జ్ఞానమార్గం నుండి ఎందుకు జారిపోతున్నారు??
జ్ఞానమార్గం నుండి ఎందుకు జారిపోతున్నారు??
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తితే॥
మానవులు చేసే సకల కర్మల యొక్క యజ్ఞముల యొక్క ఫలములను స్వీకరించే భోక్తను నేనే. ఆ యజ్ఞములకు, కర్మలకు యజమానిని నేనే. కాని ఈ విషయం అందరికీ తెలియదు. తెలుసుకోడానికి ప్రయత్నం చేయరు. ఆ కారణంగా అన్నీ తామే చేస్తున్నామనే అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానమార్గం నుండి జారిపోతున్నారు.
యజ్ఞయాగములు, క్రతువులు, పూజలు, వ్రతాలు, కర్మలు ఏదో ఒక కోరికతో, ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తారు. చేసే వాడిని యజమాని అంటారు. ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవతా మూర్తిని భోక్త అని అంటారు. కాని యజమాని, భోక్త రెండూ నేనే అన్న విషయం ఆ చేసేవాడికి తెలియదు అని అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ మనం యజ్ఞముల స్థానంలో మనం రోజూ చేసే పూజలు, వ్రతాలు, క్రతువులు, హెూమాలు చెప్పుకోవచ్చు. మనం కూడా ఈ పూజలు వ్రతాలు అన్నీ ఏదో ఒక దేవుడిని, దేవతను ఉద్వేశించి, ఏదో ఒక కోరికతో చేస్తాము. ఇక్కడ కూడా చేసే వాడిని యజమాని అంటారు. ఏ దేవత గురించి చేస్తున్నారో ఆ దేవత భోక్త అవుతాడు. ఆ రెండూ పరమాత్మయే. ఈ విషయం తెలియని అజ్ఞానులు వివిధ దేవతలకు వివిధ పేర్లతో పూజలు వ్రతాలు చేస్తున్నారు. అవన్నీ తనే చేస్తున్నాడు. ఆ ఫలములు తానే అనుభవిస్తున్నాడు అనే అజ్ఞానంలో ఉంటాడు. కాని, అన్నీ యజమాని, భోక్త రెండూ నేనే అనే సత్యాన్ని తెలుసుకుంటే పరమాత్మను పొందుతారు. కోరికలు ఉండవు. వాసనలు ఉండవు.
కాబట్టి మానవులందరూ పరమాత్మ గురించిన అసలు జ్ఞానమును అలవరచుకోవాలి. అన్ని దేవతా స్వరూపాలు పరమాత్మయే. మన అజ్ఞానం కొద్దీ దేవతలకు రకరకాల పేర్లు రూపాలు కల్పించి వారి మధ్య బేధభావమును కల్పిస్తున్నాము. కోరికలు కోరుతున్నాము. సంసారము అనే మాయలో పడి పోతున్నాము. పరమాత్మ సర్వాంతర్యామి, అన్ని దేవతలలోనూ, జీవరాసులలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఇది తెలుసుకోవడమే జ్ఞానము, ఈ జ్ఞానం ఉన్నవారికి దేవతామూర్తుల మధ్య ఎటువంటి భేధభావము ఉండదు. ఇవన్నీ నేనే చేస్తున్నాను. ఈ ఫలములు నాకే చెందాలి అనే అహంకారమూ ఉండదు. ఆ సమత్వాన్ని మనందరం అలవరచుకోవాలి. అలాకాకుండా వివిధ దేవతా మూర్తుల మధ్య బేధభావంతో, ఒకరిని పూజిస్తూ, మరొకరిని ద్వేషిస్తూ, ఏవేవో కోరికలు కోరుకుంటూ, ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధములైన పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా, వారు నా గురించి ఏ మాత్రం తెలుసుకోలేరు. మరలా మరలా సంసారములో పడుతూ ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అని చెబుతాడు కృష్ణుడు.
పైన చెప్పినదాంట్లో పూజచేసే యజమానిని నేనే, ఆ పూజను స్వీకరించే భోక్తను నేనే అంటాడు కృష్ణుడు. అంటే ఇక్కడ పూజ చేసేవాడిలోనూ ఆయనే ఉన్నాడు, ఆ పూజను అందుకునే వాడిలోనూ ఆయనే ఉన్నాడు. దీని అర్ధం ఏమిటి?? అన్నిచోట్లా అన్ని జీవులలో నేనే ఉన్నాను అని పరమాత్మ చెప్పడం, మనలో ఉన్నది ఆ పరమాత్మనే అని మనం గుర్తించడం, అన్నింటిలో ఆ పరమాత్మనే ఉన్నాడని తెలుసుకున్నాక ఇక మనిషికి ఎన్నిరకాల తారతమ్యాలు, అని రకాల బాధలు, అన్ని రకాల మనసు వేదనలు తొలగిపోతాయి.
◆ వెంకటేష్ పువ్వాడ.