అనారోగ్యానికి అద్బుతమైన పరిష్కారం చూపే ఈ అధ్యాయం గురించి తెలుసా!

 

అనారోగ్యానికి అద్బుతమైన పరిష్కారం చూపే ఈ అధ్యాయం గురించి తెలుసా!

 

భారతదేశంలో గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది.  ముఖ్యంగా ఆధ్యాత్మిక,  దైవిక శక్తులున్న గురువులు అనేక మంది ఉన్నారు. అయితే గురువులలోకి సర్వ శ్రేష్టుడు అని చెప్పదగినవారు దత్తాత్రేయ స్వామి.  దత్త సాంప్రదాయం భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది.  దత్తాత్రేయ స్వామిని నమ్మినవారు, ఆయన కరుణకు పాత్రులైన వారు ఎంతో మంది ఉన్నారు.  దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి ఒక గొప్ప మార్గం ఏదైనా ఉందంటే అది గురుచరిత్ర పారాయణం.  గురుచరిత్ర పారాయణ చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఒక్కో సమస్యకు ఒక్కో అధ్యాయం అద్బుతంగా పనిచేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంతకూ గురుచరిత్రలో ఏ అధ్యాయం పారాయణ చేస్తే అనారోగ్యాలు పరిష్కారం అవుతాయో.. ఎలా పారాయణ చేయాలో తెలుసుకుంటే..

గురుచరిత్రలో అధ్యాయాలు చాలా శక్తివంతమైనవి.  అనారోగ్య సమస్యలు ఏవైనా బాధిస్తున్నా,  ఎంత ప్రయత్నించినా ఆరోగ్య సమస్యలు తగ్గకపోయినా గురు చరిత్రలో 13వ అధ్యాయం అద్బుతమైన ఫలితాలను ఇస్తుంది.   అటు వైద్యం చేయించుకుంటూ.. ఇటు గురు చరిత్రలో 13వ అధ్యాయాన్ని ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత విధిగా పారాయణ చేయాలి. ఆ తరువాత ఈ అధ్యాయానికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని 108 సార్లు భక్తితో జపం చేయాలి. ఇలా చేస్తే ఎంతటి అనారోగ్యాన్ని అయినా దత్తాత్రేయ స్వామి నయం చేస్తాడు.  ఇక్కడ కావాల్సిందల్లా నమ్మకం, భక్తి.

గురుచరిత్రలోని ఈ 13వ అధ్యాయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దత్తాత్రేయ అవతారం అయిన నృసింహ సరస్వతీ స్వామి వారు  బాసర యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు శూల రోగంతో బాధపడుతూ చాలా చిత్రవధ అనుభవిస్తూ ఇక నేను బ్రతకడం ఎందుకు అని బాధతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు.  అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే సమయానికి నృసింహ సరస్వతి స్వామివారు గమనించి తన శిష్యులతో అతన్ని తన దగ్గరకు తీసుకురమ్మని చెబుతారు.  అతను ఏం తిన్నా తీవ్రమైన కడుపునొప్పి వచ్చేది. అలాంటి వ్యక్తికి షడ్రసోపేతమైన పరమాన్నంతో కూడిన భోజనమే ఔషధం అని చెప్పి విందు బోజనం పెట్టించి మరీ అతని అనారోగ్యాన్ని పోగొడతాడు.  ఈ అధ్యాయం పారాయణ చేసి,  ఈ అధ్యాయానికి అనుసంధానంగా వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు  ఇచ్చిన శ్లోకాన్ని 108 సార్లు జపం చేయాలి. ఇలా చేస్తే భక్తిని బట్టి సమస్య పరిష్కారం అవుతుంది.

శ్లోకం..

భూమిం ప్రదక్షిణీ కృత్య
సశిష్యో వీక్ష్య మాతరం
జహారా ద్విజ శూలార్తిం
శ్రీ దత్త శరణం మమ

అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ప్రయత్నాన్ని తప్పకుండా చేసి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొంది ఆరోగ్యాన్ని పొందవచ్చు.

                                 *రూపశ్రీ.