మూడు పూటలా రూపం మార్చుకునే ధారి దేవి గురించి తెలుసా!

 

మూడు పూటలా రూపం మార్చుకునే ధారి దేవి గురించి తెలుసా!

భారతదేశం దేవాలయాకు నిలయం. ఎన్నో రాష్టాలలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.  వాటిలో ఉత్తరాఖండ్ లో కొలువై ఉన్న ధారి దేవి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రధానంగా కాళికా దేవిని పూజిస్తారు. ధారి దేవి ఆలయం భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ధారి దేవిని నాలుగు పుణ్యక్షేత్రాల రక్షకురాలిగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మూడు పూటలా తన రూపాన్ని మార్చుకుంటుందట.  ఉదయం బాలిక లాగా,  మధ్యాహ్నం యువతిగా,  సాయంత్రం వృద్ధురాలిగా రూపం మార్చుకుంటుందట.  ఎంతో ఆసక్తికరమైన ధారి దేవి ఆలయం గురించి తెలుసుకుంటే..

ధారి దేవి ఆలయం ఎక్కడుందంటే..

ధారి దేవి ఆలయం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో, శ్రీనగర్- రుద్రప్రయాగ్ మధ్య ఉన్న కలియాసౌద్‌లో, అలకనంద నది ఒడ్డున ఉంది. ఇది ఒక పురాతన , రహస్యమైన ఆలయంగా పరిగణించబడుతోంది. కలిసౌర్ దేవిగా కూడా పిలువబడే ధారి మాత, భక్తికి అధిదేవత. దేశ నలుమూలల నుండి భక్తులు ధారి దేవి  ఆశీర్వాదం కోసం పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక పురాతన గుహ కూడా ఉందట.

రూపాన్ని మార్చుకునే విగ్రహం..

ఆలయంలోని ధారి మాత విగ్రహం రోజుకు మూడుసార్లు రూపం మార్చుకుంటుందని ప్రజలు నమ్ముతారు. ఉదయం  ఒక చిన్న బాలికగా, మధ్యాహ్నం ఒక మహిళగా, చివరగా సాయంత్రం ఒక వృద్ధురాలిగా దర్శనమిస్తుందట.

ఆలయ ప్రత్యేకత..

ఒక ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు  ఒక భయంకరమైన వరద  వచ్చిందట. ఈ వరదలో ఒక ఆలయం కొట్టుకుపోయిందట.  అప్పుడు  ధారో గ్రామానికి సమీపంలో ఉన్న ఒక బండరాయిపై ధారి దేవి విగ్రహం మాత్రం  ఒంటరిగా మిగిలిపోయిందట. ఆ విగ్రహం రోదిస్తున్న శబ్దాన్ని  గ్రామస్తులు విన్నారట. దీంతో గ్రామ ప్రజలు తిరిగి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారట. ఆ తర్వాత గ్రామస్తులు ఆ విగ్రహాన్ని అదే ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠించారట.

2013 కేదార్‌నాథ్ వరదలకు కొద్ది రోజుల ముందు, కొన్ని పనుల కారణంగా ఆలయాన్ని వేరే చోటికి తరలించారని మరో ప్రసిద్ధ నమ్మకం . దేవత ఆగ్రహం వల్లే ఆ వరదలు సంభవించాయని స్థానికులు నమ్ముతారు. ఆ తర్వాత, అదే ప్రదేశంలో ఆలయాన్ని పునర్నిర్మించి, దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కారణంగానే ఈ ఆలయం ఇంతగా పూజించబడుతుంది.

ఛార్ ధామ్ యాత్రతో అనుబంధం..

ధారి దేవి ఆలయంలోని దేవతను ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా , చార్ ధామ్‌ల సంరక్షకురాలిగా పూజిస్తారు.  ఈ ఆలయం 108 శక్తి స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.  ఇక్కడ ధారి దేవి విగ్రహంలోని పై సగభాగాన్ని (తల) మాత్రమే పూజిస్తారు, అయితే కింది సగభాగాన్ని రుద్రప్రయాగ్‌లోని కాళిమఠ్‌లో పూజిస్తారు. ధారి మాతను దర్శించుకోకుండా చార్ ధామ్ యాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది .  ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ సందర్భంగా కాళీసౌర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

                            *రూపశ్రీ.