భగవంతుని పదిహేడవ అవతారం వ్యాసుడు

 

 

భగవంతుని పదిహేడవ అవతారం వ్యాసుడు

 

 

 

గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :

 

గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :

 

గురుశిష్య సాంప్రదాయం ఏనాటి నుంచి మొదలైనప్పటికీ, వేదవ్యాసుడినే ఆది గురువుగా తలుస్తారు. మహాభారత మహాకావ్యాన్ని రాసిన వేదవ్యాస మహర్షి జన్మించన ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఆ రోజున ప్రతి వ్యక్తి, సంస్థ గురువులను  పూజించి,  శక్తి అనుసారం దక్షిణ సమర్పించుకుంటారు. 


గురుపూజ ఎందుకు...  

సంపూర్ణ వ్యక్తిగా రూపొందాలంటే ఏ వ్యక్తికైనా గురు భక్తి కావాలి.  నిస్వార్థంగా సర్వస్వం సమర్పించగల గుణం కూడా అలవడాలి. వేదవ్యాసుని జన్మదినంగా చెప్పబడుతోన్న'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' రోజున, ప్రతి ఒక్కరూ తమ గురువుని వ్యాసుడిగా భావించి పూజించాలి.


వేదాలు బోధించిన ఆదిగురువు 

వ్యాసుడు అనేది పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. శ్రీమద్భాగవతంలో 21 అవతారాల గురించి గల వివరాలున్నాయి. అందులో 17 అవతారం వ్యాసుడిదని  చెప్పబడి వుంది. ఆయనను వేదవ్యాసుడనే కాక పరాసరాత్మజుడు అని బాదరాయణుడు, కృష్ణుడు, కృష్ణ ద్వైపాయనుడు అనే పేర్లు కూడా వున్నాయి. 


ఏక రూపంలో వున్న వేదాన్ని 4 శాఖలుగా చేసి తన నలుగురు శిష్యులకు బోధించినవాడు. పైలునికి ఋగ్వేదం, వైశంపాయునికి యుజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అధర్వణ వేదం బోధించి, వాటిని వారిచే ప్రచారం చేయించాడు. అలా వేదాలను తరతరాలు నిలిచేలా చేసాడు కాబట్టి ఆయనను వేదవ్యాసుడని పిలుస్తారు.


వ్యాస భగవానుడి సందేశం

వ్యాస భగవానుడు మనకు ఇచ్చిన మహా సందేశము ఒక్కటే.  ఇతరుల తీరు ఏదైతే మనని బాధపెడుతుందో ఆ విధంగా మనం ఇతరులతో ప్రవర్తించవద్దు అని. పరమ ధర్మాలన్నింటిలోకి పరమోత్తమమైన ఈ ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తే సమాజంలో శాంతి సదా నెలకొంటుంది.