధించి కథలే ఎక్కువగా ఉంటాయంటే..
“శివకేశవ భేదం లేదు” అన్నది తత్త్వజ్ఞానం.
కానీ భక్తి మార్గంలో దేవతలను వేర్వేరు రూపాలుగా అనుభవించడం మనసుకు సులభంగా ఉంటుంది.

కార్తీక మాసం విశేషత..

ఇది శివునికి అంకితమైన మాసం అయినప్పటికీ, ఆ మాసంలోని అన్ని పూజలు, దీపారాధనలు విష్ణు అనుగ్రహంతో ప్రారంభమవుతాయి.

కార్తీక పౌర్ణమి నాడు శ్రీమన్నారాయణుడు దామోదర రూపంలో పూజింపబడతాడు.

కార్తీక మాసమంతా తులసీదళం, దీపదానం విష్ణు ప్రీతికరమైనవి.

ఉదయస్నానం, ఉపవాసం, హరినామస్మరణం  ఇవన్నీ హరికి ప్రియమైన ఆచారాలు.

అందువల్ల, “కార్తీకం శివునికి మాత్రమే కాదు హరి-హర సమ్మేళనం.” ఈ మాసంలో విష్ణు భక్తుడైనా శివుని ఆరాధించాలి, శివభక్తుడైనా హరినామాన్ని జపించాలి. ఈ విధంగా ద్వంద్వరహిత భక్తిను బోధించడమే కార్తీక పురాణం ఉద్దేశ్యం.

కార్తీక పురాణం ఎలా పఠనం చేస్తే తగిన ఫలితం ఉంటుంది?

ప్రతిదిన ఉదయం స్నానం చేసి, దీపం వెలిగించి పఠనం ప్రారంభించాలి.

పఠనం ముందు  “కార్తీక పురాణం పఠనం ద్వారా శివకేశవ అనుగ్రహం, పాపక్షయం, జ్ఞానప్రాప్తి కలగాలి.” అని సంకల్పం చెప్పుకోవాలి. 

దీపదానం, తులసీ పూజ తప్పకుండా చేయాలి.

పఠనం పూర్తయ్యిన రోజున పరమేశ్వరుడి, శ్రీమన్నారాయణుడి, తులసీ దేవి పూజ చేయాలి.

తుదకు “కార్తీక పురాణ పఠన ఫల శ్రవణం” కూడా చేయాలి.

ముఖ్య నియమాలు:
పఠనం సమయంలో మాంసం, మద్యపానం, కోపం, తర్కం వీటిని దూరంగా ఉంచాలి.

“ఓం నమః శివాయ”, “ఓం నమో నారాయణాయ” అనే నామాలను తరచుగా జపించాలి.

దీపాన్ని  ఆకుతో లేదా తులసీ దళంతో ఆర్పకూడదు. అది  తానుగా ఆరిపోవాలి.

కార్తీక పురాణం పఠనం ద్వారా:

జన్మజన్మాంతర పాపక్షయం, జ్ఞానం, శాంతి, సత్కర్మ ప్రేరణ, గృహంలో శుభవైభవం, తులసీదేవి కటాక్షం, అంతిమకాలంలో విష్ణులో లయప్రాప్తి,  మోక్ష ఫలితం

“కార్తీక పురాణం శ్రవణం, పఠనం, దానం చేసినవాడు
శివకేశవ సాన్నిధ్యాన్ని పొందుతాడు” అని పురాణం పేర్కొంటుంది. 

                        *రూపశ్రీ.