పోలి పాడ్యమి.. పోలి స్వర్గానికి వెళ్లిన కథ తెలుసా...
పోలి పాడ్యమి.. పోలి స్వర్గానికి వెళ్లిన కథ తెలుసా...
హిందూ సతానత ధర్మంలో చాలా విశేషాలు, ఆశ్చర్యపరిచే కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి మాసంలో ఆ మాసపు విశిష్టత, మహత్యం వివరించే కథలు ఉన్నాయి. కార్తీక మాసం ముగిసిన తరువాత రోజు వచ్చే పాడ్యమికి అలాగే చాలా విశిష్టత ఉంది. ఆ పాడ్యమిని పోలి పాడ్యమి అని అంటారు. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్లిందట. ఒక రజక మహిళను స్వర్గానికి తీసుకెళ్లిన వృత్తాంతాన్నే పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ మహిళ జ్ఞాపకార్థంగానే కార్తీకమాసంలో దీపాలు వదులుతారని కూడా అంటారు. ఇంతకీ పోలి స్వర్గానికి వెళ్లడానికి ఆమె చేసిందేంటి?ఈ నెల పోలి పాడ్యమి నవంబర్ 21వ తేదీన వచ్చింది. ఈ రోజు చేయాల్సిందేంటి? తెలుసుకుంటే..
పోలి స్వర్గం కథ..
పోలి స్వర్గానికి వెళ్లిన కథ చాలా అద్బుతంగా ఉంటుంది. పూర్వం.. రజక కులంలో రాజమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు 7మంది కొడుకులు. ఈ 7 మంది కొడుకులలో 6మంది కొడుకులు బాగా దనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ 7వ కొడుకు మాత్రం అందంగా ఉండి, తనకు బాగా నచ్చడంతో పేద కుటుంబానికి చెందిన అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు పోలమ్మ. కొడుకు అలా చేయడం రాజమ్మకు అస్సలు నచ్చలేదు. పేద కుటుంబానికి చెందినదనే కారణంతో చాలా చులకనగా చూసేది. కోడలిగా కాకుండా పని మనిషిగా చూసేది. 6మంది తోడి కోడళ్లు కూడా పోలమ్మను చాలా చులకనగా చూసేవారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, వ్రతాలు, పూజలు జరిగినా పోలమ్మను అస్సలు కలుపుకునేవారు కాదు. పోలమ్మ మీద పనుల భారం వేసి వారందరూ హాయిగా అన్ని చేసుకునేవారు. పైగా పోలమ్మను చాలా చులకనగా పోలి.. పోలి.. అని వెక్కిరిస్తూ పిలిచేవారు. వారు అలా ఎన్ని పనులు చేసినా పోలమ్మ ఎప్పుడూ వారి మీద విసిగించుకునేది కాదు. సంతోషంగా, చిరునవ్వుతో ఎప్పుడూ పని మొత్తం చేసేది.
ఇదిలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలని పోలమ్మ అనుకునేది. కానీ పోలమ్మ దీపం పెట్టకూడదని ఆమె అత్త, తోడికోడళ్లు నూనె, వత్తులు పోలమ్మకు అందుబాటులో ఉంచేవారు కాదు. వారు మాత్రం గుడికి వెళ్లి దీపాలు పెట్టి, పూజలు చేయించుకునేవారు. వారున్న వీధులంతా తాము చేసిన పూజలు, దానాలు, ఆడంబరం గురించి గొప్పగా చెప్పుకునేవారు. కానీ పోలి మాత్రం తన అత్త, తోడి కోడళ్లు బయటకు వెళ్లగానే దగ్గరలో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తి చేసేది. ఇంట్లో వెన్న చిలికితే కవ్వానికి మిగిలిన వెన్నను తీసుకుని దానిలో వత్తి వేసి దీపం వెలిగించేది. మనసులోనే దైవాన్ని స్మరించుకునేది. ఇలా చేశాక.. కార్తీక మాసం పూర్తయ్యాక వారున్న ప్రాంతంలో ఒక దివ్య విమానం వస్తూ కనిపించింది. దాన్ని చూసిన పోలి అత్తగారు, తోడి కోడళ్లు తాము చేసిన పూజలకు మెచ్చి భగవంతుడు పంపినట్టు ఉన్నాడని సంతోషపడ్డారు.
కానీ.. ఆ దివ్య విమానం పోలిని తనతో స్వర్గానికి తీసుకుని వెళ్లింది. ఇలా జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. భగవంతుని మీద భక్తితో, ప్రేమతో ఏదైనా పూజ, వ్రతం లాంటివి చేసుకోవాలి. అంతేకానీ.. ఆడంబరాల కోసం కాదని పోలి కథ చెబుతుంది. అలాగే ఎదుటి మనిషిని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ తాము ఎంత గొప్పగా బ్రతికినా, ఎన్ని పూజలు చేసినా భగవంతుడు ఎప్పటికీ మెచ్చడు. మరీ ముఖ్యంగా కోడళ్లను చులకనగా చూస్తూ తాము ఎంత గొప్పగా బ్రతికినా.. అలాంటి అత్తగారు దేవుడి దృష్టిలో మంచిగా ఉండలేరు. అదే విధంగా కోడళ్లు కూడా తమ అత్తగారిని తల్లిలా చూసుకోవాలి. అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు. ఈ పోలి పాడ్యమి సందర్భంగా.. నదిలో లేదా నీరు పారే ప్రాంతాలలో దీపాలను వెలిగించడం చాలా మంచిది.
*రూపశ్రీ.