శివరాత్రి స్పెషల్ ఆర్టికల్ వందే శివం శంకరమ్ ...

 

శివరాత్రి స్పెషల్ ఆర్టికల్ వందే శివం శంకరమ్ ... 

 

 

 

 

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే |


జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||


"మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"శివ'' పదాన్ని ద్వివచనముగా చేసి, ద్వంద్వ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, పరమేశ్వరులని అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర సంజనితమే. అందుకే వారిరువురు ఈ జగత్తుకు తల్లిదండ్రులైనారు. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.

 

 

 

 


"శివం'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు మంగళప్రదాత. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే -


        "సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే


         శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''


అని కీర్తిస్తాం. "వందేశివం'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు.

 

 

 

 


"శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "జడుడు'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే సర్వం వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే;;. ఆయన కదలడు. ఈ సృష్టినంతటినీ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం''



        "పూర్ణమదః పూర్ణమిదం పూర్ణత్పూర్ణముదచ్చతే |


          పూర్ణస్య పూర్ణమాదాయ పూరనమేవావశిష్యతే ||


అని :ఈశావాస్యోపనిషత్తు'' శివతత్త్వాన్ని కీర్తిస్తుంది. అదే ఆద్యంతాలు లేని ఈశ్వరతత్త్వం.
ఓం నమోభగవతేరుద్రాయ :
ఇది దశాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రం కృష్ణయజుర్వేదంలో "శ్రీరుద్రప్రశ్నః'' అధ్యాయంలో వుంది. "భగవంతుడైన రుద్రునకు నమస్కారం'' అని అర్థం. వేదం, శివుని .. "రుద్రుడు'' అని కీర్తిస్తుంది.

 

 

 

 


"రుద్రుడు'' అంటే ఎవరు? ఈ శబ్దం "రోదః''అణు పదం నుంచి పుట్టింది. రోదనము అంటే ఏడుపు. సృష్టిలో తొలిసారిగా రోదించినవాడు ... "శివుడు'' అప్పుడు ఆయన నేత్రాలనుండి జారిపడ్డ అశ్రుబిందువులే "రుద్రాక్షలు'' అయినాయి. శుభములు ప్రసాదించే మంగళకరుడగు శివునకు రోదించాల్సిన అవసరం ఏమొచ్చింది?
సృష్టి ఆదిలో నారాయణుని నాభికమలం నుంచి "పంచముఖ బ్రహ్మ'' జన్మించాడు. కన్నులు తెరచి చూసాడు బ్రహ్మ. ఎటుచూసినా జలమే. "తనే తొలి స్వయంభువుడను'' అని అనుకున్నాడు బ్రహ్మ. ఈ జలానికి ఆద్యంతాలు తెలుసుకోవాలని, కమలాసనం దిగి ఆ జలంలో నడక ప్రారంభించాడు. కొంతదూరం వెళ్ళాక "ఓమ్'' అనే పదం వినబడింది. ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళాడు. అక్కడ తెల్లని దేహకాంతితో, దిగంబరంగా ఒక తేజోమూర్తి ధ్యానం చేస్తూ బ్రహ్మకు కనిపించాడు. "వీడెవడు?'' అనుకున్నాడు బ్రహ్మ. "నాకు అయిదు ముగాలున్నాయి, వీడికి ఒకటే ముఖం వుంది. వీడికన్న నేనే గొప్పవాడిని'' అనే అహంకారంతో బ్రహ్మ ఆ తెజోమూర్తికి ధ్యానం భంగం చేసాడు. ఆ తేజోమూర్తి కన్నులు తెరచి బ్రహ్మవంక చూసాడు. "నేను పంచముఖుడను, నీకన్నా గోప్పవాడను, నన్నే ధ్యానించు, నీకు వరాలు ఇస్తాను'' అని అహంకరించి పలికాడు బ్రహ్మ. ఆ తేజోమూర్తి ఎంతో శాంతంగా బ్రహ్మకు పరబ్రహ్మతత్త్వం చెప్పిచూసాడు. వినలేదు బ్రహ్మ. వెంటనే ఆ తేజోమూర్తి తన ఎడమచేతి చిటికనవ్రేలు గోరును కత్తిలా చేసి,రహ్మ అయిదవ తలను నరికేశాడు. ఈ చర్యతో అహంకారం నశించిన బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. నాటినుండి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు. అయితే నరకబడ్డ ఆ అయిదవ తల, ఆ తేజోమూర్తి చిటికెనవేలును అంటుకునే ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ తలను వదిలించుకోవడం ఆ తేజోమూర్తికి సాధ్యం కాలేదు. వెంటనే "నారాయణ''ధ్యానం చేసాడు. నారాయణుడు ప్రత్యక్షమై, "ఈశ్వరా! బ్రహ్మ శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం ప్రాప్తించింది'' అన్నాడు. "యింత తపస్సు చేసి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నానా!'' అని గట్టిగా రోదించాడు ఆ తేజోమూర్తి. నాటినుంచి ఆయన "రుద్రుడు'' అనే పేరుతొ ప్రసిద్ధినొందాడు. "రోదయతి సర్వమన్తకాలే ఇతి రుద్రః'' ప్రళయకాలమునందు సమస్తమును ఎడ్పించువాడు కనుక "రుద్రుడు'' అని కొందరంటారు.
"రుతౌ ద్రవతి ద్రావయతీతివా, రుద్రః'' "రుతి'' అనగా నాదము. నాదమునందు ద్రవించాడు, ద్రవింపచేయువాడు "రుద్రుడు'' అని కొందరంటారు. "రోరూయమాణో ద్రవతి ప్రవశతి మార్త్యాన్'' శబ్ధరూపముతో మనుష్యుల దేహములందు జీవముగా ప్రవేశించువాడు కనుక "రుద్రుడు'' అని మరికొందరంటారు.
"రుతిం వేదరూపశబ్దం బ్రహ్మణే కల్పాదౌ రాతి'' కల్పాదియందు వేదరూపమయిన శబ్దమును బ్రహ్మకు అనుగ్రహించినవాడు కనుక "రుద్రుడు'' అని ఇంకొందరంటారు. అందుకే రుద్రాద్యాయము "యోరుద్రో అగ్నౌ - యో అప్సుయ ఒషదీషు - యో రుద్రో విశ్వాభువనా అవివేశ - తన్మై రుద్రాయ నమో అస్తు'' అని కీర్తిస్తుంది. "తేజోస్తత్త్వముగల అగ్నియందును, రసస్తత్త్వముగల జలములందును, అన్నమునకుమూల భూతమగు ఓషధుల యందును, సమస్త భువనముల యందును, చరాచర వస్తు రూపముల యందును ఏ రుద్రుడు చైతన్యతత్త్వముతో ప్రకాశించుచున్నాడో అట్టి "రుద్రునకు'' నమస్కారములు'' అని అర్థం.



