పరమాత్మ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడు?

 

పరమాత్మ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడు?

 


రసోహమప్పు కొత్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః॥ ప్రణవః సర్వవేదేషు శబ్దః భే పౌరుషం నృషు||


కుంతీకుమారుడవైన ఓ అర్జునా! జలంలో ఉన్న రుచి, సూర్యచంద్రులలో ఉన్న ప్రకాశము, వేదములలో, శాస్త్రములలో అంతర్లీనంగా ఉన్న ఓం కారము, ఆకాశంలో నుండి ఉద్భవించే శబ్దము, మానవులలో ఉన్న అహంకారము, ఇవన్నీ నేనే,


పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు. మానవులకు ఒక సహజలక్షణం ఉంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడం, శైవులకు శ్రీశైలంలో, కాశీలో, వైష్ణవులకు శ్రీరంగంలో, రామభక్తులకు అయోధ్యలో, శాక్తేయులకు కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఇలాగా ఎవరి ఇష్టదైవం ఎక్కడో ఒకచోట ఉన్నారు అని అనుకోవడం అక్కడకు వెళ్లడం అక్కడ కూడా నాకు అది కావాలి. ఇది కావాలి అని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించడం దీనినే భక్తి అనుకుంటున్నాము. అటువంటి వాళ్లకు శ్రీకృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయం చిన్ని చిన్ని ఉదాహరణలతో ఈ శ్లోకంలో చెప్పాడు. 


నీటిలో రుచి, సూర్యుడు, చంద్రుడు వీటిలో ఉన్న ప్రకాశము, వేదములలో ఓంకారము, ఆకాశంలో శబ్దము, మనుష్యులలో అహంకారము, పరాక్రమము, వీరత్వము, పౌరుషము, ఇవి అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములు అన్నీ పరమాత్మే. అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతములు కనపడతాయి. ఆకాశము లోనుండి శబ్దము, రసమునకు జలము, ఓంకారము వాయుస్వరూపము, ప్రకాశము అగ్ని, మానవ శరీరము భూమి. అంటే పంచభూతములలో నేనే అంతర్లీనంగా ఉన్నాను. ఈ లక్షణములను విడదీయలేము. 


సూర్యచంద్రులు వేరు, వాటి ప్రకాశమువేరు కాదు. అలాగే  జలము వాటి రుచి వేరు కాదు. వేద శాస్త్రములలో ప్రతి మంత్రము ఓం తో మొదలవుతుంది. ఓం లేనిదే మంత్రమే లేదు. వేదశాస్త్రములను చదవలేని వారు, కనీసం ఓంకారము జపిస్తే చాలు అని పెద్దలు చెబుతారు. మణిహారంలో దారంలాగా నేను అన్నిటిలో అంతర్లీనంగా ఉన్నాను అని ప్రకటించాడు. దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు.


మనం మానవులు కాబట్టి మన లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి. మానవునికి అహంకారము, (సాత్వికాహంకారము), పౌరుషం, పరాక్రమము, వీరత్వము, వీటన్నికీ మించి మానవత్వము సహజలక్షణాలు. కాని కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. మానవులు మానవులుగా బతకడం మానుకున్నారు. మానవత్వం మరిచిపోయారు. అమానవీయత సహజలక్షణంగా మారిపోయింది. మానవులు మానవత్వం మరిచి క్రూరత్వం అవలంబించడం ఎంత అసహజమో, మానవులకు దీనత్వము కూడా అంతే అసహజలక్షణము. 


మానవులకు దీనత్వము, దైన్యము పనికి రాదు. ఎంత కష్టము వచ్చినా, ధైర్యంగా ఎదుర్కోవాలి. నీరసపడి పోకూడదు. సుఖదుఃఖములు సమానంగా చూడాలి. చిరునవ్వుతో భరించాలి. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి. అంతేకానీ ఏడువు ముఖంతో ఉండకూడదు. మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు. అతి చిన్న కారణాలకు ఆత్మహత్యాప్రయత్నాలు మానుకోవాలి. అందుకే పౌరుషం నృషు అంటే నరులలో పౌరుషం నేను అని పరమాత్మ ప్రకటించాడు. ధైర్యంగా పౌరుషంగా ఉండటం పరమాత్మ లక్షణము, ఆ లక్షణం మనం కష్టసమయములలో విడిచిపెట్టకూడదుని ఈ విధంగా అర్థం చేసుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ.