సనందుడు ఎవరు.. నరసింహస్వామి కోసం అతని అన్వేషణ ఎలా సాగింది!
సనందుడు ఎవరు.. నరసింహస్వామి కోసం అతని అన్వేషణ ఎలా సాగింది!
ఆదిశంకరుల వారు శిష్యులతో కలసి దేశాటనం చేస్తూ శ్రీశైలం వచ్చారు. అక్కడి ఆటవికులు మనుష్య బలి ఇచ్చేవారు. ఒకరోజు ఒక కాపాలికుడు వారి వద్దకు వచ్చి "అయ్యా! నాకు భైరవుని దర్శనం కావాలంటే మీ లాంటి అష్టసిద్ధులూ కలిగిన వారిని కానీ, అప్లైశ్వర్యాలు కలిగిన మహారాజును కానీ బలి ఇవ్వాలి" అన్నాడు. ఆ కాపాలికుడు తన శిరస్సుని కోరుతున్నాడని శంకరుల వారికి అర్థమైంది.
ఒక రాత్రి వారిని చంపడానికి కాపాలికుడు కత్తి పైకెత్తాడు. వెంటనే సింహగర్జన వినిపించి, ఆచార్యుల వారు కళ్ళు విప్పి చూసేసరికి, కాపాలికుని దేహం ముక్కలై క్రింద పడి ఉంది. వారి పక్కన సనందుడు నిలబడి ఉన్నాడు. వారు "ఇతణ్ణి చంపినది నువ్వా" అని అడిగారు. దానికి సనందుడు "లేదు, నేను గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాను. ఇక్కడకు ఎలా వచ్చానో నాకే తెలియదు” అని బదులిచ్చాడు. శంకరులవారు "నువ్వు నరసింహ మంత్రం ఉపదేశం పొందావా" అని అడిగారు. 'అవును' అని ఈ క్రింది కథను తెలియచేశాడు అతను.
సనందుడు (పూర్వాశ్రమనామం విష్ణుశర్మ) ఒకమారు గురువు వద్దకు వెళ్ళి 'నరసింహ స్వామిని దర్శించాలని ఉంది, దాని కోసం ఏం చెయ్యాలి' అని అడిగాడు. ఆ గురువుగారు. అడవులకి వెళ్ళి 'తపస్సు చేయాలి' అని అన్నారు. యువకుడైన విష్ణుశర్మకు పట్టుదల, తాను పండితుణ్ణనే అహం ఎక్కువ. ఐదు రోజుల పాటు నిద్ర, ఆహారం మాని కొండ గుహలలో తిరుగుతూ నరసింహ మంత్రం జపించాడు. నీరసించి, స్వరం తగ్గిపోయినా పట్టువదలలేదు. అతణ్ణి చూసిన ఒక ఆటవికుడు విష్ణుశర్మ వద్దకు వచ్చి 'నీకు ఏం కావాలి?' అని ప్రశ్నించాడు. నరసింహస్వామి కోసం వెతుకుతున్నానని చెప్పగా, ఆ స్వామి ఎలా ఉంటాడో చెప్పమని అడిగాడు.
విష్ణుశర్మ నరసింహస్వామి రూపాన్ని వర్ణించాడు. ఆటవికుడు "రేపు ఈ పాటికి మృగాన్ని నేను నీ దగ్గరకి తీసుకురాలేకపోతే నా ప్రాణం తీసుకుంటాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా ఆ మృగం ఎక్కడా కనపడలేదు. సూర్యాస్తమయం అయింది. ఏం చెయ్యాలో తోచక “ఆ బ్రాహ్మణ బాలునికి నేను మృగాన్ని చూపించ లేకపోయాను. ఇక నాకు మరణమే శరణ్యం" అనుకుంటూ, అడవిలోని తీగెలు తెచ్చి తాడుగా పేని దాన్ని చెట్టు కొమ్మకి కట్టి ఉరి తీసుకోబోతుండగా ఆ ఆటవికునికి స్వామి కోటిసూర్యులు కాంతితో సింహపు ముఖం, మానవ శరీరం, అభయహస్తంతో అమిత తేజస్సుతో దర్శనం ఇచ్చాడు. తన మెడలోని తాడు తీసి స్వామి మెడలో వేసి విష్ణుశర్మ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
విష్ణుశర్మతో "రాత్రంతా నిద్రలేకుండా వెతికాను, ఇప్పటికి కనపడింది" అని ఆటవికుడు అన్నాడు. విష్ణుశర్మకి స్వామిని కట్టిన తాళ్ళు కనపడ్డాయే తప్ప, స్వామి కనపడలేదు. కంట నీరు కారుతుండగా "స్వామీ, ఎన్ని రోజుల నుండి నిన్ను చూడాలని తపించి పోతున్న నాకు దర్శనం ఇవ్వకుండా ఈ పామరుడికి దర్శనం ఇచ్చావా" అని రోదించసాగాడు. "నువ్వు పండితుడననే అహంకారంతో ఉన్నావు. కానీ ఇతడు పామరుడైనా రాత్రీ పగలూ నన్నే స్మరించాడు కాబట్టి ఇతనికి నా దర్శనం లభించింది. ఈ మారు నువ్వు నా మాటలు వింటున్నావు, మరొక మారు నా దర్శనం అవుతుంది" అని చెప్పి అంతర్ధానమయ్యాడు స్వామి.
ఇది చెప్పి సనందనుడు "ఆ స్వామి ఇప్పుడు కాపాలికుణ్ణి వధించాడు" అన్నాడు. అప్పుడు నరసింహస్వామి శంకరుల వారికీ, సనందునికీ కూడా దర్శనం ఇచ్చాడు. ఆ రోజు నుండీ సనందుడు శంకర భగవత్పాదుల వారి శిష్యుడయ్యాడు. తరువాతి కాలంలో అతనే పద్మపాదునిగా ప్రసిద్ధి గాంచాడు.
◆నిశ్శబ్ద.