మరణానికి 5 నిమిషాల ముందు ఏం కనిపిస్తుంది!

 

మరణానికి 5 నిమిషాల ముందు ఏం కనిపిస్తుంది!

ఆత్మ ఒక శరీరం నుండి పూర్తీగా బయటకు వెళ్ళిపోయే సమయాన్నే మరణ ప్రయాణంగా పరిగణిస్తారు. గరుడ పురాణంతో సహా అనేక మత గ్రంథాలు, మరణానికి ముందు చివరి ఐదు నిమిషాలలో మరణించబోయే వ్యక్తి కళ్ల ముందు ఏమి జరుగుతుందో, ఆత్మకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటో తెలుపుతాయి.  నమ్మకాల ప్రకారం,  మత గ్రంథాలు బోధించిన విషయాల ప్రకారం మరణానికి 5 నిమిషాల ముందు మరణించబోయే వ్యక్తికి కనిపించేది ఏంటో తెలుసుకుంటే..

మత నమ్మకాల ప్రకారం వ్యక్తి మరణించే ముందు, వారు జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నీ వారి కళ్ల ముందు మెరుపులా మెరుస్తాయట. కొన్ని నిమిషాల వ్యవధిలోనే, తాము ఎవరికి సంతోషాన్ని కలిగించామో, ఎవరిని బాధపెట్టామో వారికి స్పష్టంగా తెలుస్తుందట. ఈ సమయంలోనే పశ్చాత్తాప భావన చాలా తీవ్రంగా ఉంటుందట.

దైవ దర్శనం..

గరుడ పురాణం ప్రకారం  మరణపు చివరి క్షణాలలో వ్యక్తి శ్వాస భారంగా మారి, మాటను కోల్పోతాడు. వారికి లౌకిక దృష్టికి బదులుగా దైవిక దృష్టి లభించడం వల్ల వారు కోరుకున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడలేరు.

చెడు పనులు చేసేవారు యముని భయంకర దూతలను చూస్తారు, వారిని చూసి చనిపోతున్న వ్యక్తి భయపడతాడు. సత్కర్మలు చేసేవారు విష్ణుమూర్తి దూతను లేదా దివ్య కాంతిని చూస్తారట, అది వారికి అపారమైన శాంతిని ఇస్తుందట.

చివరి నిమిషంలో జరిగే మార్పులు..

పంచేంద్రియాలు పనిచేయడం మానేస్తాయి,  ప్రాపంచిక బంధాలు ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆత్మను స్వాగతించడానికి మరణించిన పెద్దల ఆత్మలు  మరణించబోయే వ్యక్తి ముందు ప్రత్యక్షం అవుతారట. అయితే వీరు ఎవరికి కనిపించరు.  చివరి క్షణంలో ఆత్మ శరీరం నవరంధ్రాలలో ఒకదాని ద్వారా బయలుదేరడానికి సిద్ధమవుతుందట.

పూర్వీకులు, దైవతల దర్శనాలు..

వ్యక్తి తన చివరి క్షణాలలో తన పూర్వీకులను చూస్తారని చెబుతారు.  ఆత్మ యొక్క ముందుకు సాగే ప్రయాణాన్ని ఆశీర్వదించడానికి పూర్వీకులు వస్తారట.  అంతేకాకుండా, జీవితాంతం పూజించే దేవతా స్వరూపం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందట.

భవద్గీతలో వ్యక్తి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏ ఆలోచనలో ఉంటాడో, అదే జీవిత స్థితిని పొందుతాడని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అందువల్ల ఆత్మ సంచరించకుండా మోక్షాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో, మరణ సమయంలో రామనామాన్ని లేదా భగవంతుని నామాన్ని జపించమని సనాతన ధర్మం చెబుతుంది.

                              *రూపశ్రీ.