సంకట హర చతుర్థి.. ఇదెంత శక్తివంతమైనదంటే..!
సంకట హర చతుర్థి.. ఇదెంత శక్తివంతమైనదంటే..!
ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి వినాయకుడికి చాలా ముఖ్యమైనది. ఈ రోజును సంకష్ట చతుర్థి అంటారు. సంకట హర చతుర్థి వ్రతం సాయంత్రం సమయంలోనే ఆచరించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 2025 సంవత్సరం కార్తీక మాసంలో ఈ సంకట హర చతుర్థి నవంబర్ 9వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా కార్తీకమాసంలో వచ్చే సంకట హర చతుర్థి ప్రత్యేకత గురించి తెలుసుకుంటే..
న కార్తీకే సమో మాసః అని అంటారు. అంటే.. కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదని, ఈ మాసంలో ఆచరించే వ్రతాలు, పుణ్యనదీ స్నానాలు, జపతప హోమాలు, శివ-విష్ణు ఆరాధనలు మొదలైనవి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. సంకట హర చతుర్థి వ్రతాన్ని సాయంత్రం సమయంలో చవితి తిథిలో చంద్రుడు వ్యాప్తిలో ఉన్న సమయంలో ఆచరించాలి.
జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా అవ్వకపోయినా, ఏదైనా పనులు ప్రారంభించినా, ఏదైనా పనులు జరుగుతున్నా.. ఆ పనుల సమయంలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నా, అవివాహితులకు వివాహం ఆటంకాలు ఎదురవుతున్నా.. వివాహం అయిన వారికి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా, ఉద్యోగస్థులకు ఉద్యోగములో నిలకడ లేకపోయినా, వ్యాపారస్తులకు వ్యాపార సమస్యలు ఏర్పడుతున్నా.. ఇలా ఒకటి అని కాదు.. ఏ సమస్యలు అయినా సరే.. సంకట హర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆయా సమస్యలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో సంకట హర చతుర్థి వ్రతం..
కార్తీక మాసానికి సమానమైన మాసం లేదనే మాట ఇదివరకే తెలుసుకున్నారు కనుక.. కార్తీక మాసంలో సంకట హర చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం సాధారణ మాసాల కంటే మరింత ఎక్కువ ఉంటుంది.
సంకట హర చతుర్థి వ్రతం చేసుకోవడానికి చవితి తిథి రోజు ఉదయమే లేచి స్నానం చేసి వినాయకుడికి ఎర్రని రవికె బట్టలో బియ్యం, ఎండు ఖర్జురాలు, పువ్వులు, 11 రూపాయలు మొదలైనవి ఉంచి ముడుపు కట్టాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం స్నానం చేసి ముడుపు లోని బియ్యంతో ఉండ్రాళ్లు వండాలి. 11 లేక 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా వ్రతం ఆచరించి, సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఆహారం తీసుకోవాలి. ఇలా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో.. వారికి సంకట హర చతుర్థి వ్రత ఫలితం దక్కుతుంది. వినాయక అనుగ్రహం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు నెరవేరతాయి. జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
*రూపశ్రీ.