వినాయకుని వెనుక వింత కథలెన్నో
వినాయకుని వెనుక వింత కథలెన్నో
వినాయక చవితి వస్తోందనగానే తెలుగు రాష్ట్రాలలో కనిపించే సందడి అంతా ఇంతా కాదు. గణేశుడంటే పిల్లాపెద్దా అందరికీ ఇష్టమే. చవితి రోజైతేఆయన కూడా మన ఇంట్లోని సభ్యుడా అన్నంతగా పాలవెల్లి కింద వెలిగిపోతుంటాడు. ఆ రోజు చేసుకునే పూజ చివరిలో వినాయకుని గురించి కొన్ని కథలు ఎలాగూ మనం వింటూనే ఉంటాం. కానీ ఆయన వైభవం గురించి మరెన్నో
కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని...
గరిక వెనుక కథ:
వినాయకుని పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఓ నమ్మకం. ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ ఉంది. పూర్వంయమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు. అగ్ని తత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతిదానినీ బూడిద చేయసాగాడు. అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటూఇటూ పరుగులెత్తసాగాయి. కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతుచూసేందుకు సిద్ధపడ్డాడు. పూర్వం తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా, వినాయకుడు కూడా ఆ అనలాసురుని అమాంతంగా మింగేశాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీఅనలాసురునిది అగ్ని తత్వం కదా! అందుకని అతను వినాయకునిలోవిపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట. గణేశుని తాపం తీర్చేందుకుఅమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది. సాక్షాత్తూ ఆ చంద్రుడే, వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు.అయినా ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. చివరికి తనని గరికతోకప్పివేయమని ఆ ఏకదంతుడే వారికిసూచించాడు. అలా దేవతలంతా తలా 21గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక, ఆ గరికలో ఉండే ఔషధిగుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట! అప్పటి నుంచీ గరక అంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని చెబుతారు.
ఆయుధానికి అభివాదం:
ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలకివెళ్లేందుకు అనుమతించలేదంట వినాయకుడు. వేలెడంత లేని పిల్లవాడు తననిఅడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేశుని మీదకుప్రయోగించాడు. ఆ గొడ్డలి ఎక్కడితో కాదు. సాక్షాత్తూ పరమశివుడేఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధం! పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుని వద్ద ఉన్నా తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేశుడు వినమ్రంగా దానికి నమస్కరించాడట. అప్పుడు దాని ధాటికి అతని దంతం విరిగిపోయింది. అలా గణేశుడు ఏకదంతుడు అయ్యాడు.
వేదవ్యాసునికి సాయంగా:
వినాయకునికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు, తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదట. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. `మీరు భారతాన్ని చెబుతుంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే! కానీ మీరు ఎక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి` అన్న షరతుని విధించాడట గణేశుడు. ఆయన అలాంటి షరతుని విధించడంలో ఒక ధర్మసూక్ష్మం లేకపోలేదు. మనకి తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలయినంత త్వరగా చెప్పగలం. అలాకాకుండా జరిగిన దానికి మన వివరణలూ, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము. అందుకనే టకటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా... `నేను ఆసువుగా భారతాన్ని చెబుతాను సరే! నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా!` అన్న షరతుని ఆయనా విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులూ దొర్లవు, దాని వల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానమూ లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెబుతారు.
కుబేరుని గర్వమణచిన గణేశుడు:
అలకాపురిలో నివాసమున్న కుబేరునికి ఓసారి తన దగ్గర ఉన్న సంపదనంతా ప్రదర్శించాలన్న ఆశ పుట్టింది. అందుకోసం భారీగా ఒక విందుని ఏర్పాటు చేశాడు. ముందుగా శివుని దగ్గరకి వెళ్లి తన విందుకి రమ్మని కోరాడు కుబేరుడు. కుబేరునిలో మొలకెత్తిన గర్వాన్ని గమనించాడు శివుడు. దానిని అణచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడని అనుకున్నాడు. `నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను. కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు` అని కుబేరుని పంపివేశాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. అలకాపురికి చేరుకున్న వినాయకున్ని తన రాజమందింరాలన్నీ తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు. అతనిలోని మదాన్ని గమనించిన గణేశుడు `తిరిగీ తిరిగీ నాకు ఆకలి వేస్తోంది. ఆ విందు భోజనమేదో త్వరగా వడ్డిస్తే నేను బయల్దేరతాన`ని కుబేరునితో అన్నాడు. `ఓస్! అంతే కదా` అనుకుంటూ వినాయకుని షడ్రసోపేతమైన అహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులను ఆదేశించాడు కుబేరుడు. కానీ ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుని ఆకలి తీరడమే లేదయ్యే! చివరికి ఆ రోజు విందు కోసమని వడ్డించిన ఆహారమంతా తరిగిపోయింది. అలకాపురిలో ఆహారపదార్థమన్నదే మిగల్లేదు. ఇక వినాయకుడు పళ్లేలనీ, పండ్ల చెట్లనీ కూడా తినేయసాగాడు. ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుకరాయి కూడా మిగిలేటట్లు కనిపించలేదు. ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకుని శరణువేడాడు. తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుని చేతిలో ఉంచి, వాటిని గణేశునికి ఇవ్వమనీ... అతని ఆకలి తప్పక తీరుతుందనీ శెలవిచ్చాడు. నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుని ఉదరాగ్ని చల్లారింది. కుబేరుని గర్వమూ అణిగింది!
ఇవీ వినాయకుని గురించి కొన్ని విశేషమైన కథలు. పాపభీతి, నీతితో కూడిన ఇలాంటి ధార్మికమైన కథలు మన సాహిత్యంలో అణువణువునా ఉన్నాయి. తెలుసుకున్నవారికి తెలుసుకున్నాంత!
- నిర్జర.