శివరాత్రి  రోజు ఇలా చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం తథ్యం..!

 


శివరాత్రి  రోజు ఇలా చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం తథ్యం..!

 

 

శివరాత్రి భారతీయులకు చాలా ఇష్టమైన పర్వదినం.  ఈ శివరాత్రి రెండు విధాలుగా ఉంటుంది.  ఒకటి మాస శివరాత్రి అయితే.. రెండవది మహాశివరాత్రి.  ప్రతిపరమేశ్వరుడు సాగర మథనం నుండి వచ్చిన విషయాన్ని చాలా ప్రియంగా సేవించి ఆ విషాన్ని తన గరళంలో నిలుపుకున్నాడని,  ఆ బాధ నుండి స్వామి కోలుకోవడం కోసం శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయని చెబుతారు.  ఈ రోజున ఉపవాసం ఉండటం,  శివారాధన,  అభిషేకాలు మాత్రమే కాకుండా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా చేస్తారు.  శివరాత్రి రోజు  కొన్ని పనులు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.  ఇంతకీ శివరాత్రి రోజు ఏం చేయాలో తెలుసుకుంటే..

శివరాత్రి రోజు వీలైనంత వరకు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.  ఇలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది.  సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు చేసే పంచాక్షరీ జపం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.

శివుడిని అబిషేక ప్రియుడు అని అంటారని అందరికీ తెలిసిందే.. పాలు,  గంగాజలం, గంధం, తేనె,  పెరుగు, నెయ్యి తో శివుడికి అభిషేకం చెయ్యాలి.  అబిషేకాల వల్ల శివుడు సంతృప్తి చెందుతాడు.

బిల్వ పత్రాలు అంటే శివుడికి చాలా ప్రీతి.  శివ పూజలో బిల్వపత్రాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి.  బిల్వపత్రాలు ఎక్కువగా దొరికితే.. 108 బిల్వపత్రాలు తీసుకుని 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్ర అర్చన చేయాలి. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది.

మహాశివరాత్రి అంటే చాలా మందికి జాగరణ,  ఉపవాసం గుర్తు వస్తాయి. శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివపూజ చేసుకుని ఉపవాసం చేస్తున్నట్టు సంకల్పించుకోవాలి.  కఠినమైన ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయకూడదు. దీని వల్ల అసలు దేవుడి మీద సరిగా శ్రద్ద పెట్టలేరు. కాబట్టి పాలు, పండ్లు తీసుకోవచ్చు.  సాయంత్రం శివుడి దర్శనం చేసుకుని రాత్రంతా జాగరణ చెయ్యాలి. మరుసటి రోజు ఉదయాన్నే శివాలయ దర్శనం చేసుకుని ఆ తరువాత ఉపవాసం విరమించాలి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం,  జాగరణ రెండూ చేసినవారు మరుసటి రోజు రాత్రి అయ్యేవరకు  నిద్రపోకూడదు.  ఇలా చేస్తే శివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితం పూర్తిగా లభిస్తాయి.

శివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం.  ఈ రోజు శివాలయాలలో రుద్రాభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. ఈ అభిషేకం జరగకపోయినా, కనీసం కనులారా దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంట్లో శివలింగం ఉన్నవారు రుద్రం, నమకం చమకం ఆడియో పెట్టుకుని అయినా రుద్రాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే  ఇంట్లో అభిషేకం చేసుకునే రోజు ఇల్లంతా చాలా శుచిగా ఉండాలి.

చాలామంది శివరాత్రి జాగరణ చేయడం కోసం సినిమాలు చూడటం,  ఆటలు ఆడటం, పార్టీలు చేసుకుంటూ మేలుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ శివరాత్రి జాగరణ రోజు శివపురాణం చదువుకోవాలి. శివుడి గూర్చి కథలు, పురాణాలు చదువుకోవాలి. ఇలా చేస్తే శివుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఎవరికి వారు చదువుకోకపోయినా కనీసం ఇతరులు పారాయణ చేస్తున్నప్పుడు దాన్ని వినడం అయినా చేయాలి.. ఇలా శివుని మీద మనసు నిలిపి ఆ రోజంతా గడపడం వల్ల శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.


                                       *రూపశ్రీ.