గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంత గొప్ప ఫలితమా..
గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంత గొప్ప ఫలితమా..
గురువారం రోజు విష్ణువును పూజించడం చాలా శుభప్రదం. గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. విష్ణువు ఆరాధనకు గురువారం చాలా శ్రేష్టం కూడా. అలాగే గురువారం రోజు విష్ణు సహస్రనామాన్ని జపించడం, పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయని అంటారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
గురువారం విష్ణువును పూజించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. గురువారం రోజు విష్ణువు సంబంధించిన మంత్రాలను జపించడం, పసుపు రంగు దుస్తులు ధరించడం, ఉపవాసం ఉండటం వల్ల శ్రీ హరి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. హిందూ ధర్మం విష్ణువును లోక రక్షకుడిగా పేర్కొంటుంది. శాస్త్రాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని నిర్మలమైన భక్తితో జపించేవారు దుఃఖం, జీవితంలో కలిగే అడ్డంకుల నుండి విముక్తి పొందుతారని చెబుతారు.
విష్ణువు వెయ్యి నామాలైన విష్ణు సహస్ర నామాలను ప్రతిరోజూ జపించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. భక్తులు ముఖ్యంగా వైశాఖ, కార్తీక, శ్రావణ మాసాలలో విష్ణువును తప్పనిసరిగా పూజిస్తారు.
విష్ణువు ఎలా ఆవిర్భవించాడు?
పురాణాలు, శివపురాణం ప్రకారం.. విష్ణువు శివుని శరీరం నుండే ఉద్భవించాడు. పురాణ కథనం ప్రకారం శివుడు ఒకసారి పార్వతి దేవికి విశ్వాన్ని పర్యవేక్షించడానికి ఒక దైవం అవసరమని చెప్పాడట. అప్పుడు శివుడు తన ఎడమ చేతితో అమృతాన్ని తాకాడట. అలా తాకగానే ఒక ప్రకాశవంతమైన జీవం ఉద్భవించిందట. ఇలా ఉద్బవించిన జీవానికి విష్ణువు అని పేరు పెట్టారు. ఆయన తేజస్సు విశ్వమంతా వ్యాపించింది. శివుడు విశ్వ సంక్షేమ బాధ్యతను ఆయనకు అప్పగించాడట. శివుని ఆజ్ఞ ప్రకారం విష్ణువు తీవ్రమైన తపస్సు చేశాడట. ఫలితంగా ఆయన తేజస్సు నీటిని ఉత్పత్తి చేసిందని, ఆ నీటి నుండి విశ్వం ఏర్పడిందని చెబుతారు.
క్షీరసాగర నివాసం..
ఉపనిషత్తులు లక్ష్మీదేవి క్షీర సాగర మథనం సమయంలో ఉద్భవించి, విష్ణువుకు భార్యగా మారినట్టు వర్ణించాయి. అందుకే లక్ష్మీదేవిని సంపద, శాంతి, శ్రేయస్సుకు అధి దేవతగా పిలుస్తారు.
విష్ణువు ప్రధానంగా పూజలు అందుకునే ప్రధాన తీర్థయాత్రలలో ఒకటైన విష్ణుప్రయాగ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. అలకనంద, ధౌలిగంగ నదుల సంగమం వద్ద ఉన్న ఈ ప్రదేశం భక్తులకు భక్తి కేంద్రం, ఇది చాలా పురాతన ఆలయం. ప్రతి గురువారం తప్పకుండా విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణు ఆరాధన, తులసి సమర్పణ వల్ల జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి.
*రూపశ్రీ.