పదకవితకు పుట్టినరోజు
పదకవితకు పుట్టినరోజు
రచన : య.వి.యస్. సుబ్రహ్మణ్యం
అచ్చతెనుగు నుడికారపు అందాన్ని తెలుగునేలపై నర్తింపచేసిన వాగ్గేయకారుడు "అన్నమయ్య". పదకవితకు పట్టుపావాడ కట్టి, పంటసీమల పరువులెట్టించిన పదకవితా పితామహుడు "అన్నమయ్య". సప్తగిరీశుని శృంగార వైభవానికి అక్షర రూపమిచ్చి సరస రసజ్ఞుల మనోనేత్రానికి అద్వైతానందాన్ని ఆవిష్కరింప చేసిన శృంగార సంకీర్తనాచార్యుడు "అన్నమయ్య". ద్రవిడ ప్రబంధాలతో, కన్నడ కస్తూరి గీతాలతో, సంస్కృత భాషా సరస్వతి వేదనాదాలతో సేవలందుకునే శ్రీ వేంకటనాథునికి తేనెలొలుకు తేటతెనుగు పాటల పల్లకిలో తిరుమాడవీధులలో ఊరేగాలని వేడుకయింది కాబోలు ... అరిషడ్వర్గాలను తెగనరికే తన "నందక'' ఖడ్గాన్ని తెనుగు నేలపై నరునిగా జన్మించమని పంపాడు.
15వ శతాబ్ధికాలంలోని కడపమండలానికి చెందిన "తాళ్ళపాక'' గ్రామం. అది దేవతల విహారభూమి. అక్కడున్న దేవాలయాలను ఆధారంగా చేసుకుని కొన్ని నందవరీకస్మార్త బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ వంశస్థులకు మూలపురుషుడు "నారాయణయ్య''. ఇతని కుమారుడే "నారాయణసూరి'' వీరిది "భరద్వాజ గోత్రం''. నారాయణసూరి అచిరకాలంలోనే సకలవిద్యలలోను ప్రవీణుడయ్యాడు. యుక్తవయస్సు రాగానే "లక్కమాంబ'' అను కన్యను వివాహం చేసుకున్నాడు. లక్కమాంబ గొప్ప విష్ణుభక్తురాలు. వివాహమయి చాలా కాలమయినా లక్కమాంబ కడుపు పండలేదు. సంతానం కోసం ఆ దంపతులు ఆపదమొక్కులవానికి ముడుపు కట్టుకుని ఆ తిరుమలేశుని సన్నిధికి చేరుకున్నారు. గరుడస్తంభం దగ్గర లక్కమాంబకు ఒక దివ్యానుభూతి కలిగింది. స్వామివారి "నందకం'' ఆమె గర్భాలయంలో ప్రవేశించింది. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందిన ఆ పుణ్యదంపతులు తాళ్ళపాక చేరుకున్నారు. లక్కమాంబ గర్భవతి అయింది. నారాయణ సూరి ఆనందానికి అవధులేవు. కాలం ఎంత వేగంగా పరుగెత్తిందంటే, చూస్తుండగానే తొమ్మిదినెలలు గడిచిపోయాయి. లక్కమాంబకు ప్రసవవేదన మొదలయింది. ఆ రోజు వైశాఖ పౌర్ణమి, విశాఖ నక్షత్రం. ఆ శుభసమయం లో, మూడుగ్రహాలు ఉచ్ఛదశలో ఉండగా ... "అన్నమయ్య'' అవనిపై అవతరించాడు.
