దక్షిణదిక్కు గురించి సుగ్రీవుడు ఏమి చెప్పాడు?

 

దక్షిణదిక్కు గురించి సుగ్రీవుడు ఏమి చెప్పాడు?

వినతుడికి తూర్పు దిక్కువైపు ఎలా వెళ్ళాలో చెబుతూ తూర్పు వైపు ప్రాంతాల గురించి అణువణువు అద్భుతంగా వర్ణించి చెప్పిన తరువాత సుగ్రీవుడు దక్షిణ దిక్కు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 

"నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదులలో వెతకండి, తరువాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతి, అవంతీ నగరాలని వెతకండి.

విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుఱ్ఱ, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణి నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలలు కలిగిన రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు.

 అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకము వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి" అన్నాడు.

ఆ విధంగా సుగ్రీవుడు దక్షిణ దిక్కు గురించి, ఆ వైపు ఉన్న ప్రాంతాల గురించి అక్కడ ప్రమాదాలు, విశేషాల గురించి ఎంతో అద్భుతంగా వివరించాడు.

◆వెంకటేష్ పువ్వాడ.