మనిషిలో పాప, పుణ్యాలకు కారణమవుతున్నది ఏది?

 

మనిషిలో పాప, పుణ్యాలకు కారణమవుతున్నది ఏది?

మనిషికి కామం కూడా ఒక గుణంలా సంక్రమించింది. జంతువులకు, ఇతర ప్రాణులకు కామం ఉంటుంది.అయితే మనిషి విషయంలో దానికి ఒక విచక్షణ అనేది ఉంది. అందుకే పరిధి దాటే కామాన్ని పాపం అని కూడా అంటారు. భగవద్గీతలో అర్జునుడు అడిగిన ఒక ప్రశ్నకు కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు.  

కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః| మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణమ్ ||

(రజోగుణ కార్యమైన కామం, అది విఫలమైనప్పుడు జనించే క్రోధం, పాపాచరణకు ముఖ్యకారణాలు. కామం ఎప్పటికీ తృప్తి చెందేది కాదు. ఇది మహాపాపి. జీవుడికి పరమశత్రువు కామమే).

పామేమిటి? పుణ్యమేమిటి? మనుషులను పాపాచరణకు ప్రోత్సహించేదేమిటి? అన్న అర్జునుడి సందేహానికి శ్రీకృష్ణుడిచ్చిన సమాధానం ఇది. ఈ సమాధానంలో యుగాలను బట్టి మారే ధర్మం ప్రసక్తి లేదు. రీతి రివాజుల మాట లేదు. ప్రపంచంలో శాశ్వతంగా నిలిచే ధర్మం ప్రసక్తి ఉంది. శాశ్వత సత్యం ఉంది. యుగాలు మారినా, తరాలు మారినా, పద్ధతులు మారినా మారని సత్యం ఉంది.

సాధారణంగా, కాలాన్ని బట్టి మారేది ధర్మం కాదు, సంప్రదాయం. 'సంప్రదాయం’ అంటే 'సంక్రమించేది' అని అర్థం. అంటే ప్రతియుగంలో, సాంఘిక జీవితంలోని అంశాలు ఒక తరం నుండి మరో తరానికి అందేవన్నీ సంప్రదాయం కిందికే వస్తాయన్నమాట. గత తరం కొత్త తరానికి 'సంప్రదాయం' అనే ధనాన్ని ఇస్తుంది. ఆ మూలధనాన్ని కొత్త తరం ఆమోదిస్తే ఆ సంప్రదాయం నిలుస్తుంది. తిరస్కరిస్తే ఆ సంప్రదాయం అంతరిస్తుంది. దాని స్థానంలో కొత్త పద్ధతి వస్తుంది.

ఒకప్పుడు బాల్యవివాహాలు సంప్రదాయంగా ఉండేవి. బాలిక కన్య కాగానే పెళ్లి చేసేయటం ఆచారంగా ఉండేది. పరిస్థితులు మారాయి. పద్ధతులు మారాయి. బాల్య వివాహాల అవసరం తీరింది. ఇప్పుడు చలామణిలో ఉన్న పరిస్థితులలో బాల్యవివాహాలు జరపమని, నిర్బంధించినా, జరిపేవారు కనబడరు.

అలాగే భర్త మరణిస్తే అదే చితిలో మరణించే 'సతి' సంప్రదాయం ఉండేది. ఇప్పుడది లేదు. అంటే, ఇప్పుడు దాని అవసరం లేదు. ఇవన్నీ కాలాన్ని బట్టి మారే పద్ధతులు.

సాధారణంగా, సమాజం ఓ పద్ధతిలో, ఓ బాటలో నడుస్తూంటుంది. ప్రతిభా వంతుడైనవాడు, అందరూ నడిచే బాటను కాదని ముళ్ల దారిలో ఓ కొత్త బాటను ఏర్పరుస్తాడు. అతడు ఏర్పరచిన బాటలో మిగతావారు నడవటం ఆరంభిస్తే, ఆ బాట బాగా నలుగుతుంది. అదొక సంప్రదాయంగా మారుతుంది. పాత సంప్రదాయం వెనక్కు వెళ్తుంది. కొన్నాళ్లకు అదృశ్యమైపోతుంది. లోకం రీతి ఇది. 

కోరికలు అలల్లాంటివి. అవి ఆగటం అంటూ ఉండదు. తీర్చుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. దీనికి యుగంతో సంబంధం లేదు. మారే కాలంతో సంబంధం లేదు. కోరిక లేనిదే, ప్రపంచమే లేదు. కాబట్టి ప్రపంచం ఉన్నంత కాలం కోరికలుంటాయి. అన్ని కోరికలు తీరవు. తీరిన కోరిక కొత్త కోరికకు కారణమైతే, తీరని కోరిక నిరాశను కలిగిస్తుంది. క్రోధాన్ని కలిగిస్తుంది. ఇవి విచక్షణను హరిస్తాయి. చక్షణరహితమైన చర్య పాపకార్యానికి దారి తీస్తుంది.

అంటే, మనుషులను పాపం వైపు ఎవరు నెడుతున్నారన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు, బయటవారు కాదు, మనిషిని పాపం వైపు అతడి మనసులో జనించే కోరికలే నెడుతాయని స్పష్టంగా చెప్తున్నాడన్నమాట. అంటే, మనిషికి శత్రువు బయట ఎక్కడో ఉండడన్నమాట. అతడి మనసులోనే శత్రువు దాగి ఉన్నాడు. తన మనసులో నిరంతరం జనిస్తున్న కోరికల స్వరూపాన్ని గ్రహించి, వాటి పట్ల ఆసక్తిని నశింపచేసుకోవటం మనిషి కర్తవ్యం. ఈ విషయం ప్రస్తుత కాలంలో వారు తెలుసుకుంటే బయట జరుగుతున్న ఎన్నో అకృత్యాలు ఆగుతాయి కూడా.

                                           ◆నిశ్శబ్ద.