ఉగ్గుపాలతో ... భక్తిపాలు :
లక్కమాంబ ఉగ్గుపాలతోనే శ్రీనివాసునిపై భక్తిపాలు రంగరించి అన్నమయ్యకు పట్టించేది. గోరుముద్దలతో పాటే వేంకటేశమంత్రాన్ని అన్నమయ్యకు తినిపించేది. కూనిరాగంతో ఆ కోనేటిరాయుని పేర జోలపాటలు పాడుతూ అన్నమయ్యను నిద్రపుచ్చేది. ఇక తండ్రి నారాయణసూరి రామాయణ, భారత, భాగవత గ్రంథాలు రాగయుక్తంగా గానం చేస్తూ, తాత్పర్యాన్ని వివరిస్తూ అన్నమయ్యకు వినిపించేవాడు. ఇక అన్నమయ్యకు హరిభక్తి అబ్బక ఏమవుతుంది? అన్నమయ్యకు ఉపనయన సంస్కారం అయింది. శాస్త్రాధ్యయనం ఇంటివద్దనే సాగింది. ఏకాసంతగ్రాహి అయిన అన్నమయ్యకు అచిరకలంలోనే అన్ని విద్యలు కరతలామలకాలయినాయి. అతని మాట అమృతమయ కావ్యంగా, పాట రాగరసమయ గానంగా భాసించింది.
దారిమళ్ళిన వేళ :
అన్నమయ్యకు నూనుగు మీసాల యవ్వనప్రాయం చిగురించింది. అతని ఆ ప్రాయమంతా ప్రకృతి ఒడిలోనే సాగింది. భావావేశంతో పదాలు పాడుతూ .. చిందులువేస్తూ అల్లరిచేసే తన కొడుకును ఇలాగే వదిలేస్తే చెడిపోతాడనే భావనతో నారాయణసూరి, అన్నమయ్యను అడవికివెళ్ళి దర్భ కోసుకురమ్మన్నాడు. అన్నమయ్య కొడవలి తీసుకుని అడవికి వెళ్ళాడు. శ్రీపతి గానంతో దర్భలు కోస్తున్నాడు. అలవాటులేని పని కనుక అతని చిటికెన వ్రేలు తెగి రక్తం కారింది. అది చూసి అతనికి ప్రపంచంపైన విరక్తి కలిగింది. ఈ భవబంధాలన్నీ అబద్ధాలు, అశాశ్వతాలు అని తలచాడు. ఈ బంధుత్వాలు హరిభక్తికి అవరోధాలు అని భావించాడు. ఇంతలో "గోవింద గోవింద" అని గానాలు చేస్తూ ఓ భక్తబృందం ఆ అడవిదారిలో తిరుపతి వెడుతోంది. అంతే ...
అన్నమయ్య చేతిలో కొడవలి జారింది.
అతని అడుగు ఆ భక్తబృందాన్ని అనుసరించింది.
అతని దారి దామోదరునివైపు మళ్ళింది.
"వేడుకొందామా వేంకటగిరి వేంకటేశుని'' అని పాడుతూ తిరుపతి చేరుకున్నాడు. భక్తులతో పాటు కొండ ఎక్కుతున్నాడు.మధ్యాహ్న సమయానికి మోకాళ్ళపర్వతం చేరుకున్నాడు. భక్తబృందం ముందుకు వెళ్ళిపోయారు. ఒకవైపు ఆకలి, మరొకవైపు అలసటతో అన్నమయ్య ముందుకు వెళ్ళలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అమ్మలగన్నయమ్మ అలిమేలు మంగమ్మ మాతృహృదయం కరిగి పెద్దముత్తైదువలా అన్నమయ్య దగ్గరికి వచ్చింది. ప్రసాదాలు తినిపించి అతని ఆకలి తీర్చింది. సేదతీరిన అన్నమయ్య కొండ ఎక్కలేని తన అవస్థను ఆ తల్లికి చెప్పుకున్నాడు. "నాయనా! ఈ పర్వతం సాలగ్రామమయం ఇక్కడ కనిపించే ప్రతిచెట్టు మహామునులకు ప్రతిరూపాలు. దేవతల విహారభూమి అయిన ఈ కొండను చెప్పులున్న కాళ్ళతో ఎక్కరాదు" అని బోధించి అదృష్యురాలు అయింది. వచ్చిన ఆ తల్లి అలమేలుమంగమ్మ అని గుర్తించాడు అన్నమయ్య. తన అదృష్టానికి పరవశించి చంపకొత్పలాల, శతకమాలికతో ఆశువుగా ఆ తల్లిని అర్చించాడు. తిరుమలవైపు నడక సాగించాడు. సుదూరతీరాన ఆ స్వామి ఆలయశిఖరం కనిపించింది. మధ్యమావతి రాగంలో "అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగల మయము'' అని సంకీర్తించి, సంతసించి, స్వామి పుష్కరిణిలో స్నానమాడి, స్వామిని దర్శించుకున్నాడు. ఆ క్షణమే అతని జీవనగతిని మార్చింది. "పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా'' అణు సంకీర్తనతో ప్రారంభమైన ఆ సంకీర్తన స్రవంతి 32వేలు వరకు సాగింది.
