వ్యవసాయాత్మికా బుద్ది నిర్వచనం!!

 

వ్యవసాయాత్మికా బుద్ది నిర్వచనం!! 


వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యననాశ్చ బుద్ధయో౨ వ్యవసాయినామ్ ||

నిష్కామ కర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కోసం కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు. ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావము ఉండకూడదు.

అలాగే నిశ్చయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూత అద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడివిడిగా ఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.

వ్యవసాయాత్మికా బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం, స్థిరంగా ఉంచుకోవడం. ఎవరికైనా బుద్ధి స్థిరంగా, నిశ్చయం లేకుండా, చంచలంగా ఉంటే వాడు ఏ పనీ సక్రమంగా చేయలేడు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్చయమైన బుద్ధి అవసరము. అంటే మన మనసును, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చేసే పని మీదనే ఉంచాలి. అటు ఇటు పోనివ్వకూడదు. మనం ఏం చెయ్యాలి. ఏం సాధించాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి. తరువాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి. అంతే కానీ ముందు ఏదో ఒక కర్మ మొదలు పెట్టి దాని మీద మనసు పెట్టకుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము. అలా కాకుండా ఒక నిశ్చయం, లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. ఏ పనిమీదా ధ్యాస ఉండదు. అన్ని పనులు మొదలు పెడతాడు. ఏ పనీ పూర్తిగా చేయడు. చివరికి అభాసుపాలు అవుతాడు.

ఏ మానవుడికైనా జీవితాశయము ఒకటి ఉండాలి. దానిని బట్టి అతని జీవన విధానము ఉంటుది. ఉన్నతమైన ఆశయములు కలవారి జీవన విధానము కూడా ఉన్నతంగా ఉంటుంది. అతడు ఉన్నత శిఖరములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా అల్ప బుద్ధి కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి. వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి. కొంతమంది ఈ జీవితం అశాశ్వతము, క్షణికము అని దీని గురించి ఆలోచించరు. చచ్చిన తరువాత స్వర్గలోక సుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆ స్వర్గలోకము కూడా శాశ్వతము కాదు అని వారికి తెలియదు. మరి కొంతమంది ఇవేమీ కాదు మోక్షమే అసలైన పరమ పదము అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గం అనుసరిస్తారు. ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులుకలిగి ఉంటారు.

అందుకని మానవులను రెండు విధములుగా విభజించాడు కృష్ణుడు. వ్యవసాయాత్మికా బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మికా బుద్ధి కలవారు. వ్యవసాయాత్మికా బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏకా భవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మార్పు చెందదు. స్థిరంగా ఉంటుంది. అవ్యవసాయినామ్ అంటే స్థిరమైన బుద్ధి లేని వాళ్లు. వారి బుద్ధి బహుశాఖా: అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అనంతంగా ఉంటుంది అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది. ఏ ఒక్కదాని మీదా బుద్ధినిలువదు. మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే ఎక్కువగా కనపడుతుంటారు. ఏపనీ నిలకడగా చెయ్యరు. పూర్తి చెయ్యరు. ఎవరు ఏది చెబితే దానిని నమ్ముతారు. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాము కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీదా నిలకడగా ఉండదు. దేవుళ్లలో భేదబుద్ధిని కల్పిస్తాడు. ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే దేవుళ్లను మారుస్తుంటాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు. పరమాత్మ ఒక్కడే అని తెలిసినా, దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు. ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తాడు. అదే గీతలో సారంగా రెండవ అధ్యాయంలో చెబుతాడు కృష్ణుడు.

◆ వెంకటేష్ పువ్వాడ