మనిషి అలవర్చుకోవలసిన నాలుగు లక్షణాలు!!
మనిషి అలవర్చుకోవలసిన నాలుగు లక్షణాలు!!
గీతలో కృష్ణుడు మనిషి నాలుగు లక్షణములను అలవర్చుకోవాలని, అవి అలవర్చుకోవడం ద్వారా కర్మలు వాటి తాలూకూ ప్రభావాలు నుండి తప్పించుకోవచ్చని చెబుతాడు.
గత సంఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే||
తాను చేసే కర్మల యందు సంగము అంటే ఆసక్తిని వదిలినవాడు. ప్రాపంచిక విషయముల యందు కోరికలను వదిలిపెట్టినవాడు. ఆత్మజ్ఞానమందు మనసు నిలిపిన వాడు, అన్ని కర్మలను న్యాయంగా, ధర్మంగా, ఒక యజ్ఞం చేసినట్టు సమాజ శ్రేయస్సు కొరకే చేసేవాడు. అటువంటి వాడు, ఏ పని చేసినా ఆ కర్మఫలము అతని అంటదు.
ఈ శ్లోకంలో సంగము, ముక్తస్య, జ్ఞానము, యజ్ఞము, అనే పదాలు వాడబడ్డాయి. సంగము అంటే అటాచ్ మెంట్. ఒక మనిషితో కానీ, తాను చేసే పనితో గానీ, దాని మీద వచ్చే ఫలముతో గానీ అపరిమితంగా అనుబంధం పెంచుకోవడం. ఏ కర్మ చేసినా, ఆ కర్మను ఏదైనా ఫలితం కోరి చేస్తేనే అది బంధనం కలిగిస్తుంది. మరొక జన్మకు కారణం అవుతుంది. అందుకని సంగరహితంగా అంటే అటాచ్ మెంట్ లేకుండా కర్మలు చేస్తే అది అతని ముక్తికి దోహదం చేస్తుంది. ఈ శ్లోకంలో జ్ఞానావస్థిత చేతసః అని చెప్పాడు. అంటే జ్ఞాన మందు మనసును నిలిపిన వాడు, నిలకడైన మనసు కలవాడు, అటువంటి వాడు మాత్రమే సంగము లేకుండా ఉండగలడు.
జ్ఞానము మీద మనసు నిలిపిన వాడు, ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఆధారపడడు. వాటి మీద అనవసరమైన ఆసక్తిని, అనుబంధాన్ని పెంచుకోడు. అటువంటి వాడు చేసిన కర్మల యొక్క ఫలములు అతడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో పడి కాలి పోతాయి. తన మనసును జ్ఞానము మీద నిలిపిన వాడు ఏ కర్మచేసినా ఒక యజ్ఞము మాదిరి చేస్తాడు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. పరమాత్మ పరంగా చేస్తాడు కానీ నేను చేస్తున్నాను అనే అహంకారభావనతో చేయడు. కర్మఫలములను పరమాత్మకు అర్పిస్తాడు. తిరిగి వాటిని ప్రసాద బుద్ధిలో స్వీకరిస్తాడు. ఆ కారణం చేత అటువంటి సాధకుడు చేసే కర్మలు, వాటి ఫలములు అతనిని బంధించవు. కాబట్టి కర్మఫలములు బంధించకుండా ఉండాలంటే జ్ఞానము అత్యావశ్యకము అని చెప్పాడు పరమాత్మ. అంటే జ్ఞానం ఉన్నవాడికి నిజానిజాలు ఆలోచోంచే సామర్థ్యము, మంచి, చెడు గురించి అవగాహన కూడా ఉంటుంది. అలాంటి విచక్షణ ఉంటే మనిషి మూర్ఖత్వం నుండి బయటపడతాడు.
ఆత్మ విద్య గురించి సాధన చేసే వారికి, భక్తులకు, ఇది చాలా ఊరటనిస్తుంది. ఎందుకంటే ఎవరు కోరుకున్నా ఈ కర్మల నుండి, సంసార బంధనముల నుండి బయట పడి మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యడమే కదా. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో వివరంగా చెప్పాడు పరమాత్మ, ఆకర్మ అంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుని ఉండటం కాదు. ఏ కర్మ చేసినా అది బంధనములు కలిగించకుండా ఉండటమే ముఖ్యం.
ఈ శ్లోకంలో చెప్పబడిన నాలుగు లక్షణములు అంటే సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండటం, రాగద్వేషములను వదిలిపెట్టడం, మనస్సును జ్ఞానంతో కలపి ఉంచుకోవడం, ఏపని చేసినా భగవంతుని కొరకు, సమాజశ్రేయస్సు కోరకు పరహితము(ఇతరులకు మంచి చేయాలనే భావంతో) కొరకు చేయడం. ఈ నాలుగు లక్షణములు అలవరచుకుంటే అతను చేసే కర్మలు, ఆ కర్మఫలములు అతనిని బంధించవు. ఇలా చేస్తే వచ్చే స్వల్పకాలిక ఫలం అయినా అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఫలం అయిన ముక్తిమార్గము సులభము అవుతుంది.
◆వెంకటేష్ పువ్వాడ.