రవిగాంచని కవిగాంచును :
తేటతెనుగు నుడికారానికి, అచ్చతెనుగు తియ్యదనానికి అన్నమయ్య సంకీర్తనలు ఓ "అమరకోశము''. ఆ వాగ్గేయకారునీ సాహితీస్రవంతిలో సగభాగం శృంగారం ప్రవహిస్తే, మిగిలిన సగభాగం ఆధ్యాత్మిక, వైరాగ్య భావనలు అలలు అలలుగా సాగాయి. కవి విశృంఖలుడు, అతను దర్శించని తావులేదు. ఇందుకు అన్నమయ్యే ప్రత్యక్షసాక్షి. అలమేలుమంగ, శ్రీనివాసుల శృంగార వైభవాన్ని తన మనోనేత్రంతో దర్శించి, భక్తజనుల మనోఫలకాలపై చెరగని సాహితీముద్రలు లిఖించి, తాను తరించి, మనలను తరింప చేసినవాడు అన్నమయ్య.
- చెక్కుటద్దాల చక్కదనాల మంగమ్మ చెక్కిలిపై సిగ్గుల మొగ్గలు పూయించాడు.
- శృంగార సరిగంచుగల సాహితీ సంకీర్తనా వలువలను మంగమ్మకు చుట్టబెట్టి, కామ జనకుని సేవలకు ప్రణయ ప్రబంధ నాయకిగా ఆమెను నడిపించాడు.
"చూడరమ్మ సతులాల సోబాన బాడరమ్మ
కూడున్నది పతి జూడి కూడా నాచారి''
- శృంగార సంగ్రామ క్షీరసాగర మథనంలో మంగమ్మ సొమ్మసిల్లిపోయిన తీరు తన సంకీర్తనతో మన కళ్ళముందు ఉంచాడు అన్నమయ్య.
"పలుకు తేనెల తల్లి పవళించెను
కలికి తనమున విభుని కలసినదిగాన''
- నిత్య పెళ్ళికొడుకు శ్రీనివాసుడు
నిత్య పెళ్ళికూతురు మంగమ్మ. వారిరువురి కళ్యాణవేడుక మన కళ్ళకు కమనీయ కానుక.
"పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు''
ఈ సంకీర్తన వినని ఆంధ్రుడు, తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు.
32వేల సంకీర్తనల వైభవాన్ని మూడుమాటల్లో చెప్పడం సాహసమే అవుతుంది. తన శృంగార, సాహితీ పుష్పాలతో శ్రీహరిని సంకీర్తించిన అన్నమయ్య పదకవితలకు పరవశించిన ఆనాటి ప్రభువు సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యను ఆస్థాన గాయకుని చేసి, తనను సంకీర్తించమన్నారు.
"నరహరి కీర్తన నానిన జిహ్వ బరుల నుతింపనేరదు'' అని తిరస్కరించాడు అన్నమయ్య. పగబట్టిన ప్రభువు అన్నమాచార్యునికి 'మూరురాయగండ' సంకెల బిగించి చెరసాలలో వేయించాడు.
