భీష్మాష్టమి.. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన రహస్యం.. ఈ రోజు ఇలా తప్పక చేయండి..!

 

భీష్మాష్టమి.. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన రహస్యం.. ఈ రోజు ఇలా తప్పక చేయండి..!

మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమి తిథికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ శుక్ల సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటే.. మాఘశుద్ద అష్టమి తిథిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు.  ఈ సంవత్సరం ఈ పవిత్రమైన తిథి  జనవరి 26న వచ్చింది. మహాభారతంలోని గొప్ప యోధుడు  అయిన భీష్మ పితామహుడు స్వచ్ఛందంగా తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. హిందూ ధర్మ నమ్మకాల ప్రకారం ఈ రోజున పూర్వీకులను ప్రార్థించడం, వారిని సంతోషపెట్టడం వల్ల  జాతకంలో సమస్యలు తొలగడమే కాకుండా..  పితృ శాపం కూడా తొలగిపోతుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు.

భీష్మ పితామహ తర్పణం ఎందుకు చేస్తారు..

భీష్మ పితామహుడు ఆజన్మ బ్రహ్మచారి.  అంటే ఆయన పెళ్ళి చేసుకోలేదు.  బ్రహ్మచారిగా ఉండిపోయాడు.  అందుకే ఆయనకు  శ్రాద్దం లేదా తర్పణం చేయగల పిల్లలు లేరు. ఆయన భక్తి,  త్యాగానికి సంతోషించిన శ్రీకృష్ణుడు, భీష్మ అష్టమి నాడు తర్పణం వదిలితే ఆయన   సంతృప్తి చెందుతాడట.  దీనివల్ల తర్పణం వదిలిన వారి  జీవితంలో పితృదోషం ఉంటే అవి తొలగిపోతాయని,  పితృ దోషంతో కలిగే  అశుభ ప్రభావాలు తగ్గుతాయని వరం ప్రసాదించాడు. ఈ రోజున తర్పణం చేయడం వల్ల ఏడు తరాల పూర్వీకులను సంతృప్తి పరుస్తుందని, కుటుంబానికి ఆనందం,  శాంతి లభిస్తుందని కూడా నమ్ముతారు.


పరిహారాలు..

భీష్మాష్టమి  రోజున నల్ల నువ్వులు,  బెల్లం దానం చేయడం వల్ల రాహు-శని యొక్క దుష్ప్రభావాల నుండి,  పితృ శాపాల నుండి ఉపశమనం లభిస్తుంది.

సాయంత్రం వేళల్లో దక్షిణం వైపు దీపం వెలిగించాలి.  లేదా రావి చెట్టు కింద దీపం ఉంచాలి.

భీష్మాష్టమి రోజున తామస ఆహారం తీసుకోకూడదు.  అలాగే  వాదనలకు దూరంగా ఉండాలి.  పితృదేవతల పట్ల భక్తి కలిగి ఉండాలి.  ఇవన్నీ పితృదోషాలు తొలగిపోవడానికి, వాటి ప్రభావం తగ్గడానికి సహాయపడతాయి.

భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చూసినప్పుడు విష్ణువును స్తుతిస్తూ అశువుగా చెప్పిన వెయ్యి నామాలే విష్ణు సహస్రనామాలు.  భీష్మాష్టమి నాడు విష్ణుసహస్రనామాలు పారాయణ చేసినా భీష్ముడి అనుగ్రహం,  అటు విష్ణుమూర్తి అనుగ్రహం, పితృదేవతలు సంతృప్తి పడటం జరుగుతాయి.    

                               *రూపశ్రీ.