శ్రీ శివాయ గురవేనమః :

 

 

 

 


శివుని ఆకారంలోనే ఎంతో అర్థం వుంది. ఆయన అర్థనారీశ్వరతత్త్వము ప్రకృతి పురుషుల సమాహారమైన ఈ సృష్టికి సంకేతము. ఆయన త్రినేత్రాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీకలు. ఆయన ధరించే భస్మం, చితాభస్మం. "చివరకు సర్వం కలిసేది నాలోనే'' అనే వేదాంత సారానికి చిహ్నం ...  భస్మం. శివుని చేతిలో ఒక లేడి వుంటుంది. సారంగమంటే లేడి. చంచలమైన మనసుకి అది ప్రతీక. ఇంద్రియనిగ్రహముతో ఆ మనసును అదుపులో పెట్టేవాడు కనుక శివుని "సారంగపాణి'' అంటారు. ఆయన చేతిలోని డమరుకం నుంచే శబ్దశక్తి ఉద్భవించింది. అదే సంగీతానికి వేదం. అందుకే శివుని "నాదలోలుడు'' అన్నారు. ఆయన పదవిన్యాసం నుంచి జనిన్చిందే "నాట్యశాస్త్రం''. ఆయన చేతిలోని రుద్రాక్షమాల, ఆకారం నుండి క్షకారం వరకూ వున అక్షరామాలకు ప్రతీక. అందుకే ఆయన "జగద్గురువు''. కుండలి అంటే నాగము ప్రాణుల దేహములందున్న సప్తచక్రాలలో కుండలి రూపంలో చరించే ప్రానదాతువు ఆయనే. అందుకే ఆయనను నాగాభారణుడు అన్నారు.


"ఈశ ఐశ్వర్యే'' - అష్టైశ్వర్యప్రదాత కనుక, ఆయన "ఈశ్వరుడు''.


