పెద్దల మాటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి యక్షప్రశ్నలలో ఏముందంటే..

 

పెద్దల మాటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి యక్షప్రశ్నలలో ఏముందంటే..

మహాభారతంలోని అరణ్యపర్వంలో యుధిష్ఠిరుడికీ, యక్షుడికీ మధ్య జరిగిన సంభాషణకు చాలా ప్రాముఖ్యం ఉంది. వాడుకలో ఉన్న 'యక్షప్రశ్నలు' అన్న జాతీయం ఆ కథ నుంచి పుట్టినదే. తన మాట కాదని, సరస్సులోని నీటిని తాగబోయిన భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ మరణించేలా చేస్తాడు. సరస్సును అధీనంలో ఉంచుకున్న ఓ యక్షుడు. ఆఖరికి ధర్మరాజు వస్తాడు. అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి, హాయిగా నీళ్ళు తాగమంటాడు యక్షుడు. మహాబలపరాక్రమ సంపన్నులైన తన నలుగురు తమ్ముళ్ళకూ ఆ దుర్గతి కల్పించిన యక్షుడు సామాన్యుడు కాడని యుధిష్ఠిరుడు గ్రహించాడు. తెలిసినంతలో జవాబు చెబుతాను, ప్రశ్నలు అడగమంటాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఎంతో ఆసక్తికరమైనవి. ధర్మరాజు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన ధర్మజుని నలుగురు తమ్ముల్ని బ్రతికించాడు. ఆ యక్షుడే యమధర్మరాజు.

'యక్షప్రశ్నల' ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరిలో వస్తుంది. ఆ ఘట్టంలో యక్షుడు అడిగిన చిత్రమైన ప్రశ్నలు, వాటికి ధర్మజుడు ఇచ్చిన జవాబులలో మూడింటిని తెలుసుకుంటే..

యక్షప్రశ్న: ఆదిత్యుణ్ణి తూర్పున ఉదయించేటట్లు ప్రేరేపించేదెవరు? ఆయనకు సమీపంగా ఉండేదెవరు? సూర్యాస్తమయం కావించేదెవరు? ఆయనకు ఆధార భూతమైనదేది?

ధర్మజుని జవాబు: సూర్యోదయాన్ని నిర్దేశించినవాడు బ్రహ్మ. సూర్యుడి సమీపాన ఉండేది దేవతలు. ధర్మమే సూర్యాస్తమయానికి కారణం. ఆ మహాత్మునికి సత్యమే ఆధారం.

యక్షప్రశ్న: ఏది ఒక మనిషిని శ్రోత్రియుణ్ణి చేస్తుంది? దేనివల్ల అతడు అందరి పొగడ్తలకూ పాత్రుడవుతాడు? ఎలా ఒకడు ద్విజుడవుతాడు? ఓ రాజా! దేని వల్ల మనిషి విజ్ఞుడవుతాడు?

ధర్మజుని జవాబు: శ్రుతి జ్ఞానం వల్ల శ్రోత్రియుడవుతాడు. తపఃశక్తి వల్ల అందరి పొగడ్తలకూ పాత్రుడవుతాడు. జ్ఞానం వల్ల ద్విజుడవుతాడు. పెద్దల సలహా తీసుకునేవాడు బుద్ధిమంతుడవుతాడు.

యక్షప్రశ్న: బ్రాహ్మణునికి ఆపాదించిన దైవత్వమేది? ఏ సుగుణాల వల్ల వారు సాధువులవుతారు? ఏ కార్యాల వల్ల అపవిత్రులవుతారు?

ధర్మజుని జవాబు: వేదాధ్యయనమే బ్రాహ్మణునికి దైవత్వాన్ని ఆపాదింపజేస్తుంది. తపోశక్తి మాత్రమే వారిని పవిత్రులుగా చేసే నిత్య పవిత్ర కర్మ. పరనింద వారి అపవిత్ర నడత. 

పై ప్రశ్నలు, సమాధానాలలో రెండవది గమనిస్తే ఇప్పటి కాలంలో చాలామంది పెద్దల మాటను కొట్టి పడేస్తుంటారు. పెద్దలంతా తమ స్వార్థం కోసం పిల్లల మీద పెత్తనం చేస్తారని అనుకుంటారు. కానీ అది తప్పు. పెద్దల మాటల్లో భవిష్యత్తు ఉంటుంది. ఇది అందరూ తప్పక అర్థం చేసుకోవాలి. 

                                         *నిశ్శబ్ద.