డబ్బు గురించి భారతీయ ధర్మం ఏమి చెబుతుంది?

 

డబ్బు గురించి భారతీయ ధర్మం ఏమి చెబుతుంది?

ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచం  అంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బు లేకపోతే మనిషి మనుగడ కొనసాగడం కష్టం ఈ కాలంలో.. 

డబ్బు గురించి, మనిషి వెంట చివరగా ఏమి వస్తుంది అనే విషయం గురించి ఒక శ్లోకం ఉంది...

ధనాని భూమౌ పశవశ్చ గోష్టే నారీ గృహద్వారే, జనః శ్మశానే 

దేహాశ్చితాయాం పరలోక మార్గే, కర్మానుగో గచ్ఛతి జీవఏకః 


సంపాదించిన ధనం భూమిపై ఉండిపోతుంది. పశువులు గోష్ఠంలో మిగిలిపోతాయి. భార్య గృహద్వారం వద్ద ఆగిపోతుంది. బంధుజనులు శ్మశానం వరకూ వస్తారు. దేహం చితిలో కాలిపోతుంది. పరలోకమార్గంలో, జీవుడిని వెన్నంటి వచ్చేది కర్మఫలం మాత్రమే.

ధనం సంపాదించాలి. ధనం వల్లనే సమాజంలో వ్యక్తి గౌరవమర్యాదలు పొందుతాడు. ధనం వల్ల విధ్యుక్తకర్మలు చింత లేకుండా నిర్వ హించగలుగుతాడు. ధనం వల్ల బంధువులలో గౌరవం పొందుతాడు. ధనం వల్ల భార్య ప్రేమ పొందుతాడు. ధనం వల్ల సంతానం నుండి ప్రేమాదరణలు అందుకుంటాడు. ధనం లేనివాడు పూచిక పుల్లకు కూడా కొరగాడు. ధనం లేనివాడికి ఎంత తెలివి ఉండి కూడా లాభం లేదు. ఇలా ధన సంపాదన ఆవశ్యకతను నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది భారతీయధర్మం. ధనాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి పవిత్రంగా, గౌరవంగా చూస్తుంది.

అయితే మానవుడిలోనే లోభత్వమన్నది అంతర్గతంగా ఉంది. అన్నీ తనకు కావాలనే ఆశతో పాటే, తన వద్దనే ఉండాలన్న ఆలోచనా మనిషికే ఉంది. జంతువులకు ధనంతో పని లేదు. అవి ఆహారం వెంటపడతాయి. ఆహారం కోసం పరుగులిడతాయి, వేటాడతాయి, కొట్లాడుకుంటాయి. కానీ కడుపు నిండగానే వేటి దారిన అవి పోతాయి. దాచుకోవాలన్న భావన వాటికుండదు. చీమలు ఆహారం దాచుకుంటాయి. కానీ, అది అందరి కోసం సామూహికంగా దాచుకుంటాయే తప్ప ఒక్క చీమ తన కోసం దాచుకోవటం ఉండదు. ఓ చక్కెర స్ఫటికాన్ని పక్కగా పెట్టుకుని దొంగతనంగా ఒక్క చీమే తినటం జరగదు. ఇది ఒక్క మనిషికే సాధ్యం.

మనిషి గొప్ప తాత్త్విక చింతనలు చేయగలడు. గొప్ప సిద్ధాంతాలు ఊహించగలడు. గొప్ప గొప్ప సాంకేతిక పరికరాలను సృజించగలదు. కానీ తనకేం కావాలో, ఎంత కావాలో మనిషికి తెలియదు. తమ కడుపు నిండటం జంతువులకు, క్రిమికీటకాలకు తెలుస్తుంది. ఎంత తినాలో, ఎంత తింటే తమకు శక్తి వస్తుందో వాటికి తెలుసు. కానీ మనిషికి తెలియదు.

ఎంత తినాలో, ఎంత శక్తి అవసరమో తెలియదు. అందుకని తింటూనే పోతాడు. అలా అవసరాన్ని మించి తింటాడు. స్థూలకాయం వచ్చి అనారోగ్యం పాలై, మళ్ళీ ఒళ్లు తగ్గించుకోవాలని కష్టపడతాడు. సంపాదన విషయంలో కూడా అంతే. ఎంత సంపాదిస్తే సరిపోతుందో మనిషి తెలియదు. ఎంత సంపాదించినా సరిపోదు. రేపేమవుతుందో. నన్న బెంగ పట్టిపీడిస్తూనే ఉంటుంది. పైగా సంపాదించింది అంతా తానే దాచుకోవాలన్న తపన మనిషిని పట్టి పీడిస్తుంది. దీన్ని లోభత్వమంటారు. ధనం గురించి మర్మాన్ని తెలుసుకోకపోతే  లోభత్వం మనిషిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. 

                                       ◆నిశ్శబ్ద.