అపర ప్రకృతితో అనుబంధం ఎలా ఉంటుంది?

 

అపర ప్రకృతితో అనుబంధం ఎలా ఉంటుంది?

అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరమధనం చేసారు. అమృతం వచ్చింది. దానవులు దానిని తన్నుకుపోయారు. దేవతలు విష్ణువును శరణు వేడారు. విష్ణువు మోహినీ అవతారంలో దానవులను తన ఆకర్షణలో, మోహములో పడవేసి ఆ అమృత కలశమును దానవుల వద్ద నుండి లాక్కున్నాడు. అమృతాన్ని దేవతలకు దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు. ఈ కథలో మనకు తెలిసిందేమిటి. దానవులు మోహిని ఆకర్షణలో, మోహంలో పడి మోహిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు. కాని దేవతలకు ఆమె నిజస్వరూపము విష్ణువు అని తెలుసు. అందుకని వారు ఆమె మోహంలో పడలేదు. అలాగే మానవులు ఈ అపరా ప్రకృతి నిజము సత్యము ఎల్లప్పుడు ఉండేది అని సమ్మి దాని మోహంలో, ఆకర్షణలో పడుతున్నారు. దానినే అజ్ఞానము అంటారు. 

కాని ఈ నిజం తెలిసిన వాళ్లు (జ్ఞానులు, దేవతలు), ఈ అపరా ప్రకృతి మిథ్య, అసత్యము, నిరంతరం మార్పు చెందుతుంది. అసలైనది, సత్యమైనది, మార్పులేనిది పరా ప్రకృతి అని తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానము. దానవులకు అమృతము అంటే పరమ సుఖము, అంతము లేని సుఖము దొరకలేదు. అదే దేవతలకు అమృతము దొరికింది. మనం కూడా ఈ అపరా ప్రకృతి మాయలో ఆకర్షణలో మోహంలో పడకుండా పరా ప్రకృతి వైపుకు అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి.

మరి అపరా ప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు, మోహితులు అవుతారు. అంటే అది త్రిగుణాత్మకము అయినది కాబట్టి. ఈ మూడు గుణములు మానవులను మోహంలో, మాయలో పడవేస్తాయి. ఈ మూడు గుణములతో కూడిన మాయతో కూడిన జగత్తు అంటే సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు, నాశము లేనిది, గుణములకు అతీతమైనది. పరమమైనది, శాశ్వతమైనది అయిన పరా ప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయలేక పోతున్నాడు. 

కాబట్టి మనం ఎటూ జీవిత కాలం అంతా అపరా ప్రకృతిలో అంటే సంసారంలో మునిగి పోయి, ధనం, భార్య, పిల్లలు, ఆస్తులు పదవులు, కోరికలు అవి తీరడానికి పూజలు, వ్రతాలు, ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి, కోపము, దుఃఖము, నిర్వేదము...... ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ. ఉన్న ఆస్తిని, ధనాన్ని కాపాడుకోవడం, లేని దాని కోసం ప్రాకులాడటం. వీటితో జీవితంలో సగ భాగం గడిపేసాము కాబట్టి ఇకమీదటనైనా నాకు తెలియని, నేను ఆలోచించని, ఆ ఆలోచనలకు అందని, నాకు లభించని పరా ప్రకృతిని గురించిన జ్ఞానమును నాకు అనుగ్రహించు, ఆ మార్గంలో నన్ను నడిపించు. నాకు పరమశాంతిని, పరమ సుఖాన్ని ప్రసాదించు. అపరాప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమ సుఖం శాంతి దొరకలేదో, దానిని నాకు కలుగజెయ్యి. అని భగవంతుని కోరుకోవడమే మన కర్తవ్యము.

అలా కోరుకుంటే ఏమవుతుంది. మనకేం లాభం అని అనుకుంటే దానికి సమాధానం వెంటనే లభిస్తుంది. మనము అపరాప్రకృతి వైపుకు నిరంతరం ఆకర్షింపబడుతున్నాము. అపరా ప్రకృతిలోని విషయాలను అనుభవించడానికి నానా తంటాలు పడుతున్నాము. కాని అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాము. 


దీనికి ఒకటే మార్గము. 

హరిద్వార్లో గంగానదీ వేగము ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి, గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసును పట్టుకొని ఎంత సేపైనా గంగానదిలో స్నానం చేయవచ్చు. ఏమీకాదు. అలాగే మనం మన మనసును, అంతఃకరణను పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి అంటే పట్టుకొని, ఈ అపరా ప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు. గొలుసు మాత్రం వదలకూడదు. వదిలితే ఈ అపరాప్రకృతి మోహంలో పడి కొట్టుకుపోతాము అనే విషయం గ్రహించాలి. అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ నమ్మకం కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మదే అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ అపరా ప్రకృతిలో ఎంతసేపు విహరించినా, ఆ కర్మబంధనములు మనకు అంటవు. నిశ్చింతగా ఉంటాము. పరమానందాన్ని పొందుతాము.

◆వెంకటేష్ పువ్వాడ.