"శివ ప్రదత్వాత్ శివః'' - శుభములను ఇచ్చువాడు కనుక ... ఆయన "శివుడు''


"శం సుఖం కరోతీత శంకరః' - సుఖములను ఒసగువాడు కనుక, "శంకరుడు''


"మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవః'' - శ్రేష్ఠుడైన దేవదేవుడు కనుక, "మహాదేవుడు''


"భుక్తానాం ఆర్తిం హారతి ఇతి హరః'' - భక్తుల బాధలు హరించువాడు కనుక, "మహాదేవుడు


"భవతి భావతేవా సర్వమితి భవః'' - అంతా తనే అయివుంటాడు కనుక, "భద్రుడు


"ప్రళయే అపి తిష్టితీతి స్థాణు:'' - ప్రళయ కాలమందు కూడా స్థిరముగా ఉండేవాడు కనుక "స్థాణువు''


"రుద్రం రోదనం ద్రావయతేతి రుద్రః'' - దుఃఖములను పోగొట్టువాడు కనుక, "రుద్రుడు''


"శృణాతిహినస్తి సర్వమన్తకాలే ఇతి శర్యః'' - ప్రళయకాలమందు సమస్తమును దాహించువాడు కనుక "శర్వుడు''


 

 


ఇలా ఆయన ప్రతిపేరిలోనూ మహత్తరమైన అర్థం ఉంది. శివునకు "పశుపతి'' అని మరో పేరుంది. అంటే పశువులకు భర్త అని అర్థం కాదు.


        "బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతా: పశవః పరికీర్తితాః


         తేషాం హాయ్ నాయకో యస్మాత్ శివః పశుపతి: స్మృతాః''


బ్రహ్మ మొదలుగా స్థావర జంగామాత్మకమైన ఈ సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి. ఈ పశువులన్నింటినీ శివుడు నాయకుడు కనుక, ఆయన "పశుపతి'' అయినాడు. అందుకే -
"నం భావాయచ రుద్రాయచ నమశ్శార్వాయచ పశుపతయేచ్''

 

 

 


ఏకాదశరుద్రులు :
సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకారరోపంలో ప్రత్యకేహ్స్మై భక్తులను కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలు బోధిస్తున్నాయి.
"శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ, కపాలి, భవ'' ఇవి ఏకాదశరుద్రుల నామాలు.
శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే "శివుడు''. దిక్కులే అంబరములు [వస్త్రములు]గా గలవాడు కనుక ఆయన దిగంబరుడు.


శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై,  సృష్టి క్రమాన్ని వివరించినవాడే "శంభుడు''


పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే "పినాకి''


స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే "స్థాణుడు''


భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే "భర్గుడు''


గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలు తీర్చేవాడే "గిరీశుడు''


సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే "సదాశివుడు''


హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే :హరుడు''
శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే "శర్వుడు''
కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, "కపాలి''


భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే "భవుడు''

 


ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది.


"శర్వుడు''గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -


"భవుడు''గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -


"రుద్రుడు''గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -


"ఉగ్రుడు'గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి -


"భీముడు''గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -


"పశుపతి''గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి  జీవాత్మను అధిష్టించి -


"ఈశానుడు''గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -


"మహాదేవుడు''గా  తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -


లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత. ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది. "అపర్ణ''యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది.

శివరాత్రి :

 

 

 

 


"శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరి కలయికే "శివరాత్రి''. వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికి నాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తెజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞామోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.

అభిషేకం ఎందుకు చేయాలి ?

 

 

 

 



"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునలు చాలా యిష్టం. ఇందులో అంతరార్థం ఏమిటంటే -
"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం. అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూ


        "శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే


          శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''


శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం. అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అన్డుకేం శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

 

 

 

 


ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే "జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి. నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో "శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి "శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది. "వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

 

 

 

 


అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.


        "శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |


          ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||


          యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |


          తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||


శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు  ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి.
నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, "ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత :

 

 

 

 


శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. సాలగ్రామ దానఫలం,శాత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలం. ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది. "ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.
బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
 
జాగరణ ఎందుకు చేయాలి?

 

 

 

 



క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది. "జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, పేకాట ఆడుతూ గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.

శివుడు నిరాడంబరుడు :

 

 

 

 


శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు. మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడే ఆయన ఆక్రుతే చెబుతుంది.
శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైలసంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు. ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు. ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.
ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరాకూ తెలిసినదే.
బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శిఅపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు. అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే "శివరాత్రి'' మహత్యం.

 

 

 

 


రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.
శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు.
శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు. ఇలా చెబుతూ పొతే ఎందరో మహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి.
అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని;; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలు లేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.

 

 

 

 


దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యేవేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర ... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారేవరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే.. ఇది చాలదా మనజన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?


        - భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.


        - ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప.


        - తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.


అందుకే "మహాశివరాత్రి'' నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం.


        "ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |


          బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమ్ ||

---- సర్వం శివార్పణం ----

 

రచన : యం.వి.యస్. సుబ్రహ్మణ్యం


E-Mail : WriterMVS@gmail.com