సుగ్రీవుడి జ్ఞానం వెనుక రహస్యం!

 

సుగ్రీవుడి జ్ఞానం వెనుక రహస్యం!

సుగ్రీవుడు శతబలి అనే వానరుడిని పిలిచి " శతబలి! నువ్వు లక్ష వాసరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోగానాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసులు, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు.

కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్ధపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుండి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది. అక్కడ శంకరుడు రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి" అని చెప్పాడు.

అన్ని విషయాలు విని రాముడు ఆశ్చర్యపోయి "సుగ్రీవా!! ఇన్ని దిక్కులలో ఉన్న ప్రాంతాలలో విశేషాలు అన్ని నీకు ఎలా తెలుసయ్యా. ఇంత జ్ఞానం ఎక్కడిది నీకు" అని అడిగాడు.

"రామా!! వాలి నన్ను చంపడానికి నన్ను వెంబడించేవాడు. నేను పారిపోయేవాడిని. అలా ఈ భూమండలం అంతా తిరిగాను. చివరకు హనుమంతుడు నాతో వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడు అని చెబితే అక్కడిజి వెళ్లి దాక్కున్నాను" అని చెప్పాడు.

◆వెంకటేష్ పువ్వాడ.