"ఫాలనేత్రానల ప్రభల'' అంటూ నరహరిని సంకీర్తించి, శరణుకోరాడు అన్నమయ్య. అతని సంకెలలు నేలజారాయి. చెర తొలగింది. తప్పు తెలుసుకున్న ప్రభువు అన్నమయ్య పాదాలపై వ్రాలి శరణు కోరాడు. ఈ సంఘటన అన్నమయ్యలో ఆధ్యాత్మికద్వారాలు తెరిచింది. కులమత భేదభావం నశించింది. జాతివైషమ్యాలు తొలగాయి. ఆనాటి సాంఘిక దురాచారాలపై సాహితీ ధ్వజమెత్తాడు.
"బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే'' అన్నాడు. రాచకొలువు వదిలాడు. తీర్థయాత్రలకు బయలుదేరాడు తన భార్యలు తిమ్మక్క, అక్కలమ్మలతో కలిసి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సంకీర్తనలు, అక్షరరూపం దాల్చాయి.
"హరినామమే కడు ఆనంద కరము''
"వినరో భాగ్యము విష్ణుకథ''
"కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ''
"దేహ మిది యొకటే, దేవుడ నీ వొకడవే''
ఇలా సాగిన అన్నమయ్య సాహితీ విశ్వరూపం జగతిని జాగృతం చేసి, జ్ఞానమార్గంలో నడిపించింది. ఈ అన్నమయ్య కీర్తి కేతనవిహారం, అసూయాపరులకు ఆగ్రహంగా మారి, అవమానంగా తోచింది. ఫలితంగా అన్నమయ్య సంకీర్తనా గ్రంథాలు అగ్నిపాలయ్యాయి. విషయం తెలిసిన అన్నమయ్య అగ్నిదేవునిని ప్రార్థించాడు. కరుణించిన అగ్నిదేవుడు అతని సాహితీ సంపదను సజీవంగా అన్నమయ్యకు అందించాడు. అన్నమయ్య సంకీర్తనానిధికి మరల యిటువంటి దురవస్థ కలగరాదనే సంకల్పంతో సాళ్వ నరసింగరాయలు ఆ సంకీర్తనలను రాగిరేకులపై లిఖించి, వాటికి శాశ్వతత్వం కల్పించాడు.
ఆ సంఘటన అన్నమయ్యలో వైరాగ్యద్వారాలు తెరిచింది.
"నానాటి బతుకు నాటకము
కానక కన్నాది కైవల్యము''
ఈ జేవితమే అంతులేని నాటకరంగం అనే సత్యాన్ని తెలుసుకున్నాడు అన్నమయ్య. తన పుట్టుక లక్ష్యం నెరవేరిందని భావించాడు. తన సాహితీ సంపదను శ్రీనివాసుని పాదాలపై వుంచి ..
"యిది నీ సంపద, దీనిని దాచుకునే భారం నీదే, ఈ భవబంధాల పెనుగులాటలో 96 సంవత్సరాలు పోరాడి, అలిసి పోయాను'' అంటూ ...
"అంతర్యామి, అలసితి, సొలసితి''
అని ఆ దేవదేవుని పాదాలపై వాలిపోయాడు. మరి లేవలేదు. అతని ఆత్మ ఆ అంతరాత్మను చేరింది.
"బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తాకిన పదము''
"ముద్దుగారే యశోద
ముంగిట ముత్తెము వీడు''
"కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు''
"క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం''
"అలరు చెంచలమైన ఆత్మలందుండ
నీ అలవాటు చేసెన నీ ఉయ్యాల''
అంటూ తన సంకీర్తనలతో తెలుగువారిని ఊయలలు ఊపిన ఆ పదకవితా పితామహుడు గతించి శతాబ్దాలు గడిచిపోవుగాక. తన సంకీర్తనల రూపంతో రసజ్ఞుల, రసాగ్రాలపై అనుక్షణం నర్తిస్తూనే ఉంటాడు అన్నమయ్య. ఆ సంకీర్తనాచార్యునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఎందుకంటే సుకవికి మరణం ఉండదు కనుక. ఇది పదకవితకు పుట్టినరోజు కనుక.
"సర్వేజనా సుఖినోభవన్తు''