శ్రావణమాసంలో పెరుగు తినకూడదంటారు ఇందుకే..!
శ్రావణమాసంలో పెరుగు తినకూడదంటారు ఇందుకే..!
హిందూ పంచాంగంలో ప్రతి మాసానికి ప్రతి తిథికి ప్రత్యేకత ఉంటుంది. అయితే శ్రావణ మాసం మాత్రం చాలా స్పెషల్. ఇది పెళ్ళిళ్ల సీజన్ మాత్రమే కాదు.. దైవారాధనకు చాలా మంచిది. ముఖ్యంగా చాతుర్మాసంలో భాగం కావడంతో శ్రావణ మాసపు దైవారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే శ్రావణ మాసంలో పెరుగు తినకూడదని అంటారు. దీని వెనుక దైవిక కారణం ఏమిటో.. శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుంటే..
దైవిక కారణాలు..
శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నాలుగు మాసాలలో సృష్టి మొత్తం శివుడి చేతిలోనే ఉంటుంది. అందుకే ఈ మాసాలాలలో శివుడిని పూజిస్తే సంపూర్ణ ఫలితం ఉంటుందని అంటారు. అయితే శ్రావణ మాసంలో శివుడికి పచ్చి పాలు నైవేద్యంగా పెడతారు. ఈ కారణంగా పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులైన పెరుగు, ఇతర పదార్థాలు కూడా తినకూడదని చెబుతారు. ఇది మాత్రమే కాకుండా శివుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. శివారాధనకు ప్రాముఖ్యత ఉన్న ఈ కాలంలో ఆకుకూరలు తెంపడం, వాటిని తినడం కూడా నిషేధం అని పెద్దలు, పురాణ పండితులు చెబుతున్నారు.
శాస్త్రీయ కారణాలు..
శాస్త్రీయ పరంగా చూస్తే శ్రావణ మాసంలో వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు ఉంటాయి. ఇవి మనిషి శరీరం మీద ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. జీర్ణ వ్యవస్థ సున్నితంగా మారుతుంది. పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గుకు కారణం అవుతుంది. అందుకే పెరుగు తినకూడదు. ఇక ఈ సీజన్ లో కీటకాలు, పురుగులు ఎక్కువ. బ్యాక్టీకియా, వైరస్ చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఇవి ఎక్కువగా ఆకుకూరల ద్వారా జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆకుకూరలు కూడా ఈ మాసంలో తినకూడదని అంటారు.
ఏం చేయాలి.. ఏం చేయకూడదు..
శివుడికి బిల్వ పత్రాలు సమర్పించాలి. ఇవి శివుడికి చాలా ప్రీతికరమైనవి. అదే విధంగా శివ నామస్మరణ తప్పనిసరిగా చేయాలి. ఇక శ్రావణ మాసంలో తామసిక ఆహారాన్ని తీసుకోరాదు. జుట్టు, గడ్డం తీయరాదు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు.