అసలైన యోగం ఎలా ఉంటుంది??

 

అసలైన యోగం ఎలా ఉంటుంది??

ఎల్లప్పుడూ విహిత కర్మలు అంటే మంచి కర్మలు చేయాలి. ఆ కర్మలు కూడా నిష్కామంగా, ఎటువంటి కోరికలు తీరడానికి కాకుండా, కేవలం సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. రోజుకు రెండూగా ఆహారం తీసుకోవాలి. వేళకు మితంగా నిద్ర పోవాలి. ఎక్కువ జాగరణలు చేయకూడదు. ఎవరితోనూ అతిగా ప్రవర్తించకూడదు. ఇలా అన్నీ చేయడాన్ని యోగము అని అంటారు. అటువంటి యోగం అవలంబిస్తే సకల దుఃఖముల నుండి విముక్తికలుగుతుంది. అంతే కానీ నా ఇష్టం వచ్చినట్టు తింటాను, తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను. అర్ధరాత్రి దాకా మేలుకొని ఉంటాను, ఉదయం తొమ్మిది దాకా ముసుగు తియ్యను అని చాలా మంది అంటుంటారు. అలా చేయడం గొప్పగా అనుకుంటూ ఉంటారు. కాని పై నియమాలు పాటించకపోతే ఒక్క ధ్యానయోగమే కాదు ఏ యోగమూ కుదరదు. ఒక వేళ బలవంతంగా ధ్యానంలో కూర్చున్నా తగిన ఫలితములు లభించవు.


 ధ్యానమే కాదు, రోగానికి మందు వేసుకున్నా, ఆ మందు తగిన మోతాదులో వేసుకుంటేనే పని చేస్తుంది కానీ, ఇష్టం వచ్చినట్టు వేళాపాళా లేకుండా వేసుకుంటే పని చేయకపోగా వికటిస్తుంది. కొంతమంది ఆవేశంగా ధ్యానయోగం మొదలు పెట్టి నిద్రాహారాలు మాని, అదే పనిగా ధ్యానం చేస్తారు. అది వికటించి రోగాల పాలవుతారు. నెపం ధ్యానయోగం మీదికి నెడతారు. ధ్యానయోగం చేయడం వలన నాకు ఈ రోగం వచ్చింది అని ప్రచారం చేస్తారు. యోగము సక్రమంగా చేస్తే దుఃఖములు పోగొడుతుంది కానీ దుఃఖములు కలిగించదు. అందుకే ఏ పని చేసినా, ఏ ఆహారం తీసుకున్నా యుక్తంగా అంటే తగినంతగా సరిపోయినంతగా, మితంగా ఉండాలి. అప్పుడే మనము అన్ని దుఃఖముల నుండి విముక్తి పొందుతాము.


ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. యుక్తం అంటే కేవలం ఆహారము శరీర పోషణకే కాదు మనసును కూడా ప్రశాంతంగా ఉంచేదిగా ఉండాలి. దానినే సాత్వికాహారము అని అంటారు. సాత్వికాహారం తీసుకుంటే మనసు, ఆ మనసుతో చేసే ఆలోచనలు ఆ ఆలోచనలకు అనుగుణంగా చేసే కర్మలు కూడా సాత్వికంగానే ఉంటాయి. అటువంటి ఆహారము ఎలా ఉండాలో ఏమేం తినాలో, ఎంత తినాలో, ఏ యే వేళల్లో తినలో, ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. 


విహారము అంటే మన ప్రవర్తన. మన ప్రవర్తన మన శరీరాన్ని, మనసును కానీ, ఇతరుల శరీరాన్ని, మనసును కానీ, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సాత్వికంగా ఉండాలి. ఎక్కడకు వెళ్లాలి. ఎక్కడకు వెళ్లకూడదు, ఎవరితో స్నేహం చేయాలి. ఎవరి స్నేహాన్ని వదులుకోవాలి. ఇపన్నీ ఎవరికి వారు, తమ మంచికోరి, సమాజం మంచి కోరి, నిర్ణయించుకోవాలి. అలాగే మనం చేసే పనులు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి అతి పనికిరాదు. చాలా మంది అధికంగా ధనం సంపాదించాలనే ఆశతో ఓవర్ టైములు చేస్తుంటారు. ఆరోగ్యం పాడుచేసుకొని ఆ సంపాదించిన అధిక ధనం వైద్యులకు ఇస్తుంటారు. ఇది కూడా పనికి రాదు. పగలంతా పని చేసిన తరువాత శరీరానికి విశ్రాంతి అవసరం. దానికి ఉపకరించేది నిద్ర, కాబట్టి వేళకు నిద్రపోవాలి. అధికంగా మేలుకోకూడదు. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతవరకే నిద్రపోవాలి. లేకపోతే సోమరితనం అలవడుతుంది. 


పైనియమాలు అవలంబించిన వాడికి ధ్యానయోగం అలవడుతుంది. ఆ యోగం అతని దుఃఖములను పోగొడుతుంది. అలా కాకుండా సైనియమములను పాటించకుండా ధ్యానయోగం అవలంబిస్తే ఉన్న దుఃఖాలకు తోడు కొత్త వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఒక్క ధ్యానయోగమే కాదు ఏ యోగం అవలంబించినా పైన చెప్పబడిన నియమములు అవలంబించడం అవసరం అప్పుడే ఆ యోగం మన దుఃఖములను నివృత్తి చేస్తుంది. మనసుకు పరమ శాంతిని చేకూరుస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ.